Monday, December 20, 2010

మంగళి కత్తికి బలైన కుర్రాడి మీసం .. ( ఫన్నీ కామెడీ )

"విద్య లేని వాడు వింత పశువు " అని నేను మూడో తరగతి చదువుకునే రోజుల్లో మా బడి గోడలపై రాసి ఉండేది.
అంటే సాధారణం గా ఏ పశువుకైనా ( ఆవు , గేదె , మేక , గొర్రె , గుర్రం, పంది , గాడిద , ఏనుగు etc. )  నాలుగు కాళ్ళు ఉంటాయ్ కాబట్టి వింత పశువు అంటే ఏ డైనోసార్ , గాడ్జిల్లా , కింగ్ కాంగ్ ల లాగా రెండుకాల్లతో అతి పెద్దగా భయంకరం గా ఉంటుంది అనుకునే వాడిని .

దాని అర్ధం ఈ మద్యనే నాకు కొంచెం అటూ ఇటూ గా అర్ధమయ్యింది . "బాష రాని వాడు బలి పశువు " అని .

అసలు  మహారాష్ట్ర లో బార్బర్ షాప్ లో ( సెలూన్ లో ) హెయిర్ కట్ చెయ్యించుకున్నంత బుద్ది తక్కువ పని వేరే ఏదీ ఉండడు. ఎందుకంటే భారతీయులంతా నా సహోదరులు అనే సూత్రాన్ని వీళ్ళు వారి వృత్తి లో తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు.

 మనం ఏ హెయిర్ స్టైల్ కావాలన్నా , వాళ్ళ మూల ప్రమాణాల్ని ఉపయోగించి మరాఠీ  స్టాండర్డ్ ఫార్మాట్ లో (డిప్ప కటింగు (స్క్రూ కటింగ్ కి ఓల్డ్ వెర్షన్ ) + బుంగ మూతి ( ఎంత అందమైన మీసాలన్నా ఒకే బ్లేడు తో నున్నగా గొరిగేస్తారు) ) చేసి , ఏదో ప్రపంచం లో ఉన్న స్టైల్ లు అన్నీ వీళ్ళే కనిపెట్టినట్టుగా ఓ వెకిలి నవ్వొకటి మన మొహాన్న పడేస్తారు.

నేను ఇక్కడికొచ్చిన కొత్తలో నాకు మరాఠీ రాదు (ఇప్పటికీ రాదు ). హిందీ కూడా రాదు (  ఈ మద్య మేనేజ్ చేస్తున్నా ).
మా అన్న ని అన్నా" బ్యాక్ సైడ్ కొంచెం జుట్టు తగ్గించాలి , ఎక్కువ కట్ చెయ్యకూడదు  .ముందు వైపు కూడా అంతే .సైడ్స్ నార్మల్ గా ఉంచాలి " దీన్ని హిందీ లో చెప్పు అని అడిగా .

మర్చి పోకుండా ఓ పేపర్  తీస్కుని  అతను  చెప్పింది  రాయటం  మొదలెట్టాను  .

"పీచే  బాల్  కం  కట్ కరో  , మత్  జ్యాదా  కట్ కరో  . ఆగే  భీ  ఐసా  కరో  . బాజు  మే  నార్మల్  రఖో  "

చీటీ ని జాగ్రత్త  గా  మడిచి  పై  జేబులో  పెట్టుకుని సెలూన్ కి వెళ్లాను . సెలూన్ చాలా  ఖాళీ  గా ఉంది  . ఆహా  నా పంట  పండింది  అనుకుంటూ  వెళ్లి  ఒక చైర్  లో కూర్చున్నాను.

"కైసా కట్ కర్ నేకా " అన్నాడు వాడు నన్ను చూస్తూ .
కితనా ( ఎంత ) అన్నాను నేను.
"పైసా నహీ కైసా , కైసా "అన్నాడు వాడు .

