Thursday, April 28, 2011

జుం జుం మాయ .. ఇది హల్వా మాయ..

అనగనగా

అది నేను నిక్కర్లేసుకుని తిరిగేటప్పటి ఓ రోజు సాయంత్రం..
నేను పెసాదం గాడు మా బళ్ళో ఆఖరిగెంట కొట్టకుండానే ,మా బోర్డేస్కూలు హెడ్డు మేస్టారి కళ్ళు కప్పి , బడిగోడదూకి, పారిపోయి పెందలాడే కొంపకి వచ్చెయ్యటం మూలంగా సాయంకాలమేల ఓ అరగెంట పెరిగినట్టు ఉంది.

తాతయ్యకి కనిపిస్తే ఏరా ఇయ్యాల పెందలాడే బడి ఇడిచిపెట్టేసేరా, గొమ్మున ఇంటికొచ్చేసేవు ? అని ఎక్కడ అడుగుతాడో అన్న బెయంతో మెల్లగా సడీ సప్పుడు సెయ్యకుండా నక్కి నక్కి ఇంట్లోకి దూరి పుస్తకాల సంచిని తలుపు గడియకి తగిలించేసి, మెల్లగా పెసాదం గాడి ఇంటికి బయలుదేరేను.


మా ఇల్లు దాటేనో లేదో " ఒరే కేశవా , నువ్వప్పుడే బడి నుంచి ఒచ్చేసావ్ , మా పిల్ల ఇంకా రాలేదేంట్రా ? " అని లచ్చక్క కేకేసింది."మేష్టారు అడిగిన పెశ్నలకి సరిగ్గా సమాదానం సెప్పినోల్లని ఒక్కొక్కలుగా పంపేత్తున్నారు, సెప్పనోల్లని అక్కడే ఉంచి సదివిత్తున్నారు ,
మీ అమ్మాయి ఎప్పుడు సదవాలి , ఎప్పుడు సమాదానం సెప్పాలి ? అందరూ వచ్చేకా ఆఖరున ఎప్పుడో గెంట కొట్టేకా వత్తాదిలే అక్కా, నువ్వేమీ కంగారుపడమాకు" అని ధైర్యం సెప్పి మెల్లగా అక్కడ నుంచి జారుకుని పెసాదం గాడి ఇంటిదగ్గరికి సేరుకున్నాను.


ఆడిల్లు ఇంకో నాలుగు బారలు దూరం ఉందనగానే మా వోడు ఏదో రాగం తీత్తా నా దగ్గరకి వచ్చేడు. ఆ రాగం లోనే కలిపేత్తా మా నాన్న బడిలోంచి పారిపోయి వచ్చినందుకు నన్ను ఏకేసి, కుమ్మేసి,దంచేసేడురా అని సెప్తా కూసింత సవుండు పెంచేడు.


ఏడవకరా పెసాదం ..మనం ఇంకా సిన్నపిల్లలం , అందుకే మేష్టారు కళ్ళు కప్పినా , ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పలేక పోతున్నాం. మొన్న ఇద్దరం తన్నులు తిన్నాం , ఇప్పుడు నువ్వొక్కడివే తిన్నావ్ .. రేపొద్దున్న ? ఏంటి ?
అసలు ఏంటి రేపొద్దున్న ? అని రెట్టించి, ఊరించి అడుగుదుల్లోకి , ఉతసాహం గా పెసాదం గాడు "ఎవ్వరం తన్నులు తినం " అని ఆశాభావం ఎకతం చేసేడు.బగుషత్తును సూస్కుని ఇయ్యాలమనం పడ్డ నొప్పుల్ని మర్సిపోవాల్రోయ్ పెసాదం అని ఆడికి , నేను అప్పటికే సూసిన అదేదో సినిమా డవిలాగుతో కూసింత ఇతబోద సేద్దుల్లోకి ఆడు ఆడి కన్నీల్లను అట్టాగే మింగేసేడు.


