Monday, December 20, 2010

మంగళి కత్తికి బలైన కుర్రాడి మీసం .. ( ఫన్నీ కామెడీ )

"విద్య లేని వాడు వింత పశువు " అని నేను మూడో తరగతి చదువుకునే రోజుల్లో మా బడి గోడలపై రాసి ఉండేది.
అంటే సాధారణం గా ఏ పశువుకైనా ( ఆవు , గేదె , మేక , గొర్రె , గుర్రం, పంది , గాడిద , ఏనుగు etc. )  నాలుగు కాళ్ళు ఉంటాయ్ కాబట్టి వింత పశువు అంటే ఏ డైనోసార్ , గాడ్జిల్లా , కింగ్ కాంగ్ ల లాగా రెండుకాల్లతో అతి పెద్దగా భయంకరం గా ఉంటుంది అనుకునే వాడిని .

దాని అర్ధం ఈ మద్యనే నాకు కొంచెం అటూ ఇటూ గా అర్ధమయ్యింది . "బాష రాని వాడు బలి పశువు " అని .

అసలు  మహారాష్ట్ర లో బార్బర్ షాప్ లో ( సెలూన్ లో ) హెయిర్ కట్ చెయ్యించుకున్నంత బుద్ది తక్కువ పని వేరే ఏదీ ఉండడు. ఎందుకంటే భారతీయులంతా నా సహోదరులు అనే సూత్రాన్ని వీళ్ళు వారి వృత్తి లో తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు.

 మనం ఏ హెయిర్ స్టైల్ కావాలన్నా , వాళ్ళ మూల ప్రమాణాల్ని ఉపయోగించి మరాఠీ  స్టాండర్డ్ ఫార్మాట్ లో (డిప్ప కటింగు (స్క్రూ కటింగ్ కి ఓల్డ్ వెర్షన్ ) + బుంగ మూతి ( ఎంత అందమైన మీసాలన్నా ఒకే బ్లేడు తో నున్నగా గొరిగేస్తారు) ) చేసి , ఏదో ప్రపంచం లో ఉన్న స్టైల్ లు అన్నీ వీళ్ళే కనిపెట్టినట్టుగా ఓ వెకిలి నవ్వొకటి మన మొహాన్న పడేస్తారు.

నేను ఇక్కడికొచ్చిన కొత్తలో నాకు మరాఠీ రాదు (ఇప్పటికీ రాదు ). హిందీ కూడా రాదు (  ఈ మద్య మేనేజ్ చేస్తున్నా ).
మా అన్న ని అన్నా" బ్యాక్ సైడ్ కొంచెం జుట్టు తగ్గించాలి , ఎక్కువ కట్ చెయ్యకూడదు  .ముందు వైపు కూడా అంతే .సైడ్స్ నార్మల్ గా ఉంచాలి " దీన్ని హిందీ లో చెప్పు అని అడిగా .

మర్చి పోకుండా ఓ పేపర్  తీస్కుని  అతను  చెప్పింది  రాయటం  మొదలెట్టాను  .

"పీచే  బాల్  కం  కట్ కరో  , మత్  జ్యాదా  కట్ కరో  . ఆగే  భీ  ఐసా  కరో  . బాజు  మే  నార్మల్  రఖో  "

చీటీ ని జాగ్రత్త  గా  మడిచి  పై  జేబులో  పెట్టుకుని సెలూన్ కి వెళ్లాను . సెలూన్ చాలా  ఖాళీ  గా ఉంది  . ఆహా  నా పంట  పండింది  అనుకుంటూ  వెళ్లి  ఒక చైర్  లో కూర్చున్నాను.

"కైసా కట్ కర్ నేకా " అన్నాడు వాడు నన్ను చూస్తూ .
కితనా ( ఎంత ) అన్నాను నేను.
"పైసా నహీ కైసా , కైసా "అన్నాడు వాడు .

"దేశం ఎలా మారి పోయింది . జుట్టు వాడి చేతిలో పెట్టాకా కూడా డబ్బులో, డబ్బులు , పైస లో  పైసలు అంటూ ఎలా అడుగుతున్నాడో చూడు . అయినా నేనేమైనా డబ్బులు ఇవ్వనన్నానా ? ఇస్తాననే అన్నాను గా . అయినా పైసా పైసా అని వీడు నన్ను ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ?. రాను రాను దేశం లో మంచి తనం, నమ్మకం సన్నగిల్లి పోతున్నాయ్ . మనుషులు మరీ డబ్బు మనుషులు గా మారి పోతున్నారు" అని అనుకుంటూ,

ఎందుకయ్యా అలా అరుస్తావ్ , బుద్దుందా లేదా , ఇక్కడే కదా ఉన్నాను. డబ్బులివ్వకుండా ఎక్కడికైనా పారి పోతానా ఏంది ?

చెప్పు ఎంత ? కితనా  అన్నాను .

వాడు నన్ను చూసి జడవకున్నా , నా కోపానికి కొంచెం జంకినట్లు ఉన్నాడు.
మారు మాట్లాడకుండా ఏ స్టైల్ లో కట్ చెయ్యాలి అన్నట్టు ఒక సైగ చేసాడు .

అది మరి సంగతి "దేశం నోరున్నోల్ల సొత్తు " అని ఊరికేనే అన్నారా పెద్దోళ్ళు. నోరు ఉంది కాబట్టి నేను వీడిని దారి లో పెట్ట గలిగేను, అదే మెతక మనిషినైతే ఇంకేమన్నా ఉందా ? పైసా పైసా అని వీడు వాడి మెదడు తినేద్దుడు.

సర్లే వీడు ఎలాగా మనం అడిగిన స్టైల్ లో చేస్తానంటున్నాడు కాబట్టి , నా చొక్కా పై జేబు లో ఉన్న చీటీ తీసి చదవటం మొదలెట్టాను . "ఫిర్ సే బతాయియే" అన్నాడు వాడు . నేను వేగంగా చదవటం వల్ల వాడికి అర్ధం కానట్టు ఉంది అనుకుని చాలా నెమ్మది గా అర్ధవంతం గా చదవటం మొదలెట్టాను

"పీచే బాల్ కం కట్ కరో మత్ , జ్యాదా కట్ కరో . ఆగే భీ ఐసా కరో . బాజు మే నార్మల్ రఖో " అన్నాను .

వాడికి బాగానే అర్ధమయ్యింది అనుకుంటా . కత్తెర తో రడీ అయ్యి  పోయాడు. నేను కళ్ళు మూసుకున్నాను . ( క్రికెట్ లో ఇండియా వికెట్లు కోల్పోతున్నా, ఇన్నాళ్ళుగా పెంచుకున్న జుట్టు ఒక్కసారిగా కట్ చేయించుకుంటున్నా నాకు చాలా బాధగా ఉంటుంది .తెగిపడుతున్న నా ఓక్కో వెంట్రుకని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు . అందుకే కళ్ళు మూసుకున్నాను :D)

అప్రయత్నం గా నే నిద్ర పట్టేసినట్టుంది. "సార్ , సార్ కైసా హై  ? " అంటూ నన్ను నిద్ర లేపాడు వాడు.

నిద్ర లేపినందుకు కోపం రాలేదు నాకు . నిద్ర లేపుతూ కూడా పైసా , పైసా అని లేపుతున్నాడు. డబ్బు దెయ్యం గాడు. అందుకు కోపం వచ్చింది. కితనా ? అని గట్టిగా అరుస్తూ వాడి మొహం చూసాను.

"నీ మొహం ఎలా ఉందో ఒకసారి చూస్కో" అన్నట్టు అద్దం వైపు చూపిస్తూ సైగ చేసాడు.

నా మొహానికేంటి రా ? అనుకుంటూ అద్దం వైపు తిరిగాను. ఈకలు పీకేసిన కోడైనా కొంచెం నయమేమో అనిపించేంతగా చేసాడు వాడు. వాడి మీద కోపం కంటే ,ఎట్టా ఉండే టోన్ని, ఎట్టా తయారు చేసేడు వీడు అనే బాధ ఒక పక్క, ఈకలు అన్నీ( జుట్టు అంతా ) పోయింది అన్న దిగులు ఓ పక్క నా మనసుని ఆవహించేసుకుంది. వంద వాడి చేతిలో పెట్టి నిస్సహాయం గా బయటికి వచ్చాను .