"దేశం ఎలా మారి పోయింది . జుట్టు వాడి చేతిలో పెట్టాకా కూడా డబ్బులో, డబ్బులు , పైస లో  పైసలు అంటూ ఎలా అడుగుతున్నాడో చూడు . అయినా నేనేమైనా డబ్బులు ఇవ్వనన్నానా ? ఇస్తాననే అన్నాను గా . అయినా పైసా పైసా అని వీడు నన్ను ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ?. రాను రాను దేశం లో మంచి తనం, నమ్మకం సన్నగిల్లి పోతున్నాయ్ . మనుషులు మరీ డబ్బు మనుషులు గా మారి పోతున్నారు" అని అనుకుంటూ,

ఎందుకయ్యా అలా అరుస్తావ్ , బుద్దుందా లేదా , ఇక్కడే కదా ఉన్నాను. డబ్బులివ్వకుండా ఎక్కడికైనా పారి పోతానా ఏంది ?

చెప్పు ఎంత ? కితనా  అన్నాను .

వాడు నన్ను చూసి జడవకున్నా , నా కోపానికి కొంచెం జంకినట్లు ఉన్నాడు.
మారు మాట్లాడకుండా ఏ స్టైల్ లో కట్ చెయ్యాలి అన్నట్టు ఒక సైగ చేసాడు .

అది మరి సంగతి "దేశం నోరున్నోల్ల సొత్తు " అని ఊరికేనే అన్నారా పెద్దోళ్ళు. నోరు ఉంది కాబట్టి నేను వీడిని దారి లో పెట్ట గలిగేను, అదే మెతక మనిషినైతే ఇంకేమన్నా ఉందా ? పైసా పైసా అని వీడు వాడి మెదడు తినేద్దుడు.

సర్లే వీడు ఎలాగా మనం అడిగిన స్టైల్ లో చేస్తానంటున్నాడు కాబట్టి , నా చొక్కా పై జేబు లో ఉన్న చీటీ తీసి చదవటం మొదలెట్టాను . "ఫిర్ సే బతాయియే" అన్నాడు వాడు . నేను వేగంగా చదవటం వల్ల వాడికి అర్ధం కానట్టు ఉంది అనుకుని చాలా నెమ్మది గా అర్ధవంతం గా చదవటం మొదలెట్టాను

"పీచే బాల్ కం కట్ కరో మత్ , జ్యాదా కట్ కరో . ఆగే భీ ఐసా కరో . బాజు మే నార్మల్ రఖో " అన్నాను .

వాడికి బాగానే అర్ధమయ్యింది అనుకుంటా . కత్తెర తో రడీ అయ్యి  పోయాడు. నేను కళ్ళు మూసుకున్నాను . ( క్రికెట్ లో ఇండియా వికెట్లు కోల్పోతున్నా, ఇన్నాళ్ళుగా పెంచుకున్న జుట్టు ఒక్కసారిగా కట్ చేయించుకుంటున్నా నాకు చాలా బాధగా ఉంటుంది .తెగిపడుతున్న నా ఓక్కో వెంట్రుకని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు . అందుకే కళ్ళు మూసుకున్నాను :D)

అప్రయత్నం గా నే నిద్ర పట్టేసినట్టుంది. "సార్ , సార్ కైసా హై  ? " అంటూ నన్ను నిద్ర లేపాడు వాడు.

నిద్ర లేపినందుకు కోపం రాలేదు నాకు . నిద్ర లేపుతూ కూడా పైసా , పైసా అని లేపుతున్నాడు. డబ్బు దెయ్యం గాడు. అందుకు కోపం వచ్చింది. కితనా ? అని గట్టిగా అరుస్తూ వాడి మొహం చూసాను.

"నీ మొహం ఎలా ఉందో ఒకసారి చూస్కో" అన్నట్టు అద్దం వైపు చూపిస్తూ సైగ చేసాడు.

నా మొహానికేంటి రా ? అనుకుంటూ అద్దం వైపు తిరిగాను. ఈకలు పీకేసిన కోడైనా కొంచెం నయమేమో అనిపించేంతగా చేసాడు వాడు. వాడి మీద కోపం కంటే ,ఎట్టా ఉండే టోన్ని, ఎట్టా తయారు చేసేడు వీడు అనే బాధ ఒక పక్క, ఈకలు అన్నీ( జుట్టు అంతా ) పోయింది అన్న దిగులు ఓ పక్క నా మనసుని ఆవహించేసుకుంది. వంద వాడి చేతిలో పెట్టి నిస్సహాయం గా బయటికి వచ్చాను .