"ఒరే, అసలు మనిద్దరం ఎందుకు బడి గోడ దూకేము ? ఎందుకు నువ్వొక్కడివీ తన్నులు తిన్నావు ? " అని నేను అడిగితే అన్నీ తెలిసీ కూడా మళ్ళీ ఏం తెలియనట్టు ఆ పెశ్న ఏంట్రా ? అన్నట్టు మొహం పెట్టేడు .
"చెప్పరా చెప్పు , దేనికోసం ? అని మళ్ళీ అడుగుదుల్లోకి మెల్లగా సమాధానం సేప్పేడు " అలవా" అని .


అదిమరి! , నువిల్లా ఏడుత్తా కూర్చుంటే , ఇయ్యాలున్న లచ్చివారం అయిపోద్ది, మన ఊరి సంతలో మిర్చిరి బండోడి దగ్గిర అల్వా కూడా అయిపోద్ది "అని నేను అన్నాను . గొమ్మున ఎల్దాం నడువు అని నన్ను కంగారు పెడతా పెసాదంగాడు సూపరు బండిలా దూసుకెళ్ళి, మా గంగరాజు ఆళ్ళ ఇంటికాడ సడన్ బ్రేకు ఏసేడు. తీరా ఎందుకు ఆగేడా అని సూత్తుంటే మా ఈరబాబు, గంగరాజు తాడు బొంగరం ఆట ఆడుతున్నారు . "ఏరా మాఇద్దరినీ కేకేయ్యకుండా మీరిద్దరే ఆడేస్కుంటున్నారే ?" పెసాదం గాడు ఈరబాబు గాడిని నిలదీసేడు.

"కేశవా నీ గురించి అడిగితే మీ ఇంట్లో నువ్వింకా బడి నుంచి రాలేదని చెప్పేరు.
పెసాదం గురించి ఎల్తే ఈడి నాన్న అప్పుడే ఈడికి పెళ్లి సేత్తున్నాడు. ఇంకేం కేకేత్తాంలే అని మేమిద్దరమే ఆడుకుంటున్నాం" అని సెప్పాడు మా ఈరబాబు.


మామూలుగా అయితే నేను పెసినడిగితే ఆడికి సమాధానం సెప్తావేంట్రా అని మళ్ళీ కసురుకునేవోడే ,కానీ ఎందుకో గమ్ముగా ఉండిపోయేడు మా పెసాదం .


అయితే మేమిద్దరం కూడా ఆడతాం అన్నాను నేను . గంగరాజు ఇంట్లోకెళ్ళి ఇంకో రెండు బొంగరాలు తెచ్చేడు. అసలే ఆల్లనాన్న సేతిలో తన్నులు తిని, అది ఈరబాబుగాడు సూసినందుకు బాద పడుతున్న పెసాదం , తాడుని గట్టిగా చుట్టి బొంగరాన్ని బలంగా నేలనేసి కొట్టేడు.
అది గతి తప్పి గోడమీద పడి ఎగిరి పక్కనే ఉన్న , తమలపాకులకి రంగులేసే పిడత(చిన్నపాటి మట్టి కుండ ) మీద పడి , పిడత పగిలిపోయింది .


ఎవరూ సెప్పాల్సిన అవసరం లేకుండానే అక్కడనుంచి మేం నలుగురం పరిగెత్తుకుని వచ్చేసేము.
సేలాసేపు ఊరంతా తిరిగి తిరిగి చివరికి సీకటి పడ్డాకా సంతలోకి సేరేము. సంత(బజారు, మార్కెట్టు లాంటిది ) లో జన సాంద్రత దాదాపు సర్దుకుంది . మా అదృష్టం బావుండి హల్వా ఇంకా ఉంది.

రెండ్రోజులుగా ఖర్చు పెట్టకుండా దాచిన తాతయ్య ఇచ్చిన అయిదు రూపాయలు ఇచ్చి , చిల్లర కోసం నిలబడి ఉన్నాను .రూపాయివ్వు.. అని అడిగాను . ఒకొక్కటీ రూపాయన్నర అని , తిరిగి అతను నన్ను రూపాయివ్వు అన్నాడు ..