సార్ , సార్ , చుట్టా, చుట్టా(చిల్లర)  అంటూ వెనక్కి పిలుస్తున్నాడు వాడు.

"ఏరా బంగారం లాంటి నా జుట్టు నీ కత్తెరకి బలిచ్చి, నువ్వు చేసిన  ఈ మహా గొప్పపనికి ఓ వంద చేతిలో పెడితే , చుట్టా , చుట్టా అని నన్ను పిలుస్తావా? నీ మొహానికి నేను చుట్టలు, సిగరెట్లు కాల్చేవాడిలా కనిపిస్తున్నానా " అని వాడి మీద అరుద్దామనుకున్నాను .  ఏం చేస్తాం  కాలం కలిసి రాకపోతే పులిహోర తిన్నా పులి కనిపించదు .వీడికి నా మంచితనమెక్కడ కనిపిస్తుంది అనుకుంటూ ఇంటి దారి పట్టాను .

"అసలు ఇక్కడ ఒక్కడు కూడా తిన్నంగా ఉండడా ? నేను చెప్పిందొకటి , వాడు చేసిందొకటి. నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేఖం గా చేసాడు వాడు. హిందీ రాక పోతే నాకు రాదు అని చెప్పొచ్చుగా , నల్ల గా నిగ నిగాలాడే నా జుట్టు నేల పాలు చేసాడు. హిందీ రాక పోయినా నేను నిన్నడిగి , చీటీలో రాసుకుని మళ్ళీ వెళ్ళలేదా ? , అలాగే వాడు ఎవడో ఒకన్ని అడిగైనా చెయ్యాల్సింది. ఛ.. నాటు కోడి పెట్టలా ఉన్న నా తలని కాస్తా గిన్నెకోడి పెట్టను చేసేసాడు "అంటూ నా చేతిలో ఉన్న చీటీని వేణన్న టేబుల్ పై పడేసాను .

"అసలు నిన్ను జ్యాదా కి ముందెవరు కామా(,) పెట్టమన్నారు ? "అని వేణన్న అడిగి,  దానివల్ల జరిగిన అనర్ధమే ఇదని నాకు పూస గుచ్చినట్టు వివరించాడు . 

**********************************************************************************
 ఎపిసోడ్ నెం.2 
ఒక సారి దెబ్బతిన్న పుంజు మళ్ళీ దెబ్బ తినదు. అలాగే ఇప్పటి వరకూ నేనెప్పుడూ మరలా జుట్టు విషయం లో దెబ్బతినలేదు.
మొన్ననే మళ్ళీ సెలూన్ కెల్లా , జుట్టు విషయం లో నేను చెప్పినట్లే చేసాడు. అయితే సైడ్ ల విషయం లో కొంచెం కంగారు పడి ఎక్కువ కట్ చేసాడు . హెయిర్ స్టైల్ చేంజ్ అయిపోయింది. హెయిర్ స్టైల్ మారాకా నా (కొమరం) పులి మీసాలు నాకే బాగోలేదనిపించాయి.కైసా కర్నేకా సార్ అన్నాడు .కొంచెం మీసం సైజు తగ్గించమన్నాను. ఇంతలో పక్క చైర్ లోంచి నా కొలీగ్ మురళి లేచాడు. అతని మీసం ఒకవైపు "దబంగ్ (సల్మాన్) స్టైల్ ", మరో వైపు "వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై ( అజయ్ దేవగన్ ) స్టైల్  ". అంతే .. వీడు నా మీసం పై మిషన్ పెట్టిన విషయం మర్చి పోయి ఒక్క నవ్వు నవ్వాను ............................................... తర్వాత మురళి నవ్వాడు .

సీన్ కట్ చేసి చూస్తే ఈ రోజు ఆరెంజ్  స్టైల్ లో ఉన్నాయ్ నా మీసాలు .

**********************

ఎలాగూ నా భాషా ప్రావీణ్యం  ఏపాటిదో ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది . భాష గురించే చాలా మాట్లాడాను కాబట్టి మీకు కొందరిని పరిచయం చెయ్యాలి .

ఇక్కడ  నాకు ఒక హిందీ గైడ్ లాంటి వ్యక్తి ఒకతను ఉన్నాడు.దుర్గా ప్రసాద్ . మా స్టోర్ ఇంచార్జ్  ఫ్రమ్ అమలాపురం.
హిందీ లో ఒక కొత్త స్లేంగ్ సృష్టించిన వ్యక్తి ,కాదు ఓ శక్తి .
హిందీ ని తూర్పు గోదావరి యాసలో మాట్లాడటమెలా ? అని మా వాడి దగ్గర నేర్చేసుకోవచ్చు. ఇక్కడి కొచ్చిన మొదట్లో మా వాడూ నా స్కూలే . అయితే 30 రోజుల్లో హిందీ నేర్చుకోవటమెలా ? అనే పుస్తకం కొని మూడునెలల్లో చాలా వరకు హిందీ నేర్చేసుకున్నాడు .
" మే ప్రసాద్ బాతు కర్రా హా హూం , ఆపు కవున్ ?,ఎక్కడ హై మీరు ?, ఐసా క్యా ?, తూ వుదరు టైరో ! మే ఆర హా హూం , హా .. ఐస హై తో కుచ్ నహీ హోతా మరి , జ్యాదా మాట్లాడితే బాగోదు హై " ఇలాంటి పదజాలాలు వాడుతుంటే "తెలుగోళ్ళ నవ్వు ఆగటానికి, మరాఠీ ( హిందీ ) వాళ్లకి అర్ధం కావటానికి మినిమం 15  నిమిషాలు పడుతుంది .


ఇదే  కోవకు  చెందిన  మరో వ్యక్తి " శీను  "
శీను  గురించి  చెప్పటానికి  ఒక  టపా  మొత్తమే  సరిపోదు  . ఇంకా  టపాలో  మిగిలిన  ఈ  స్పేస్  ఎంత  ?
తర్వాతి టపాల లో  శీను  & batch  గురించి  రాస్తాను ..



Thanks for Your Visit.

మీ
స్వామి ..

Friday, December 17, 2010

నేను మరో బాపు..

నా మొదటి బొమ్మ

బొమ్మ ద చిత్రం , పిక్చర్ ది ఆర్ట్

ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ,
నాకంటే సోమరి , పనిబద్ధకం గాడు పెపంచం లో ఎవడైనా ఉంటాడా అని .

మొన్న కొల్హాపూర్ లో (మా ఆఫీసు లో ) కరెంటు పోయింది . యు.పి.యస్ ఉన్నంత వరకూ సిస్టం పై పనిచేసిన మా వేణు అన్న(మా టీం లీడర్) ఎలాగూ కరెంటు రాదని నిర్ధారణ కు వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ చక్కబెట్టుకునే పనిలో పడ్డాడు. నేనూ ఏదో ఒక సహాయం చేసి పెడదామని అనుకున్నా. సర్లే , ఆఫీస్ లో వన్ సైడ్ పేపర్లు చాలా ప్రింటర్ దగ్గరా, షెల్ఫ్ ల లోనూ పడి ఉన్నాయ్ గా   వాటిని చక్కబెట్టి రెండో సైడ్ వాడదాం లే అని అన్నింటినీ ఒక పేపర్ కవర్ లో పెడుతున్నాను. ఒక షెల్ఫ్ లో రెడ్ కలర్ పెన్ కూడా కనిపించింది . రాస్తుందా లేదా అని ఒక లైన్ గీసా . రాస్తుంది .అంటే ఇట్స్ వర్కింగ్ నే కదా అని ఇంకో గీత గీసాను . రెడ్ పెన్ ఎంత ఎర్రగా రాస్తుంది .ఇంత మంచి పెన్ను ని ఎవడు ఈ షెల్ఫ్ లో పడేసాడబ్బా ? అనుకుంటూ ఆ పేపర్ పై నా పేరు రాసా . వేణు అన్న పేరు, ఆఫీస్ లో అందరి పేర్లు , నాకు తెలిసినోల్లందరి పేర్లు రాస్తూ కూర్చున్నాను . వావ్ ఎంత బావున్నాయ్  వీళ్ళ పేర్లు. పేర్లయి పోయాయి .  ఇంక సున్నాలు చుట్టటం మొదలెట్టాను . అలా ఒక కార్టూన్ బొమ్మ వచ్చింది . (పిచ్చోడి చేతి లో రాయి ఉంటే ఎంత ప్రమాదమో , నా చేతిలో పెన్ను పేపర్ ఉంటే అంతే ప్రమాదమని అప్పుడే నాకు తెలిసొచ్చింది ). బొమ్మ గీయగలనని నాకు ధీమా వచ్చింది. ఏదో డాక్యుమెంట్ కోసం వెతుకుతున్న వేణు అన్న దగ్గరికెళ్ళి , అన్నోయ్ నేనో బొమ్మ వేశాను చూడు అని చూపిస్తే "బావుంది ( అలా అనక పోతే నేను ఫీల్ అవుతానని ) " అన్నాడు .

