Monday, December 20, 2010

మంగళి కత్తికి బలైన కుర్రాడి మీసం .. ( ఫన్నీ కామెడీ )

"విద్య లేని వాడు వింత పశువు " అని నేను మూడో తరగతి చదువుకునే రోజుల్లో మా బడి గోడలపై రాసి ఉండేది.
అంటే సాధారణం గా ఏ పశువుకైనా ( ఆవు , గేదె , మేక , గొర్రె , గుర్రం, పంది , గాడిద , ఏనుగు etc. )  నాలుగు కాళ్ళు ఉంటాయ్ కాబట్టి వింత పశువు అంటే ఏ డైనోసార్ , గాడ్జిల్లా , కింగ్ కాంగ్ ల లాగా రెండుకాల్లతో అతి పెద్దగా భయంకరం గా ఉంటుంది అనుకునే వాడిని .

దాని అర్ధం ఈ మద్యనే నాకు కొంచెం అటూ ఇటూ గా అర్ధమయ్యింది . "బాష రాని వాడు బలి పశువు " అని .

అసలు  మహారాష్ట్ర లో బార్బర్ షాప్ లో ( సెలూన్ లో ) హెయిర్ కట్ చెయ్యించుకున్నంత బుద్ది తక్కువ పని వేరే ఏదీ ఉండడు. ఎందుకంటే భారతీయులంతా నా సహోదరులు అనే సూత్రాన్ని వీళ్ళు వారి వృత్తి లో తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు.

 మనం ఏ హెయిర్ స్టైల్ కావాలన్నా , వాళ్ళ మూల ప్రమాణాల్ని ఉపయోగించి మరాఠీ  స్టాండర్డ్ ఫార్మాట్ లో (డిప్ప కటింగు (స్క్రూ కటింగ్ కి ఓల్డ్ వెర్షన్ ) + బుంగ మూతి ( ఎంత అందమైన మీసాలన్నా ఒకే బ్లేడు తో నున్నగా గొరిగేస్తారు) ) చేసి , ఏదో ప్రపంచం లో ఉన్న స్టైల్ లు అన్నీ వీళ్ళే కనిపెట్టినట్టుగా ఓ వెకిలి నవ్వొకటి మన మొహాన్న పడేస్తారు.

నేను ఇక్కడికొచ్చిన కొత్తలో నాకు మరాఠీ రాదు (ఇప్పటికీ రాదు ). హిందీ కూడా రాదు (  ఈ మద్య మేనేజ్ చేస్తున్నా ).
మా అన్న ని అన్నా" బ్యాక్ సైడ్ కొంచెం జుట్టు తగ్గించాలి , ఎక్కువ కట్ చెయ్యకూడదు  .ముందు వైపు కూడా అంతే .సైడ్స్ నార్మల్ గా ఉంచాలి " దీన్ని హిందీ లో చెప్పు అని అడిగా .

మర్చి పోకుండా ఓ పేపర్  తీస్కుని  అతను  చెప్పింది  రాయటం  మొదలెట్టాను  .

"పీచే  బాల్  కం  కట్ కరో  , మత్  జ్యాదా  కట్ కరో  . ఆగే  భీ  ఐసా  కరో  . బాజు  మే  నార్మల్  రఖో  "

చీటీ ని జాగ్రత్త  గా  మడిచి  పై  జేబులో  పెట్టుకుని సెలూన్ కి వెళ్లాను . సెలూన్ చాలా  ఖాళీ  గా ఉంది  . ఆహా  నా పంట  పండింది  అనుకుంటూ  వెళ్లి  ఒక చైర్  లో కూర్చున్నాను.

"కైసా కట్ కర్ నేకా " అన్నాడు వాడు నన్ను చూస్తూ .
కితనా ( ఎంత ) అన్నాను నేను.
"పైసా నహీ కైసా , కైసా "అన్నాడు వాడు .

"దేశం ఎలా మారి పోయింది . జుట్టు వాడి చేతిలో పెట్టాకా కూడా డబ్బులో, డబ్బులు , పైస లో  పైసలు అంటూ ఎలా అడుగుతున్నాడో చూడు . అయినా నేనేమైనా డబ్బులు ఇవ్వనన్నానా ? ఇస్తాననే అన్నాను గా . అయినా పైసా పైసా అని వీడు నన్ను ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ?. రాను రాను దేశం లో మంచి తనం, నమ్మకం సన్నగిల్లి పోతున్నాయ్ . మనుషులు మరీ డబ్బు మనుషులు గా మారి పోతున్నారు" అని అనుకుంటూ,

ఎందుకయ్యా అలా అరుస్తావ్ , బుద్దుందా లేదా , ఇక్కడే కదా ఉన్నాను. డబ్బులివ్వకుండా ఎక్కడికైనా పారి పోతానా ఏంది ?