ఏం చెయ్యాలో తెలీని పరిస్థితి లో నిలబడ్డ నాకు, మా తాతయ్య వరల్డ్ బ్యాంకులా అక్కడే కనిపించాడు .
నన్ను చూసి నా దగ్గరికే వచ్చాడు . తాతయ్యా ఒక్క రూపాయివ్వు .. అని ఒక ఆర్డరు లాంటి రిక్వస్ట్ చేసేను ..
చీకటి పడే వరకూ ఆటలు ఆడకూడదమ్మా అని మా తాతయ్య మాకు చెప్పి ,అతనికి ఆ రూపాయిచ్చి , నా ఫ్రెండ్స్ ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి,నన్ను మా పెసాదాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాడు ..


మా బాబాయి పెళ్ళికొచ్చి వెళ్లి పోయిన చుట్టుపక్కల ఊర్లో ఉండే చుట్టాలంతా మళ్ళీ మా ఇంటిదగ్గరే ఉన్నారు.
మా ఊళ్ళో తెలిసినోల్లు , మా స్కూలు హెడ్డు మాస్టారు , మా పెసాదం వాళ్ళ అమ్మా నాన్నా, మా నాన్న ఫ్రెండ్స్ అంతా మా ఇంటి దగ్గర గుమిగూడేరు . గొప్ప పని చేసి ఇంటికి తిరిగొచ్చే యోధుల్ని సూసినట్టు , అంతా మమ్మల్ని ఆశ్చర్యం + ఆనందం + అదో రకం భావంతో చూడసాగేరు..



కాసేపటికి అంతా సర్దుకుంది ..
మా ఊళ్ళో వాళ్ళు ఎవరింటికి వెళ్లి పోయేరు . మా చుట్టాలంతా ఇంట్లోనే ఉన్నారు.


అమ్మా చుట్టాలు అంతా వచ్చారు మళ్ళీ ఎవరిదైనా పెళ్ళా ? అని అడిగాను ..దానికి మా అమ్మ చెప్పిన సమాధానం విని నేను అసలు నమ్మలేక పోయాను .


"నేను పెసాదం కలిసి హల్వా తినటానికి వెళ్లి , బొంగరాల ఆట దగ్గర కుండ పగలగొట్టి , పారిపోయి , అలసిపోయి , హల్వాతినే మద్యలో ...


ఇంట్లో పెసాదం లేడు. అని గమనించిన పెసాదం వాళ్ళ నాన్న తను కొట్టటం వల్లనే పెసాదం ఇంట్లోంచి పారిపోయాడు అని భావించి, ఏమైనా నాకు తెలిసి ఉంటుందేమో అని మా ఇంటికొచ్చాడు. నేను ఇంకా బడి నుంచి రాలేదు అని మా తాతగారు చెప్పిన సమాధానానికి నిర్ఘాంత పోయాడు. పుస్తకాల సంచి ఇంట్లోనే ఉంది అని మా అమ్మ చెప్పిన సమాధానానికి కాస్త తేరుకున్నాడు, నేను చెప్పిన కథని జంతికలు చుట్టి మరీ వినిపించి చెప్పిన మా లచ్చక్క స్టోరీకి ఇంకాస్త కోలుకున్నాడు , క్లాసు ఎగ్గొట్టి గోడ మేమిద్దరం కలిసే దూకాం అని మా హెడ్డు మాస్టారు నిర్ధారణ చెయ్యటం తో మామూలు మనిసయ్యాడు.




"తను కొట్టాడన్న కోపానికి మా పెసాదంగాడు , మా తాతగారు కొడతారనే భయం తో నేను ఇద్దరం ఇల్లువదిలి వెళ్ళిపోయాం" అని ఆయన సర్టిఫై చేసేసాడు .

మొదట్లో మా వాళ్ళు కంగారు పడక పోయినా , తర్వాత తర్వాత మా బంధువులందరికీ కాల్ చేసి కంగారు పడటం , వీధి వీధికీ నా మొహం తెల్సినోల్లంతా తిరుగుతూ వెతకటం మొదలెట్టారు.