 మనకెలాగా బొమ్మలు ( బొమ్మ ) గీసిన అనుభవం అల్రెడి (ఇప్పుడే) వచ్చింది కాబట్టి ఓ మంచి బొమ్మ గీద్దాం అనుకున్నాను. అనుకున్నదే తడవుగా ఏం గీద్దామా అని ఆఫీస్ అంతా (గోడమీద కేలేన్డర్లూ, సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్లూ AటుZ అన్నీ )  చూస్తే , ఒక వైట్ లాంగ్ నోట్ బుక్ పై నుంచి నన్నే చూస్తున్న ఒక అమ్మాయ్ కనిపించింది .

ఒకసారి ప్రాక్టీసు చేసి తర్వాత గీద్దామని పెన్సిల్ కోసం వెతికా, షెల్ఫ్ లో ఎక్కడా లేదు.   షాప్ కెళ్ళి పెన్సిల్ కొనుక్కొద్దామా అనుకున్నా, నాలో ఉన్న సోమరి గాడు లేచి, నీ బోడి ప్రాక్టీసు కి కొత్త పెన్సిలొకటా అని నన్ను అక్కడి నుంచి వెళ్ళకుండా ఓ సెటైర్ వేసాడు. ఏదీ లేనప్పుడు యాపిల్ జ్యూసే అమృతం తో సమానం . అందుకే నా చేతిలో ఉన్న రెడ్ పెన్నే నా ఆయుధం లా కనిపించింది . ప్రాక్టీసు బొమ్మ పర్లేదనిపించింది .
 
(రోజూ డైరీ ఓపెన్ చేసినప్పుడల్లా  ఈ బొమ్మ నన్నెప్పుడు పబ్లిష్ చేస్తావ్ అని అడుగుతుంది .నిజానికి ఓ బొమ్మ అందం గా గీసి పబ్లిష్ చేద్దాం అనుకున్నా . ముందే చెప్పగా నా అంత పనిబద్ధకం గాడు పెపంచం లో ఉండడని. ఒక పక్క నా బొమ్మ పోరు పడలేక , నా బద్దకాన్ని విడలేక ఇంక తప్పక పోస్ట్ చేస్తున్నాను .)

రెండో బొమ్మ ఇంతకంటే అందం గా ఉన్నా, నాకది రెండోదే .
ఈ రఫ్ బొమ్మ (మనిషి  బొమ్మ ) నా మొదటి బొమ్మగా నాకు  తెలియకుండానే నా మనసులో స్థానం సంపాదించేస్కుంది.

మొదటి చూపు ,మొదటి ప్రేమ ,మొదటి ముద్దు ,మొదటి సంతకం ,మొదటి ఉద్యోగం,మొదటి జీతం  .... ఇలా మనకు సంభందించిన ప్రతీ మొదటి పనికి మన మనసులో మొదటి స్థానం ఉంటుంది .

నేను మొదటసారి గీసిన నా మొదటి బొమ్మ కేవలం నా డైరీ పేజీల మధ్యలో గతం మిగిల్చిన తీయటి జ్ఞాపకం గా మాత్రమే మిగిలి పోవటం నాకిష్టం లేదు .

రాధిక గారి బ్లాగు చూసాకా ఏదైనా రాయాలి అనిపించింది .

నిన్న మొన్న లలో గీతిక గారి బ్లాగ్ చూసాకా , నా బొమ్మని కూడా నా బ్లాగ్ ప్రపంచానికి పరిచయం చెయ్యాలనిపించింది .

టైటిల్ కి వీడురాసిన రాతలకి గీసిన గీతలకి ఎక్కడైనా సంబంధం ఉందా ?
వెధవ బిల్దప్పూ వీడూను అనుకోవద్దు . అక్కడికే వస్తున్నా ..
ఈ బొమ్మ పట్టుకెళ్ళి మా వేణు అన్నకి చూపిస్తే "నీలో మరో బాపు కనిపిస్తున్నాడు బాబు " అన్నాడు .
నిజమేనంటారా ? :-)

Tuesday, December 14, 2010

"ఆరెంజ్" కేవలం కలర్ కాదు, కలర్ ఫుల్ ఎంటర్టైనర్ .. " ?

నిజానికి నేను ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఉంటే మొదటి రోజే రివ్యూ రాసేవాడిని . మొన్నటి వరకూ ఎప్పుడు రివ్యూ రాద్దామా అనేకన్నా ఎప్పుడు సినిమా చూస్తానా అనేదే నాకు పెద్ద కోరికగా ఉండేది. ఇప్పుడు సినిమా చూడాలనే కోరిక తీరింది.


వచ్చినా రాకున్నా , రివ్యూ రాయాలనే ఉబలాటం కొద్దీ నేను రాస్తున్న మొదటి రివ్యూ ..

ప్రేమ ..

ఈ పదం పుట్టి ఎన్ని సవత్సరాలైందో తెలీదు కానీ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఈ పదానికి అర్ధం చెప్పటానికి , ఆ భావానికి రూపం దిద్దటానికి ప్రయత్నిచని మనిషే ఉండడు. ప్రేమ ఎప్పటికీ కొత్త భావం, కొత్త అనుభవం. ఈ భావానికి నిర్వచనం చెప్పమని , అనుభవానికి అక్షర రూపం దాల్చమని ఒక కోటి మందిని అడిగితే కోటి కొత్త నిర్వచనాలు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.


" ప్రేమించిన అమ్మాయి ని ప్రేమిస్తున్నట్లు నటించటం మహా పాపం. ఇప్పటికైనా నీకు తెలిసింది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో . అందుకే కష్టమైనా నేను నిజాలే చెప్తాను ..

ఈ క్షణమే నాకు ఒకటి అర్ధమవుతుంది ,నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పటమే అబద్దం అనిపిస్తుంది. నేను ప్రేమిస్తున్నాను అనే కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించమంటున్నాను అనిపిస్తుంది . ఒక అమ్మాయ్ ని ప్రేమించలేక పోవటానికి కారణమే నేను . కారణాలతో మిగిలిపోకూడదు నేను . "

ఇలాంటి డైలాగ్స్ తో ఆరెంజ్ చూడచక్కగా రూపుదిద్దుకుంది. అయితే ఇది ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పడం లో సందేహమే లేదు .

చెర్రీ సినిమాలంటే నాకిష్టం ..

నేను "చిరుత" చూడటానికి కారణం "చిరంజీవి". "మగధీర" చూడ్డానికి కారణం "రాజమౌళి ". ఈ రెండు సినిమాలు నేను చెర్రీ నుంచి ఏమీ ఎస్పెక్ట్ చెయ్యకుండా వెళ్ళాను. కాబట్టి సినిమాలు బాగా నచ్చాయి. నేను ఏ కారణాల వల్ల ఈ సినిమాలకి వెళ్ళానో ,వాటికంటే చెర్రీ నే నాకు ఈ రెండు సినిమాల్లో బాగా నచ్చాడు.

అయితే చెర్రీ నుంచి నేను ఏదో ఆశించి , చెర్రీ కోసమే చూసిన సినిమా "ఆరెంజ్".

చెర్రీ కోసమే చూసాను కాబట్టి ఈ సినిమా నాకు నచ్చింది.

చెర్రీ "వన్ మేన్ షో " లా ఆరంజ్ నాకు అనిపించింది. చెర్రీ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అంతా బావుంది. కొన్ని సీన్లలో చిరంజీవి ని మళ్ళీ స్క్రీన్ పై చూసిన ఫీలింగ్ కలిగింది.