చెప్పు ఎంత ? కితనా  అన్నాను .

వాడు నన్ను చూసి జడవకున్నా , నా కోపానికి కొంచెం జంకినట్లు ఉన్నాడు.
మారు మాట్లాడకుండా ఏ స్టైల్ లో కట్ చెయ్యాలి అన్నట్టు ఒక సైగ చేసాడు .

అది మరి సంగతి "దేశం నోరున్నోల్ల సొత్తు " అని ఊరికేనే అన్నారా పెద్దోళ్ళు. నోరు ఉంది కాబట్టి నేను వీడిని దారి లో పెట్ట గలిగేను, అదే మెతక మనిషినైతే ఇంకేమన్నా ఉందా ? పైసా పైసా అని వీడు వాడి మెదడు తినేద్దుడు.

సర్లే వీడు ఎలాగా మనం అడిగిన స్టైల్ లో చేస్తానంటున్నాడు కాబట్టి , నా చొక్కా పై జేబు లో ఉన్న చీటీ తీసి చదవటం మొదలెట్టాను . "ఫిర్ సే బతాయియే" అన్నాడు వాడు . నేను వేగంగా చదవటం వల్ల వాడికి అర్ధం కానట్టు ఉంది అనుకుని చాలా నెమ్మది గా అర్ధవంతం గా చదవటం మొదలెట్టాను

"పీచే బాల్ కం కట్ కరో మత్ , జ్యాదా కట్ కరో . ఆగే భీ ఐసా కరో . బాజు మే నార్మల్ రఖో " అన్నాను .

వాడికి బాగానే అర్ధమయ్యింది అనుకుంటా . కత్తెర తో రడీ అయ్యి  పోయాడు. నేను కళ్ళు మూసుకున్నాను . ( క్రికెట్ లో ఇండియా వికెట్లు కోల్పోతున్నా, ఇన్నాళ్ళుగా పెంచుకున్న జుట్టు ఒక్కసారిగా కట్ చేయించుకుంటున్నా నాకు చాలా బాధగా ఉంటుంది .తెగిపడుతున్న నా ఓక్కో వెంట్రుకని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు . అందుకే కళ్ళు మూసుకున్నాను :D)

అప్రయత్నం గా నే నిద్ర పట్టేసినట్టుంది. "సార్ , సార్ కైసా హై  ? " అంటూ నన్ను నిద్ర లేపాడు వాడు.

నిద్ర లేపినందుకు కోపం రాలేదు నాకు . నిద్ర లేపుతూ కూడా పైసా , పైసా అని లేపుతున్నాడు. డబ్బు దెయ్యం గాడు. అందుకు కోపం వచ్చింది. కితనా ? అని గట్టిగా అరుస్తూ వాడి మొహం చూసాను.

"నీ మొహం ఎలా ఉందో ఒకసారి చూస్కో" అన్నట్టు అద్దం వైపు చూపిస్తూ సైగ చేసాడు.

నా మొహానికేంటి రా ? అనుకుంటూ అద్దం వైపు తిరిగాను. ఈకలు పీకేసిన కోడైనా కొంచెం నయమేమో అనిపించేంతగా చేసాడు వాడు. వాడి మీద కోపం కంటే ,ఎట్టా ఉండే టోన్ని, ఎట్టా తయారు చేసేడు వీడు అనే బాధ ఒక పక్క, ఈకలు అన్నీ( జుట్టు అంతా ) పోయింది అన్న దిగులు ఓ పక్క నా మనసుని ఆవహించేసుకుంది. వంద వాడి చేతిలో పెట్టి నిస్సహాయం గా బయటికి వచ్చాను .

సార్ , సార్ , చుట్టా, చుట్టా(చిల్లర)  అంటూ వెనక్కి పిలుస్తున్నాడు వాడు.

"ఏరా బంగారం లాంటి నా జుట్టు నీ కత్తెరకి బలిచ్చి, నువ్వు చేసిన  ఈ మహా గొప్పపనికి ఓ వంద చేతిలో పెడితే , చుట్టా , చుట్టా అని నన్ను పిలుస్తావా? నీ మొహానికి నేను చుట్టలు, సిగరెట్లు కాల్చేవాడిలా కనిపిస్తున్నానా " అని వాడి మీద అరుద్దామనుకున్నాను .  ఏం చేస్తాం  కాలం కలిసి రాకపోతే పులిహోర తిన్నా పులి కనిపించదు .వీడికి నా మంచితనమెక్కడ కనిపిస్తుంది అనుకుంటూ ఇంటి దారి పట్టాను .