మేం కనిపించట్లేదు అనే మాట, చిన్నపాటి మార్పుల పరిణామం చెంది మేము పారిపోయామని,
మేము పారిపోయామనే మాట , మేము తప్పిపోయామని
మేము తప్పి పోయామనే మాట, మమ్మల్ని ఎవరో తీసుకు( కిడ్నాప్ ) పోయారని గా మారిపోయాయి.


ఎవరు చూసారో తెలీదు కానీ మేము నలుగురం హల్వా తినటం చూసారట !

ఈ మాటకూడా పరిణామం చెంది "హల్వా తిన్న నలుగురిలో ఇద్దరం మేము అనగా ( కేశవ , పెసాదం )" గా అయ్యింది .


తర్వాత ఈ రెండువాక్యాలూ డిజిటల్ మిక్సింగు చేసుకుని ..



"ఊళ్లోకి పిల్లల కిడ్నాపర్లు చొరబడ్డారని ,
వాళ్ళు హల్వా లో మత్తుమందు కలిపి నలుగురు పిల్లల్ని తీసుకెళ్ళి పోయారని ,
ఆ హల్వా తిన్న నలుగురు లో మేం ఇద్దరం కూడా ఉన్నామని గా రూపాంతరం చెందాయి .

కొంతమంది చెక్ పోస్ట్ దగ్గర వాహనాలని ఆపి తనికీ చేస్తుంటే , మరి కొంత మంది బస్టాండులో వెతకటానికి వెళ్ళారు .అసలు ఈ హల్వా గోల ఏంటో తేలుద్దామని మరికొంత మందితో ఇలా సంతలోకి వచ్చిన మా తాతయ్య నా రూపాయి బాకీని చెల్లించారు .

ఆ తర్వాత కొద్ది రోజుల వరకూ , కొద్ది రోజులేంటి ఇప్పటివరకూ మా పెసాదాన్ని , వాళ్ళ నాన్న నిజం గానే ప్రసాదం లా చూడ్డం మొదలెట్టాడు. ఆ తర్వాత వాడిని ఒక్కసారి కూడా పల్లెత్తు మాట కూడా అనలేదు ..

ఉరుము ఉరిమి మంగళి మీద పడిందనో ఏమో ఒక సామెత ఉంటుంది . నాకు ఖచ్చితం గా గుర్తులేదు
కానీ అలా ,అటుచేసి ఇటు చేసి మా నాన్న , పెసాదం వాళ్ళ నాన్న మా అమ్మలకి హల్వా చెయ్యటం రాకపోవటమే ఇంత అనర్ధానికి మూల కారణం అని తేల్చేసారు . :) :)


ఆరోజు నుంచి మా అమ్మ , ఏదైనా పండగొస్తే చాలు , క్యారెట్ హల్వా , బాదం హల్వా, గుమ్మడి హల్వా .. ఇలా హల్వా లతో నే మా పై హమలా చేస్తుంది.. సంవత్సరాలు గడిచాయి .. .


మా అమ్మ హల్వా హమలా తో ఊరుకోలేదు ,
"మీకు క్లాస్ డుమ్మా కొట్టాలంటే కొట్టుకోండి, సినిమాకెల్తారో క్రికెట్టు గ్రౌండుకెల్తారో మీ ఇష్టం , అంతేకానీ నా వంటల ప్రసక్తి మద్యలో తెచ్చి మీ నాన్న నన్ను మాట అనేలా చేసారో , మీ ఇద్దరికీ తన్నులు పడతాయ్" అని నాకు మా తమ్ముడి గాడికి చిన్నపాటి ( సారీ , ఇది చిన్నపాటిది కాదు కదా ! చాలా పెద్దపాటి ) వార్నింగు తో కూడిన బెదిరింపు ఇచ్చేసింది ..


ఏం చేస్తాం చెప్పండి .. అంతా హల్వా మాయ ..!

Friday, April 8, 2011

మా వేణు బాబు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు ..

HAPPY BIRTH DAY to YOU


             VENHU BABU  






వేణు అన్నా నీకు హార్ధిక జన్మదిన       శుభాకాంక్షలు .. 



- స్వామి( కేశవ)
- Aster .టీం ఇన్ ఫ్రా ( కొల్హాపూర్ )