కధ క్లారిటీ కొంచెం దెబ్బతింది. జెనీలియా , ఫస్ట్ ఆఫ్ లో ఎంత తలనొప్పి తెప్పించిందో , సెకండ్ ఆఫ్ లో అంత ఆకట్టుకుంది .లాస్ట్ సాంగ్ లో అనుకుంటా కొన్ని డాన్స్ స్టెప్స్ , చరణ్ కన్నా చాలా ఫాస్ట్ గా చేసింది.


ఇక కధ విషయానికొస్తే..

రామ్ ఒక రేంజ్ ఐడియాలజీ కల ఓ చలాకీ కుర్రాడు . సిడ్నీ లో అక్కా బావల దగ్గర ఉంటూ , తన ఇష్టాన్ని (పెయింటింగ్ ని ) హాబీ లా ( గ్రాఫిటీ ..గోడలమీద బొమ్మలెయ్యటం) మార్చేసుకుంటాడు.

ఇష్టాన్ని కూడా ప్రేమ గా చూపించాడు దర్శకుడు . చిన్న వయసులో స్కూల్ టీచర్ ని ఇష్టపడటాన్నికూడా ప్రేమే అన్నాడు. పదహారేళ్ళ వయస్సు లో క్లాస్ మేట్ , అలా,అలా మొత్తానికి 9 మందికి ప్రేమను పంచిన రామ్ ,నంబర్ టెన్ గా జాన్ (జెనీలియా ) కి కూడా ప్రేమను పంచెయ్యటానికి సిద్దపడతాడు.

ప్రేమ అంటే వయస్సులో ఉన్నయువతీ యువకులు తప్పక స్వీకరించాల్సిన భాద్యతగా జెనీలియా (జాన్ ) భావించిందనుకుంటా కాబోలు , తనకు నచ్చిన మూడు క్వాలిటీస్ ఉన్న ముగ్గుర్నుంచి ఒకరిని తన ప్రేమికుడి గా నిర్ణయించటానికి చీటీ లు వేస్తుంది .ఆ చీటీ తీసి ప్రేమికుడి గా చరణ్ స్థిరపడి పోతాడు .

నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్ అని అడిగిన జెనీలియా (జాన్ ) కి , రామ్ (చరణ్ ) " ప్రేమించమని అడుగు , ఎంతైనా ప్రేమిస్తా , ప్రపంచం లో ఎవరూ ప్రేమించనంత ప్రేమ గా ప్రేమిస్తా , అయితే ఇంత కాలం ప్రేమించు అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఒకేలా ఉండదు జాన్ , అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మొద్దు .ఎందుకంటే ప్రేమ అనేది టు హార్ట్స్ కాదు , టు బ్రైన్స్ .నీ బ్రెయిన్ ఒకలా ఆలోచిస్తే , నా బ్రెయిన్ వేరేలా ఆలోచిస్తుంది.నాకు క్రికెట్ అంటే ఇష్టం , నీకు గోల్ఫ్ అంటే ఇష్టం . నాకు గ్రాఫిటీ అంటే ఇష్టం , నీకు ఇష్టం లేదు . ఇవాళ నాకు నీలో నచ్చింది రేపు నచ్చక పోవచ్చు . అప్పుడు అబద్దాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్, లైఫ్ లాంగ్ లవ్ ఒకేలా ఉండదు . అలా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావటానికి నేను రెడీ , లేనప్పుడు విడిపోవటానికి నువ్వు రెడీ గా ఉండాలి" అని చెప్పే సీన్ సినిమా లో ఒక హైలెట్.

క్లైమాక్స్ లో చెర్రీ , జెనీలియా ల మద్య సీన్స్ భలే సరదాగా కామెడీ గా అనిపించాయ్.
చరణ్ ,జెనీలియా , బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు చాలా సైలెంట్ గా , చూడ ముచ్చటగా ఉన్నాయి.

పప్పీ " ఐ లవ్ ,లవ్ స్టోరీస్", " లేత లేత లవ్ స్టొరీ ", అంటూ పెట్టిన ఎక్ష్ప్రెషన్ చాలా ఫన్నీ గా ఉన్నాయి.


"బావ మంచే కోరుకుంటాడు బావ మరిది .." అంటూ చెర్రీ లాంటి బావమరిది ని క్రియేట్ చేసిన భాస్కర్ ఈ క్షణం చాలా బాగా నచ్చాడు. అందరి బావ మరుదులూ అలా ఉంటే చాలా బావుండు అనిపించింది నాకు .

"సమష్యకు పరిష్కారం విడిపోవటమే అయితే విడి పోవటానికి క్షణం చాలు . కోర్టు లు , లాయర్లు , విడదీయటానికి నాలాంటోల్లు వందమంది ఉంటారు.అదే సమష్యకి పరిష్కారం ప్రేమించటమే అయితే ఎలా ప్రేమించాలో చెప్పేందుకే ఎవరూ లేరు బావా.. " అంటూ అక్కా బావల్ని కలపడానికి తపన పడ్డ రామ్ కేరక్టర్ ఇక్కడ నాకు బాగా నచ్చింది.

"ప్రేమికులకి మనసులు ఒకటే కావచ్చు కాని తనువులు రెండు. ఇలా రెండు తనువులకు మెదడులు , ఆలోచనలు , పెర్సనల్ స్పేస్ అనీ రెండే . ఎంత ప్రేమికులైనా, ఆఖరికి భార్యా భార్తలైనా ఒకరి ఇష్టాల్ని ఒకరు గౌరవించాలి . ఒకరి తప్పుల్ని మరొకరు మన్నించగలగాలి . వాళ్ళకంటూ ఉన్న స్పేస్ లో కూడా మన ఇష్టాల్ని రుద్దేసే ప్రయత్నం చెయ్యకూడదు. ఒకవేళ మన ఇష్తమైన వాళ్ళకోసం మన ఇష్టాల్ని త్యాగం చెయ్యటం చేసినా అదీ తీపిగుర్తు గా మిగిలిపోతుంది, ప్రేమను మరింత ప్రేమగా మార్చేస్తుంది ," అని కొత్తగా దర్శకుడు చూపించాడు .

ఏది ఏమైనా ఒక కొత్త కధని, చిత్రీకరణ లో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిచటానికి సినిమాయూనిట్ చేసిన కృషి ఫలించలేదు.

"ప్రేమ సరిపోక పోతే మరికొంచెం ప్రేమించాలి, అదీ సరిపోక పోతే మరికొంత ప్రేమించాలి , అలా అలా సముద్రమంత ప్రేమ ను పంచాలి . సముద్రమంత ప్రేమని పొందాలనే అంతా కోరుకుంటారు . అది ఒకే సారి సాధ్యం కాదు , కొంత కొంత గా జీవితం అంచుల వరకూ ప్రేమిస్తూ ఉంటే నే అది సాధ్యం . "

[ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైందో తెలీదు . బహుశా చాలా మంది సినిమా ని చూసేసే ఉంటారు. చాలా మంది రివ్యూలు రాసే ఉంటారు . కానీ రాద్దాం అని అనుకున్న తర్వాత రాయలేక పోయాననే ఫీలింగ్ నాలో ఉండకూడదు. అందుకే డేర్ చేసి ట్రూత్ రాసా. ఇది నా వరకు నాకు అనిపించింది , నా వ్యక్తిగత అభిప్రాయం ]

Saturday, November 20, 2010

కనుపాపల్లో ప్రేమ... ఎవరేమన్నా ప్రేమ..




చిన్నప్పటి నుంచీ ఒకరికి ఒకరని , ఇద్దరూ ఒకటవుతామనే అనుకున్నబావా, మరదల్లని ఒక అనుకోని సంఘటన విడదీసేస్తుంది. విడి పోయిన ప్రేమికులమద్య ఎడబాటుని , విరహాన్ని ఒక్క పాటలో గుండెల్ని పిండేసేలా తెరకెక్కించటం దర్శకుడి గొప్పదనం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఆ పాట రచయిత  చిన్ని చరణ్ గురించి .పాత్రలలో మమేకమై , తను ఫీల్ అయ్యి రాసేవుంటాడు ఈ పాటని.  దేహం ఒకరు , ప్రాణం ఒకరని కలిపి,ప్రాణాన్ని దేహం నుంచి వేరుచేసి,కేవలం ప్రాణం లేని శరీరాలుగా వారిని  మిగిల్చిన పాపం దేవుదిడా ? ,లేక వాళ్ళ స్వయంకృతమేనా ?
ఏది ఏమైనా, హాట్సాఫ్ టు సముద్ర ఖని ( డైరెక్టర్ ),  చిన్ని చరణ్ ( సాంగ్ రైటర్ ).
   