"అసలు ఇక్కడ ఒక్కడు కూడా తిన్నంగా ఉండడా ? నేను చెప్పిందొకటి , వాడు చేసిందొకటి. నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేఖం గా చేసాడు వాడు. హిందీ రాక పోతే నాకు రాదు అని చెప్పొచ్చుగా , నల్ల గా నిగ నిగాలాడే నా జుట్టు నేల పాలు చేసాడు. హిందీ రాక పోయినా నేను నిన్నడిగి , చీటీలో రాసుకుని మళ్ళీ వెళ్ళలేదా ? , అలాగే వాడు ఎవడో ఒకన్ని అడిగైనా చెయ్యాల్సింది. ఛ.. నాటు కోడి పెట్టలా ఉన్న నా తలని కాస్తా గిన్నెకోడి పెట్టను చేసేసాడు "అంటూ నా చేతిలో ఉన్న చీటీని వేణన్న టేబుల్ పై పడేసాను .

"అసలు నిన్ను జ్యాదా కి ముందెవరు కామా(,) పెట్టమన్నారు ? "అని వేణన్న అడిగి,  దానివల్ల జరిగిన అనర్ధమే ఇదని నాకు పూస గుచ్చినట్టు వివరించాడు . 

**********************************************************************************
 ఎపిసోడ్ నెం.2 
ఒక సారి దెబ్బతిన్న పుంజు మళ్ళీ దెబ్బ తినదు. అలాగే ఇప్పటి వరకూ నేనెప్పుడూ మరలా జుట్టు విషయం లో దెబ్బతినలేదు.
మొన్ననే మళ్ళీ సెలూన్ కెల్లా , జుట్టు విషయం లో నేను చెప్పినట్లే చేసాడు. అయితే సైడ్ ల విషయం లో కొంచెం కంగారు పడి ఎక్కువ కట్ చేసాడు . హెయిర్ స్టైల్ చేంజ్ అయిపోయింది. హెయిర్ స్టైల్ మారాకా నా (కొమరం) పులి మీసాలు నాకే బాగోలేదనిపించాయి.కైసా కర్నేకా సార్ అన్నాడు .కొంచెం మీసం సైజు తగ్గించమన్నాను. ఇంతలో పక్క చైర్ లోంచి నా కొలీగ్ మురళి లేచాడు. అతని మీసం ఒకవైపు "దబంగ్ (సల్మాన్) స్టైల్ ", మరో వైపు "వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై ( అజయ్ దేవగన్ ) స్టైల్  ". అంతే .. వీడు నా మీసం పై మిషన్ పెట్టిన విషయం మర్చి పోయి ఒక్క నవ్వు నవ్వాను ............................................... తర్వాత మురళి నవ్వాడు .

సీన్ కట్ చేసి చూస్తే ఈ రోజు ఆరెంజ్  స్టైల్ లో ఉన్నాయ్ నా మీసాలు .

**********************

ఎలాగూ నా భాషా ప్రావీణ్యం  ఏపాటిదో ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది . భాష గురించే చాలా మాట్లాడాను కాబట్టి మీకు కొందరిని పరిచయం చెయ్యాలి .

ఇక్కడ  నాకు ఒక హిందీ గైడ్ లాంటి వ్యక్తి ఒకతను ఉన్నాడు.దుర్గా ప్రసాద్ . మా స్టోర్ ఇంచార్జ్  ఫ్రమ్ అమలాపురం.
హిందీ లో ఒక కొత్త స్లేంగ్ సృష్టించిన వ్యక్తి ,కాదు ఓ శక్తి .
హిందీ ని తూర్పు గోదావరి యాసలో మాట్లాడటమెలా ? అని మా వాడి దగ్గర నేర్చేసుకోవచ్చు. ఇక్కడి కొచ్చిన మొదట్లో మా వాడూ నా స్కూలే . అయితే 30 రోజుల్లో హిందీ నేర్చుకోవటమెలా ? అనే పుస్తకం కొని మూడునెలల్లో చాలా వరకు హిందీ నేర్చేసుకున్నాడు .
" మే ప్రసాద్ బాతు కర్రా హా హూం , ఆపు కవున్ ?,ఎక్కడ హై మీరు ?, ఐసా క్యా ?, తూ వుదరు టైరో ! మే ఆర హా హూం , హా .. ఐస హై తో కుచ్ నహీ హోతా మరి , జ్యాదా మాట్లాడితే బాగోదు హై " ఇలాంటి పదజాలాలు వాడుతుంటే "తెలుగోళ్ళ నవ్వు ఆగటానికి, మరాఠీ ( హిందీ ) వాళ్లకి అర్ధం కావటానికి మినిమం 15  నిమిషాలు పడుతుంది .