సార్ , సార్ , చుట్టా, చుట్టా(చిల్లర)  అంటూ వెనక్కి పిలుస్తున్నాడు వాడు.

"ఏరా బంగారం లాంటి నా జుట్టు నీ కత్తెరకి బలిచ్చి, నువ్వు చేసిన  ఈ మహా గొప్పపనికి ఓ వంద చేతిలో పెడితే , చుట్టా , చుట్టా అని నన్ను పిలుస్తావా? నీ మొహానికి నేను చుట్టలు, సిగరెట్లు కాల్చేవాడిలా కనిపిస్తున్నానా " అని వాడి మీద అరుద్దామనుకున్నాను .  ఏం చేస్తాం  కాలం కలిసి రాకపోతే పులిహోర తిన్నా పులి కనిపించదు .వీడికి నా మంచితనమెక్కడ కనిపిస్తుంది అనుకుంటూ ఇంటి దారి పట్టాను .

"అసలు ఇక్కడ ఒక్కడు కూడా తిన్నంగా ఉండడా ? నేను చెప్పిందొకటి , వాడు చేసిందొకటి. నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేఖం గా చేసాడు వాడు. హిందీ రాక పోతే నాకు రాదు అని చెప్పొచ్చుగా , నల్ల గా నిగ నిగాలాడే నా జుట్టు నేల పాలు చేసాడు. హిందీ రాక పోయినా నేను నిన్నడిగి , చీటీలో రాసుకుని మళ్ళీ వెళ్ళలేదా ? , అలాగే వాడు ఎవడో ఒకన్ని అడిగైనా చెయ్యాల్సింది. ఛ.. నాటు కోడి పెట్టలా ఉన్న నా తలని కాస్తా గిన్నెకోడి పెట్టను చేసేసాడు "అంటూ నా చేతిలో ఉన్న చీటీని వేణన్న టేబుల్ పై పడేసాను .

"అసలు నిన్ను జ్యాదా కి ముందెవరు కామా(,) పెట్టమన్నారు ? "అని వేణన్న అడిగి,  దానివల్ల జరిగిన అనర్ధమే ఇదని నాకు పూస గుచ్చినట్టు వివరించాడు . 

**********************************************************************************
 ఎపిసోడ్ నెం.2 
ఒక సారి దెబ్బతిన్న పుంజు మళ్ళీ దెబ్బ తినదు. అలాగే ఇప్పటి వరకూ నేనెప్పుడూ మరలా జుట్టు విషయం లో దెబ్బతినలేదు.
మొన్ననే మళ్ళీ సెలూన్ కెల్లా , జుట్టు విషయం లో నేను చెప్పినట్లే చేసాడు. అయితే సైడ్ ల విషయం లో కొంచెం కంగారు పడి ఎక్కువ కట్ చేసాడు . హెయిర్ స్టైల్ చేంజ్ అయిపోయింది. హెయిర్ స్టైల్ మారాకా నా (కొమరం) పులి మీసాలు నాకే బాగోలేదనిపించాయి.కైసా కర్నేకా సార్ అన్నాడు .కొంచెం మీసం సైజు తగ్గించమన్నాను. ఇంతలో పక్క చైర్ లోంచి నా కొలీగ్ మురళి లేచాడు. అతని మీసం ఒకవైపు "దబంగ్ (సల్మాన్) స్టైల్ ", మరో వైపు "వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై ( అజయ్ దేవగన్ ) స్టైల్  ". అంతే .. వీడు నా మీసం పై మిషన్ పెట్టిన విషయం మర్చి పోయి ఒక్క నవ్వు నవ్వాను ............................................... తర్వాత మురళి నవ్వాడు .

సీన్ కట్ చేసి చూస్తే ఈ రోజు ఆరెంజ్  స్టైల్ లో ఉన్నాయ్ నా మీసాలు .

**********************

ఎలాగూ నా భాషా ప్రావీణ్యం  ఏపాటిదో ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది . భాష గురించే చాలా మాట్లాడాను కాబట్టి మీకు కొందరిని పరిచయం చెయ్యాలి .