రచన :చిన్ని చరణ్ .
గానం:సాధనా సర్గమ్
సంగీతం:సుందర్ .సి. బాబు
చిత్రం: శంభో శివ శంభో  ..

కనుపాపల్లో ప్రేమ ..

కనుపాపల్లో ప్రేమ , కలలే చూపెన .,
మరునిమిషం లో ప్రేమ కలతే రేపెన ,

పూవే అందునా ? ముల్లనే దాటక,
ప్రేమే చేరునా మనసునే వేధించక .
ప్రతి కధలో ఇది సహజం , పరులకిదే అపార్ధం ..                     "కనుపాపల్లో ప్రేమ "

కడలిని వీడి అడుగులు వేయవు అలలే ఏనాడు ..,
నింగిని వీడి నిలబడ గలదా వెన్నెల ఈనాడు ..`
దేహం ఒకరు , ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధి లా మారి మళ్లీ తానే విడదీస్తున్నాడు ,

ఓ దైవమా ఈ పాపమెవ్వరిది ?,మరి నీదా ? నాదా ?

నా కన్నులలో కన్నీరేల,
తుడిచే  నేస్తం కనబడదేల ?                                              "కనుపాపల్లో ప్రేమ "

హృదయం లో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగింది,
ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది .
కనులకు చూపై, పెదవికి నవ్వై నను మురిపించింది.. ,
ఆ కన్నుల లోనే కన్నీరై కలవర పరిచింది.

ఓ నేస్తమా , ఓ.. నేస్తమా ,
నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమ.

అడుగే పడదూ..  అలికిడి లేక
మరణం లోనూ.. నిను మరవను ఇంక.                               "కనుపాపల్లో ప్రేమ"


రచన :చిన్ని చరణ్ .
గానం: హరి హరన్ .
సంగీతం:సుందర్ .సి. బాబు
చిత్రం: శంభో శివ శంభో  ..

ఎవరేమన్నా  ప్రేమ ..

ఎవరేమన్న, ప్రేమ ఎదకోతేనుగ  
ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా

ప్రేమను ప్రళయమే వీడిపోదు 
తనతో ఆడితే ప్రేమ కానే కాదు
ప్రతి కధలో ఇది సహజం ,పరులకిదే అపార్ధం .                             "ఎవరేమన్న ప్రేమ"

కడలిని వీడి అడుగులు వేయవు అలలే ఏనాడు ..,

నింగిని వీడి నిలబడ గలదా వెన్నెల ఏనాడు ..`

దేహం ఒకరు , ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధి లా మారి మళ్లీ తానే విడదీస్తున్నాడు ,

ఓ దైవమా... ఈ పాపమెవ్వరిది ?,మరి నీదా , నాదా ?

నా కన్నులలో కన్నీరేల,
తుడిచే నేస్తం కనబడదేల ?                                                    "ఎవరేమన్న ప్రేమ"

హృదయం లో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగింది,

ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది .
కనులకు చూపై, పెదవికి నవ్వై నను మురిపించింది.. ,
ఆ కన్నుల లోనే కన్నీరై కలవర పరిచింది.

ఓ నేస్తమా , ఓ.. నేస్తమా ,
నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమ.

అడుగే పడదూ.. అలికిడి లేక
మరణం లోనూ.. నిను మరవను ఇంక..                                    "ఎవరేమన్న ప్రేమ"

Friday, November 5, 2010

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ..

దీపావళి ..,
నువ్వంటే నాకిష్టం ,
ఎందుకో తెలుసా ,
అమావాస్యను కూడా వెన్నెలంత వెలుగులతో నింపేస్తావు ,
చిమ్మ చీకట్లలో  కూడా చిరునవ్వులని చిందిస్తావు,


ఇరులని చిదిమి ,
ఇల్లంతా ఇంపైన దివ్వెలతో అలంకరించేస్తావు.






నా మిత్రులు , శ్రేయోభిలాషులు అయిన మీ అందరికీ

హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు ..

Friday, October 29, 2010

నా ప్రేమ ..


ప్రేమ ..

అంటే ఏంటి ?

ఈ పదం
వింటే ఒకప్పుడు నా ఒళ్ళు జలధరించేది ,
అదే పదం వింటే మరోసారి నా నరాలు వుప్పొంగేవి,
అదే సమయంలో వెయ్యి వోల్టుల విద్యుత్తు నా నర నరాల్లో ప్రవహించేది ,

ఇప్పుడు
ప్రేమంటే భయమేస్తుంది ,
ప్రేమంటే జాలేస్తుంది .,
ప్రేమంటే బాధేస్తుంది ..

నా జీవితం లో ప్రేమ ఓ జ్ఞాపకం గా మిగిలి పోతోంది ,
బంధాలని పెకిలించిన పాశమై మిగిలి పోతోంది ,
గతానికి వర్తమానానికి మద్య ఓ వంతెనగా మాత్రమే మిగిలిపోతోంది


కలలా చెరిగి పోతోంది
కలతై నిదుర లేపుతోంది .
కవితగా నిలిచిపోతోంది ,

నా బతుకు పుటలో చెరిగిపోయిన అక్షరం గా మాత్రమే రూపు దాల్చుతోంది..
నాది అనుకున్న నాది నాక్కాకుండా పోతోంది,
నాకంటూ ఏమీ లేకుండా పోతోంది ,
నా నన్ను ఎందుకిలా చేసావని ప్రశ్నిస్తోంది ..

నా గుండె లోతుల్లో గరళాన్ని నింపి ,
కంటి కలుగుల్లోంచి కన్నీటిని కారిపిస్తోంది.

నీకు తెలుసా ,
నా కన్ను నిమిషానికి డెబ్భై రెండు సార్లు, కన్నీటి చుక్కల్ని కారుస్తోంది ,
ప్రతి హృదయ స్పందనకి ఓక్కో చుక్క చొప్పున కారుస్తోంది ,

కన్నీళ్లు మది లో బాధని కడిగేస్తాయని,
జారే కన్నీటి విలువ తేలికపడిన గుండెకు మాత్రమే తెలుస్తుందని ఎవరో అన్నారు.
కానీ నా కన్నీళ్లు మాత్రం కనికరం చూపించట్లేదు నా పైన .

పెను తుఫాను రేగిన నా గుండె చప్పుడు తో ఆటలాడుతున్నట్లు,
నా కన్నీటి కడలి అలల తరంగాలు , నడి నిశి లో కూడా నా చెక్కిలి పై వరదని సృష్టించేస్తున్నాయి ..

అమృతం అశ్రువై,
ప్రేమ పాశమై ,
బంధం భారమై,
నువ్వు దూరమై ,నేను శిలనైన ఈ క్షణం ..

నా గుండె నీరు వాడుతోంది,
నీరు వాడి గట్టిపడుతోంది ,
గట్టి పడి బీటలీడు తోంది,
బీటలీడి రక్తమోడుతోంది .

Thursday, October 28, 2010

నా డైరీ లో ఒక పేజీ .. ( 1/2 )



27 -అక్టోబర్ - 2010

ఎప్పటి లాగానే ఈ రోజు కూడా కొత్తదనమేమీ లేదు, అదే మరాఠీ గోల మద్య , అదే పాత ఫైల్ ఫార్మాట్ లో ఏదో వర్క్ చేసాను . ఏదో జీతం ఇస్తున్నారు కాబట్టి , కంపెనీ కి నేను ఇప్పుడు చెయ్యాల్సి ఉంది కాబట్టి చేస్తున్నాను. నిజానికి మనస్పూర్తి గా , ఇష్టం గా పని చేసి ఒక 5 రోజులు అయ్యింది. ఆ 6 రోజుల క్రితమే నేను పెట్టిన సెలవులు అయ్యిపోవటం తో తిరిగి ఇక్కడికి వచ్చాను. తిరిగి వచ్చాక నేను ఇష్టపడి పని చేసింది ఒక్కరోజు మాత్రమే. వర్క్ పై నాకు ఇంట్రెస్ట్ పోవటానికి వున్న కారణాలు అనేకం.