ఇదే  కోవకు  చెందిన  మరో వ్యక్తి " శీను  "
శీను  గురించి  చెప్పటానికి  ఒక  టపా  మొత్తమే  సరిపోదు  . ఇంకా  టపాలో  మిగిలిన  ఈ  స్పేస్  ఎంత  ?
తర్వాతి టపాల లో  శీను  & batch  గురించి  రాస్తాను ..



Thanks for Your Visit.

మీ
స్వామి ..

Friday, December 17, 2010

నేను మరో బాపు..

నా మొదటి బొమ్మ

బొమ్మ ద చిత్రం , పిక్చర్ ది ఆర్ట్

ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ,
నాకంటే సోమరి , పనిబద్ధకం గాడు పెపంచం లో ఎవడైనా ఉంటాడా అని .

మొన్న కొల్హాపూర్ లో (మా ఆఫీసు లో ) కరెంటు పోయింది . యు.పి.యస్ ఉన్నంత వరకూ సిస్టం పై పనిచేసిన మా వేణు అన్న(మా టీం లీడర్) ఎలాగూ కరెంటు రాదని నిర్ధారణ కు వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ చక్కబెట్టుకునే పనిలో పడ్డాడు. నేనూ ఏదో ఒక సహాయం చేసి పెడదామని అనుకున్నా. సర్లే , ఆఫీస్ లో వన్ సైడ్ పేపర్లు చాలా ప్రింటర్ దగ్గరా, షెల్ఫ్ ల లోనూ పడి ఉన్నాయ్ గా   వాటిని చక్కబెట్టి రెండో సైడ్ వాడదాం లే అని అన్నింటినీ ఒక పేపర్ కవర్ లో పెడుతున్నాను. ఒక షెల్ఫ్ లో రెడ్ కలర్ పెన్ కూడా కనిపించింది . రాస్తుందా లేదా అని ఒక లైన్ గీసా . రాస్తుంది .అంటే ఇట్స్ వర్కింగ్ నే కదా అని ఇంకో గీత గీసాను . రెడ్ పెన్ ఎంత ఎర్రగా రాస్తుంది .ఇంత మంచి పెన్ను ని ఎవడు ఈ షెల్ఫ్ లో పడేసాడబ్బా ? అనుకుంటూ ఆ పేపర్ పై నా పేరు రాసా . వేణు అన్న పేరు, ఆఫీస్ లో అందరి పేర్లు , నాకు తెలిసినోల్లందరి పేర్లు రాస్తూ కూర్చున్నాను . వావ్ ఎంత బావున్నాయ్  వీళ్ళ పేర్లు. పేర్లయి పోయాయి .  ఇంక సున్నాలు చుట్టటం మొదలెట్టాను . అలా ఒక కార్టూన్ బొమ్మ వచ్చింది . (పిచ్చోడి చేతి లో రాయి ఉంటే ఎంత ప్రమాదమో , నా చేతిలో పెన్ను పేపర్ ఉంటే అంతే ప్రమాదమని అప్పుడే నాకు తెలిసొచ్చింది ). బొమ్మ గీయగలనని నాకు ధీమా వచ్చింది. ఏదో డాక్యుమెంట్ కోసం వెతుకుతున్న వేణు అన్న దగ్గరికెళ్ళి , అన్నోయ్ నేనో బొమ్మ వేశాను చూడు అని చూపిస్తే "బావుంది ( అలా అనక పోతే నేను ఫీల్ అవుతానని ) " అన్నాడు .

 మనకెలాగా బొమ్మలు ( బొమ్మ ) గీసిన అనుభవం అల్రెడి (ఇప్పుడే) వచ్చింది కాబట్టి ఓ మంచి బొమ్మ గీద్దాం అనుకున్నాను. అనుకున్నదే తడవుగా ఏం గీద్దామా అని ఆఫీస్ అంతా (గోడమీద కేలేన్డర్లూ, సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్లూ AటుZ అన్నీ )  చూస్తే , ఒక వైట్ లాంగ్ నోట్ బుక్ పై నుంచి నన్నే చూస్తున్న ఒక అమ్మాయ్ కనిపించింది .