ఇక్కడ  నాకు ఒక హిందీ గైడ్ లాంటి వ్యక్తి ఒకతను ఉన్నాడు.దుర్గా ప్రసాద్ . మా స్టోర్ ఇంచార్జ్  ఫ్రమ్ అమలాపురం.
హిందీ లో ఒక కొత్త స్లేంగ్ సృష్టించిన వ్యక్తి ,కాదు ఓ శక్తి .
హిందీ ని తూర్పు గోదావరి యాసలో మాట్లాడటమెలా ? అని మా వాడి దగ్గర నేర్చేసుకోవచ్చు. ఇక్కడి కొచ్చిన మొదట్లో మా వాడూ నా స్కూలే . అయితే 30 రోజుల్లో హిందీ నేర్చుకోవటమెలా ? అనే పుస్తకం కొని మూడునెలల్లో చాలా వరకు హిందీ నేర్చేసుకున్నాడు .
" మే ప్రసాద్ బాతు కర్రా హా హూం , ఆపు కవున్ ?,ఎక్కడ హై మీరు ?, ఐసా క్యా ?, తూ వుదరు టైరో ! మే ఆర హా హూం , హా .. ఐస హై తో కుచ్ నహీ హోతా మరి , జ్యాదా మాట్లాడితే బాగోదు హై " ఇలాంటి పదజాలాలు వాడుతుంటే "తెలుగోళ్ళ నవ్వు ఆగటానికి, మరాఠీ ( హిందీ ) వాళ్లకి అర్ధం కావటానికి మినిమం 15  నిమిషాలు పడుతుంది .


ఇదే  కోవకు  చెందిన  మరో వ్యక్తి " శీను  "
శీను  గురించి  చెప్పటానికి  ఒక  టపా  మొత్తమే  సరిపోదు  . ఇంకా  టపాలో  మిగిలిన  ఈ  స్పేస్  ఎంత  ?
తర్వాతి టపాల లో  శీను  & batch  గురించి  రాస్తాను ..



Thanks for Your Visit.

మీ
స్వామి ..

11 comments:

  1. అను గారు ,రాధిక అక్క, పద్మార్పిత గారు మీ ముగ్గురికీ థాంక్స్ ..
    :-)

    ReplyDelete
  2. ఇంక నయం గుండు కొట్టించలేదు ఈ సారి హింది బాగ నేర్చుకోని వెళ్లు లేకపోతే తను కైసా ,కైసా నీవు ఐసా ఐసా అన్నావనుకో చెప్పాగా ఇంక అంతే సంగతులు...keep writing so funny waiting for next post :)

    ReplyDelete
  3. @ వేణూ శ్రీకాంత్ గారు ,
    :-)
    థాంక్ యు అండి . , & Welcome to My Blog..
    @ అశోక్ భాయ్ ,
    ఐసా ఎప్పుడూ నహీ హోగా ,
    క్యోం కీ , నేనూ మార్గ దర్శి లో జాయిన్ అయ్యాను హై.
    "30 రోజుల్లో హిందీ" కొన్నాను హై .

    (కానీ గుండుని హిందీ లో ఏమంటారో వాడు రాయలేదు . లేకుంటే "మత్, గుండు కరో "అనేవాడిని .
    :-)
    thanks for ur support..

    ReplyDelete
  4. thank you swamy for answering me.
    :)

    ReplyDelete
  5. హహహహహ బావుందండీ మీ భాషాప్రావీణ్యం. నవ్వలేక చచ్చాననుకోండి....స్వామి గారు మీ రైటింగ్ స్టైల్ బావుంది. ఇలాగే రాస్తూ ఉండండి.

    ఇప్పటికైనా హిందీ వచ్చిందా లేదా?

    ReplyDelete
  6. @Prathi Udayam
    U r MELCOWW ( WELCOME )..
    @సౌమ్య గారు థాంక్స్ ఫర్ ది కామెంట్ .

    ముందే చెప్పాను కదండీ మేనేజ్ చేస్తున్నా అని .
    జస్ట్ మేనేజ్ మాత్రమే ..

    ReplyDelete