నిజంగా ఈ రోజు పెద్దగా చెప్పు కోవాల్సింది  ఏదీ లేదు. నా డైరీ లో ఒక నిస్సారమైన పేజీ, నిరాశగా మిగిలి పోయిన రోజు ని తప్ప .

ఎప్పట్లాగే ఈరోజూ తెల్లారింది, సూరీడొచ్చాడు, కొల్హాపూర్ లో చాలా నిత్తేజం గా బద్ధకం గా , ఒళ్ళు విరుచుకుంటూ నేను లేచాను . ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని ఆఫీసు కు వచ్చేసాను. అందరిలా హడావుడిగా ఆఫీసు కు వెళ్ళే అదృష్టం నాకు లేదు, ఎందుకంటే నేనుండే రూం కిటికీ తెరిస్తే నా కేబిన్ కనిపిస్తుంది. ఒకే కాంపౌండ్ లో ఎదురెదురు బిల్డింగ్స్ మావి . రెండు అడుగులు వేస్తె మా ఇల్లు ఆఫీసు అయిపోతుంది . వచ్చి రాగానే క్లైంట్ కాల్స్ రిసీవ్ చేస్కోవటం , సైట్ ఇంజినీర్ల నుంచి స్టేటస్ తీస్కుని వాళ్ళ ని మోబిలైస్ చెయ్యటం, ఇన్వాయిస్ లు, డి.పి.ఆర్. లు , వర్క్ కంప్లీసన్ సర్టిఫికేట్ లు , జె.యం.సి. లు, అప్పుడప్పుడు మనసు బాగోపోతే బ్లాగ్స్ చదవటం , ఇంతే నా ప్రపంచం . ఈరోజు కూడా పనిలేని మా హెడ్ ఆఫీసు వాళ్ళు ఎక్సిక్యూసన్ పేరుతో సాయంత్ర వేలని తినేశారు. సేల్స్ అని, టార్గెట్ అని రోజూ వుండే రచ్చే ఈ రోజు కొంచెం మోతాదు మించింది .

ఈ హడావిడి లో ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ , చడీ చప్పుడు లేకుండా నిశ్శబ్దం గా కూర్చుని ఉంది ఒక మెసేజ్.

"వన్ న్యూ మెసేజ్ రేసీవ్ద్ " అని చూడగానే ఏ ఎయిర్టెల్ వాడో ,డి.టి.హెచ్. ఆఫర్ కోసం పంపించే వుంటాడు అనుకున్నా, ఎందుకంటే రోజూ వచ్చే టి.వి. సీరియల్ లాగా గత 4 రోజులుగా సరిగ్గా ఈ టైం కి మెసేజ్ పంపించేది వాడే. రీడ్ బటన్ ప్రెస్ చేసి మెసేజ్ చదివా,

"బావ గారూ బావున్నారా ?, ఏం చేస్తున్నారు .. మీ బుజ్జి " అని మెసేజ్ పెట్టింది మా బుజ్జి.

బుజ్జి నా మరదలు , మా మేనమామ కూతురు. పెపంచం లో బావల్ని ఎవరినైనా ,ఆట పట్టించే హక్కు మరదల్లకి ఉంది అని ఫీల్ అవ్వుతూ వుంటుంది . మరదల్లని వుడికించే హక్కు బావలకు కూడా ఉంది అనేది నా ఫీలింగ్ .సో ఎప్పుడూ మా మద్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు షరా మాములే . తను నా చేతిలో కావాలనే చాలా విషయాల్లో ఓడిపోయి నీ గెలుపు వెనక నే వున్నాబావ అంటుంది.తనకు నా కంటే నా మాటలంటే నే ఎక్కువ ఇష్టం , అందుకోసమే నాతొ ఏదో ఒక విషయం పై వాదిస్తూ వుంటుంది . చిన్నప్పట్నుంచీ తను నెల్లూరు లోనే పెరిగింది. మా నెల్లూరు , గోదావరి ల మాటల కామ్బినేసన్ మా ఇంట్లో అందరికీ చాలా సరదాగా వుంటుంది . బావలకు మరదల్లపై పెత్తనం చెలాయించే హక్కు వుందని మా నాన్నని చూసి నేర్చుకున్నా. ఒకసారి ఏదో మాట్లాడుకుంటూ వున్నపుడు "అది కాదు బావా ..! " అంటూ తను ఏదో చెప్పబోయింది, వెంటనే నాలో బావ నిద్రలేచాడు , " ఎంటే బావ , బావ అంటూ పిలుస్తున్నావ్ ? పెద్దాలంటే గౌరవం లేదా ? , బావ గారు అని పిలువు "అని ఓ హుకుం జారీ చేశా. మొదట్లో ఈ చట్టం నాకు బాగానే కలిసొచ్చింది .అయితే అంతే త్వరగా ఈ చట్టం లో లొసుగులు తనకి అర్దమైపోయాయి . మాటకు ముందో గారు , వెనకో గారు పెట్టి , నా చేత తను వండిన గారెల్ని తినిపించేసింది . ఇక లాభం లేదనుకొని చట్టం లో కొన్ని సవరణలు చేశా , " అందరూ వుంటే బావ గారు అను, అయితే ఎక్కువ సార్లు గార్ల ప్రయోగం నిషిద్దం, మనమిద్దరమే వున్నపుడు నీ ఇష్టం " అంటూ నేను పంపిన సవరణ చట్టం పై అలాగే బావగారు అంటూ ఓ నవ్వుసంతకం చేసేసింది.

భళా రే బాబు భళా అనుకుంటూ నేను నాలో ఉన్న బావని భుజం తట్టి అభినందించేశా , మా బుజ్జి నవ్వు కు అర్ధం త్వరలోనే నాకు అర్ధమయ్యింది. ఈ సవరణ చట్టాన్ని ఇంకా వాడిగా నాపై ప్రయోగిస్తుంది . అక్కడక్కడా బావ గారు అనమని నేనన్నచోట బావ అని , బావ అనమన్న చోట నువ్వు అనీ అంటుంది . మా బుజ్జి ఏమన్నాబావుంటుంది , తను బావ గారు అంటూ ఒక డిఫరెంట్ స్లాంగ్ లో అంటుంది . అది హార్ట్ లో ఎక్కడో టచ్ చేసి నన్ను ఫోన్ తో పాటూ మెలికలు తిప్పేస్తుంది. మా బుజ్జి నేను ఏం చెప్పినా వింటుంది, ఏంచెయ్యమన్నా చేస్తుంది. మొన్న ఒకరోజు అత్తయ్య ఏం చేస్తుంది అని అడిగా, గుడికి వెళ్ళింది బావా అని తను రిప్లై ఇచ్చింది. మరి నువ్వు వెళ్ళవా గుడికి , ప్రసాదం తినటం తప్ప , ఒక్కసారైనా దేవుడికి దణ్ణం పెట్టావా ?అని అడిగా, అంతే ఆరోజు ఆ టాపిక్ మీద నేను మాట్లాడలేదు. ఏ రోజూ సాధారణం గా గుడికెల్లని మా బుజ్జి, భక్తురాలి అవతారమెత్తి మొత్తం వాళ్ళ ఇంటినీ ,ఫ్రెండ్స్ నీ అవాక్కు చేసింది .దేవి నవరాత్రులు తొమ్మిది రోజులూ ఉపవాసం చేసి , ఆ దేవి కరుణనూ , నా కటాక్షాన్నిపొందాలని స్కెచ్ వేసింది. మొదటి రోజూ ప్లాన్ బాగానే వర్క్ అయింది, బావా ఈ రోజూ పూజ చేశా , ప్రసాదం తీస్కో అంది. ఫోన్ లో ప్రసాదమేంటే నీ మొహం అంటూ నేను అనేసరికి , నిజమే బావోయ్ అంటూ నాలుక కరుచుకుంది . తర్వాత రోజూ, పొద్దున్నే లేవంగానే ఇడ్లీ లు తినే బుజ్జి గుడ్లు తేలేసింది . అయినా నిగ్రహించుకుని రెండోరోజు పూజ మొదలెట్టింది , ఏ రోజూ లేనిది మా బుజ్జి పొద్దు పొద్దున్నే కాల్ చేసింది ,' ఏంటి రా చెప్పు ?'అన్నాను , 'బావా పూజ' అంది , 'నిన్న చేసావ్ గా' . నేను అడిగా, 'ఈ రోజూ చేశా ' తను అంది , ఎన్ని రోజుల ప్లాన్ అన్నాను , 'తొమ్మిది' .రిప్లై కి నా కళ్ళు ఒక్క సారి బ్లింక్ అయ్యాయి , నేను షాక్ అవ్వటం లో తప్పులేదు , ఎందుకంటే మా బుజ్జి వాళ్ళమ్మ చేసే పూజ దగ్గర కూర్చుంది అంటే దానికి రెండే కారణాలు 1 . ప్రసాదం బాగా తినొచ్చు 2 . ఆ రోజూ కాలేజీ డుమ్మా కొట్టెయ్యవచ్చు . అలాంటిది ఈ రోజూ కూడా పూజ చేసిందంటే ., సమ్ థింగ్ ఈస్ రాంగ్ , సరే ఏం కోరుకున్నావే బుజ్జి అని అడిగా, దేవుడికి చెప్పినవి బయట చెప్పకూడదు బావా అని తప్పించేసుకుంది . కానీ పాపం గొంతు మరీ నీరసించి పోయింది. మద్యాహ్నం లంచ్ టైం లో తను మరోసారి గుర్తొచ్చింది. బుజ్జి భోజనం చేశావా , కాల్ చేశా , మాములుగా అయితే అరిసిందో పిలిచిందో కూడా తేడా తెలితని విధం గా మాట్లాడే మా బుజ్జి లేదు బావా అని చిన్న గా ఆన్సర్ ఇచ్చింది . నాకు మాత్రం తను అలా నీరసించి పోవటం అస్సలు నచ్చలేదు . బుజ్జీ నీకు తొమ్మిది రోజులూ ఏమీ తినకుండా ఇంత నిష్టగా ఉపవాసం చెయ్యమని ఎవరు చెప్పారు అని అడిగా, మా ఇంటి పక్క గుళ్ళో పూజారి గారు బావా అని చెప్పింది . పూజ చెయ్యమన్నారు , ఉపవాసం వుంటే మరీ మంచిది అని చెప్పారు . కానీ రెండు రోజులకే నేను తోట కూర కాడ లా నీరసించి పోయాను అంది. మా బుజ్జి కి జ్ఞాన భిక్ష పెట్టటానికి ఇదే సరైన టైం అనుకున్నా . అందుకే ఇక ఆలశ్యం చెయ్యకుండా క్లాసు మొదలెట్టేసా , చూడు బుజ్జీ పూజ చెయ్యటం వరకూ మాత్రమే మన వంతు , అలా అని పూజ చేసిన ప్రతీ రోజూ ఉపవాసం వుండాలి అంటే అదీ కానిపని . అందుకోసం పూజ చెయ్యి , దాంతో పాటూ టైం కి భోంచెయ్యి అని చెప్పా. మా బుజ్జి కి కొద్ది పాటి జ్ఞాన భిక్ష కలిగింది , కానీ ఉపవాసం మాననంటోంది . నాకు తెలుసు తన మనస్తత్వం , పట్టు వదలని విక్రమార్కుడు వాళ్ళ కజిన్ అన్నట్టీ వ్యవహరిస్తుంది. ఆ టైం లోనే నా మెదడు పాదరసంలా పనిచేసింది . సో బుజ్జి నీరసించ కుండా వుండాలంటే తినాలి . అయితే బయట పదార్ధాలు తినకూడదు కానీ ప్రసాదం తినొచ్చు . ఇది పూజ చట్టం లో నాకు తెలిసిన గొప్ప లొసుగు. ఇది మా బుజ్జి కి చెప్పా . అబ్బో తన బాద ఇంత త్వరగా తీరిపోతుందని ఆమె అస్సలు ఊహించి వుండదు. నేను చెప్పిన మాటని తు, చ తప్పకుండ పాటించే మా బుజ్జి దీన్ని మాత్రం రెండు రెట్లు ఎక్కువ శ్రద్ధ తో చేసింది , ఫలితం గా ప్రసాదాన్ని టిఫిన్ గా మార్చేసుకుంది , నీరసాన్ని జయించింది పూజని పూర్తి చేసింది . ఏదో ఒలింపిక్ పతకం సాధించినంత అందం తో బావా నేను పూజ పూర్తి చేసానోచ్చ్ అంది. బుజ్జమ్మా! ప్రసాదమైనా , టిఫిన్ అయినా ,ఏది ఏమయినా తినటం తినటమే అని హిత బోధ చేద్దుల్లోకి , ఇది తొండి ఆట నేనొప్పుకోను అంటూ నాపై కోపం తో ఊగిపోయింది . హా అయినా మాకివేం కొత్త కాదు , అలకలు , గిల్లి కజ్జాలు టైం లో కూడా మా బుజ్జి భలే వుంటుంది.

Monday, October 18, 2010

అతడు - ఆమె ..














తొలిపొద్దు కోసం వేవేల కళ్ళతో ఎదురు చూసిన ఆమె కు కల నిజమవుతోంది.తూరుపున అరుణ కిరణాలు  చాలా సున్నితం గా ధరణి సోకుల్ని ముద్దాడుతున్నాయి . ప్రియుని స్పర్శ తో పులకరించిన పుడమి మంచు చీరని కొద్ది కొద్దిగా జారవిడుస్తూ ,తన సోకుల్ని కొంటెగా చూస్తున్న భానున్ని రమ్మంటూ సైగ చేసింది.
భానుడి బుగ్గలు సిగ్గుల మొగ్గలవుతున్నాయి. ధరిత్రి అణువణువూ పులకరిస్తోంది. రాత్రి తాలూకు విరహాన్ని ఒకే ముద్దు తో చెరిపేస్తున్నాడు అతడు.గత కాలపు విరహపు చీకట్లు మచ్చుకైనా కనిపించటంలేదు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
గత రాత్ర్హి అతగాడు అటుగా వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగిన విషయాల్ని అతని కౌగిలి నుంచి వీడకుండానే నెమ్మదిగా అతని చెవిలో ఆమె చేరవేసింది .అతనూ అంతే అటుగా వెళ్లి, ఆమె ను గుర్తు చేసుకున్న క్షణాల్ని గంటల్లో చెప్తూ , అటుగా వచ్చిన మబ్బులచాటున దోబూచులాడుతూ, ఆమె లో కలిగే కలవరింతను ఓరకంట కనిపెడుతున్నాడు .అప్పటివరకూ నవ్వుతూ వున్న నెచ్చెలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది, నగుమోము చిన్నబోతూ వుంది.
కనులిప్తపాటులో కనపడకుండా పోయిన ప్రియున్ని చూడటానికి ఆమె మరీ కలవరించి పోతుంది.కనురెప్పల మాటున కమ్మని స్వప్నం కలలా కరిగిపోతున్నదుకు  కనుగంగ కడలయ్యేందుకు సిద్దమవుతోంది.ఆ విరహం అతన్నీ బాధించిందో ,జవరాలి కంట కన్నీరు అతని గుండెనుబికిందో,లేక ఇక చాలులే సరసం అనుకున్నాడో ఏమో వెంటనే వచ్చి ఆమె చెయ్యినందుకున్నాడతడు.
ఆమె అతన్ని చూడగానే ఒక్కసారిగా  వచ్చి  గట్టిగా హత్తుకుని , తన కౌగిలి లో ఐక్యం అయిపోతుంది అనుకున్నాడతడు. కానీ అలా జరగలేదు . ఆమె ఇంకా అల్లంత దూరాన్నే వుంది . చిత్రం.., ఆమె ముఖం కోమలత్వాన్ని వీడి కోపంతో ఎరుపెక్కిపోయింది.

"అదికాదురా జననీ , నా బుజ్జివి కదూ , నా చిట్టివి కదూ, ఏదో తమాషాకి, సరదాగా కాసేపు ఆటపట్టిద్దామని , అలా మరీ చిన్నపిల్ల లా , ప్రతీ చిన్న విషయానికి అలగకురా బంగారం.." అంటూ ఏదో చెప్పబోతున్నాడతడు. నీ సంజాయిషీ నాకేం అక్కర్లేదు అన్నట్టు గా సూటిగా అతనికల్లలోకి చూసిందామె. అంతే సూడ సక్కని సూరీడు సిన్నబోయాడు. బింకం గా చూసే అతగాడు బిక్కమొహమేసాడు. ఏంటో అనుకున్నాడు గానీ  ఆడాళ్ళ కళ్ళలోకి సూటిగా సూడటం కష్టమే .అతగాడికీ ఇప్పుడే అర్ధమయ్యింది పాపం.
 ఇరువురి మద్యా మౌనాన్ని చేదిస్తూ ఆమె మాట్లాడుతోంది, అతను గమనిస్తున్నాడు. ఆమె గొంతు కోపం గా లేదు , అలా అని లాలన గానూ లేదు , చాలా ఆర్ద్రం గా ఉంది."సరదాకైనా మన మద్య ఎడబాటు కలిగించే పనులు ఏమీ  చెయ్యవు కదూ " అంటూ వేడుకోలు గా అడుగుతోంది. చిన్నగా ఓ చిరునవ్వాడు అతడు.చెలిగాడికి తన భావం అర్ధమయ్యిందన్నసంతోషమో , లేక అతగాడు ఇప్పటికీ కవ్విస్తూ నవ్వుతున్నాడనే ఉడుకుబోతుతనమో తెలీదు కానీ,
 ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. అతని గుండె ఆమె భావానికి  భాష్యం చెప్పలేనంటోంది . ఆమె కంట పొంగిన గంగ , ఇతని గుండె పొరలకి గండి కొట్టి మనసు సంద్రాన్ని చేరుతోంది.ఇతని కంట చెలమలో కూడా కమ్మని మదురామృతం ఉబికి వస్తోంది. ఒక్క ఆలింగనం తనువుల దూరాన్ని తగ్గించి మనసుల బంధాన్ని మరింత పెంచేది నిజమే అయితే అతడు అదే చేస్తున్నాడు . ఆప్యాయం గా దరిచేరిన కోమలి కన్నీటిని తుడుస్తూ , ఆమె తో అతడు పలికిన ఒకే మాట .. "నువ్వలా ఏడుస్తాననంటే నేను వెళ్లి పోతాను .నేనుండగ నీకంట నీరు నే చూడబోను , చూసినా తట్టుకోలేను ., ఏం చెయ్యమంటావ్ ? వెల్లి  పోనా..?".
 వెళ్లి పోతాను ..అనే మాట అతని నోట వినటమే ఇష్టం  లేనట్టు , అతని మాటలు ఇంకా పూర్తి కాకుండానే ఆమె చేతిని అతని నోటికి అడ్డుగా నిలిపింది.అతనుండగా ఎప్పుడూ ఏడవకూడదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది . అతగాని వెచ్చని కౌగిలి లో ఆమె ఒదిగిపోయింది. అమ్మలా లాలిస్తున్న అతని ఒడిలో ఆమె పసిపాపలా నిదుర పోతుంది.ఈ క్షణం అతడి కోరిక "ఆమెనెప్పుడూ  ఇంతే భద్రం గా , సంతోషం గా , తన కంటి రెప్పలా కాపాడాలి, తన గుండెచప్పుడు అతని  గుండె తో వినాలి ." మరి ఆమె కోరిక ?
" ఎప్పటికీ కాలం ఇలానే నిలిచిపోవాలి , అతని సాంగత్యం లో ,వసి వాడని వసంతం తన వాకిట్లో ఎప్పుడూ వెళ్లి విరియాలి ."  .

 "నీకేం కావాలో కోరుకో ఒక్క మా ప్రేమ తప్ప___" అంటూ  వాళ్ళిద్దరూ ఇప్పుడు దేవుడికైనా వరమిస్తారు  (1)

పూలు +మొగ్గలు = నీ పెదవులు ..







మొగ్గలు  పువ్వుల్లా విచ్చుకో గలవు ,
పువ్వులు  మొగ్గల్లా  ముడుచుకోలేవు ..
నీ  పెదవులు  మాత్రం,
మొగ్గల్లా  ముడుచుకో  గలవు,
పువ్వుల్లా విచ్చుకోనూ గలవు,
అందుకే
నీ  పెదాలంటే  నాకిష్టం  ..


(T1 / V)

Friday, September 3, 2010

నా కన్నీళ్లు ..
















నువ్వు నన్నొదిలి వెళ్తున్నావని నేను బాధపడినా,
నేను ఒంటరిని మాత్రం కాదు నేస్తం  ,
ఎందుకంటే నా  కన్నీళ్లు నాకు తోడున్నాయి,
నులివెచ్చగా ఓదార్పుని  ఇస్తున్నాయి..

ఈ రోజే తెలుస్తోంది నాకు ,
కన్నీళ్లు కూడా కమ్మగా ఉంటాయని ,
కన్నీళ్ళని మించిన చెలిమి లేదని,
కన్నీళ్ళకేమీ సరిరావని.

సుఖాల్లోనే కాదు కష్టాలలో కూడా ,
నేనున్నానంటూ ఆప్యాయం గా హత్తుకునే
కన్నీళ్లు ,నాకెప్పుడు దూరం కాకూడదు .

ఇది నేను కోల్పోతున్న ,
నీ తీయని చెలిమి  ఇస్తున్న ఉప్పటి వరమేమో కదా .
లేక నా దురదృష్టం నాకిచ్చిన విముక్తా ?

నేను దుఃఖం తో కుంగిపోను .,
ప్రక్కవారిలో వున్న దుఃఖాన్నిఅర్ధం చేస్కునే ఔదార్యం నాకుంది ..
నేను వాళ్ళ బాధల్ని తీర్చక పోవచ్చు, కానీ వాళ్ళ దుఃఖాన్ని అయితే తీర్చగలను,

నాకు తెలుసు ,

చెలిమిని కోల్పోయిన చెలిమికి , చెలిమిని మించిన చెలిమి మరొకటి లేదని .

Saturday, August 28, 2010

మరుజన్మంటూ ఉంటే.,


కాలం కరిగి పోతుంది.,
నీ పై ప్రేమ పెరిగిపోతుంది ..

కరిగేకాలాన్నిఆపలేను.,
నీపై పెరిగే నా ప్రేమనూ అంతే ..

మృత్యువు ముందు ఎవర్ని 
వరిస్తుందో తెలియదు..        నువులేని ఆ క్షణం ఊహించలేను ..

మరుజన్మంటూ ఉంటే.,
నీ తనువుపై పుట్టుమచ్చని కావాలని కోరుకుంటాను .,
నీ తోడుగా జన్మిస్తాను.,నీ నీడగా మరణిస్తాను ..

Friday, August 27, 2010

2012 (2)

మన దేశానికీ ఉత్తరం గా ఎత్తైన హిమాయల పర్వతాలు మనకు ఎవరెస్ట్ అంత అండగా ఉన్నాయని , మనకు నీటి కొరత రాకుండా జీవనదుల్ని ప్రసాదిస్తున్నాయని చాలా గొప్పగా చెప్పుకుంటాం ..
ఒకవేళ కాలుష్య కోరల్లో చిక్కుకుని హిమాలయాలు తన ఉనికిని కోల్పోతే , హిమాలయాలు కరిగిపోతే .. ?

ఇలానే ఉంటుందేమో ?











Wednesday, August 25, 2010

2012

యుగాంతం
2012 మంచి గ్రాఫిక్స్ , అద్భుతమైన టెక్నాలజీ , అత్యద్భుతమైన కధ స్ట్రీంలైనింగ్ , మంచి కాన్సెప్ట్ తో అత్యంత వ్యయ ప్రయాసలతో తీర్చిదిద్దిన సినిమా .. గ్లోబల్ వార్మింగ్ నేపద్యం లోఒకవేళ ప్రపంచం అంతమైపోతే ఎలా ఉంటుందో ? , కలలో కూడా ఊహించని అంశాన్ని , అత్యధిక ప్రతిభాపాటవాలు కల్గిన సాంకేతికనిపుణుల సహకారంతో ., అతున్నత సాంకేతిక విలువలతో చాలా అద్భుతం గా దర్శకుడు చిత్రీకరించాడు .
ఈ సినిమా లోనాకు నచ్చిన కొన్ని సన్నివేశాలు ..