ఒకసారి ప్రాక్టీసు చేసి తర్వాత గీద్దామని పెన్సిల్ కోసం వెతికా, షెల్ఫ్ లో ఎక్కడా లేదు.   షాప్ కెళ్ళి పెన్సిల్ కొనుక్కొద్దామా అనుకున్నా, నాలో ఉన్న సోమరి గాడు లేచి, నీ బోడి ప్రాక్టీసు కి కొత్త పెన్సిలొకటా అని నన్ను అక్కడి నుంచి వెళ్ళకుండా ఓ సెటైర్ వేసాడు. ఏదీ లేనప్పుడు యాపిల్ జ్యూసే అమృతం తో సమానం . అందుకే నా చేతిలో ఉన్న రెడ్ పెన్నే నా ఆయుధం లా కనిపించింది . ప్రాక్టీసు బొమ్మ పర్లేదనిపించింది .
 
(రోజూ డైరీ ఓపెన్ చేసినప్పుడల్లా  ఈ బొమ్మ నన్నెప్పుడు పబ్లిష్ చేస్తావ్ అని అడుగుతుంది .నిజానికి ఓ బొమ్మ అందం గా గీసి పబ్లిష్ చేద్దాం అనుకున్నా . ముందే చెప్పగా నా అంత పనిబద్ధకం గాడు పెపంచం లో ఉండడని. ఒక పక్క నా బొమ్మ పోరు పడలేక , నా బద్దకాన్ని విడలేక ఇంక తప్పక పోస్ట్ చేస్తున్నాను .)

రెండో బొమ్మ ఇంతకంటే అందం గా ఉన్నా, నాకది రెండోదే .
ఈ రఫ్ బొమ్మ (మనిషి  బొమ్మ ) నా మొదటి బొమ్మగా నాకు  తెలియకుండానే నా మనసులో స్థానం సంపాదించేస్కుంది.

మొదటి చూపు ,మొదటి ప్రేమ ,మొదటి ముద్దు ,మొదటి సంతకం ,మొదటి ఉద్యోగం,మొదటి జీతం  .... ఇలా మనకు సంభందించిన ప్రతీ మొదటి పనికి మన మనసులో మొదటి స్థానం ఉంటుంది .

నేను మొదటసారి గీసిన నా మొదటి బొమ్మ కేవలం నా డైరీ పేజీల మధ్యలో గతం మిగిల్చిన తీయటి జ్ఞాపకం గా మాత్రమే మిగిలి పోవటం నాకిష్టం లేదు .

రాధిక గారి బ్లాగు చూసాకా ఏదైనా రాయాలి అనిపించింది .

నిన్న మొన్న లలో గీతిక గారి బ్లాగ్ చూసాకా , నా బొమ్మని కూడా నా బ్లాగ్ ప్రపంచానికి పరిచయం చెయ్యాలనిపించింది .

టైటిల్ కి వీడురాసిన రాతలకి గీసిన గీతలకి ఎక్కడైనా సంబంధం ఉందా ?
వెధవ బిల్దప్పూ వీడూను అనుకోవద్దు . అక్కడికే వస్తున్నా ..
ఈ బొమ్మ పట్టుకెళ్ళి మా వేణు అన్నకి చూపిస్తే "నీలో మరో బాపు కనిపిస్తున్నాడు బాబు " అన్నాడు .
నిజమేనంటారా ? :-)

Tuesday, December 14, 2010

"ఆరెంజ్" కేవలం కలర్ కాదు, కలర్ ఫుల్ ఎంటర్టైనర్ .. " ?

నిజానికి నేను ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఉంటే మొదటి రోజే రివ్యూ రాసేవాడిని . మొన్నటి వరకూ ఎప్పుడు రివ్యూ రాద్దామా అనేకన్నా ఎప్పుడు సినిమా చూస్తానా అనేదే నాకు పెద్ద కోరికగా ఉండేది. ఇప్పుడు సినిమా చూడాలనే కోరిక తీరింది.


వచ్చినా రాకున్నా , రివ్యూ రాయాలనే ఉబలాటం కొద్దీ నేను రాస్తున్న మొదటి రివ్యూ ..

ప్రేమ ..

ఈ పదం పుట్టి ఎన్ని సవత్సరాలైందో తెలీదు కానీ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఈ పదానికి అర్ధం చెప్పటానికి , ఆ భావానికి రూపం దిద్దటానికి ప్రయత్నిచని మనిషే ఉండడు. ప్రేమ ఎప్పటికీ కొత్త భావం, కొత్త అనుభవం. ఈ భావానికి నిర్వచనం చెప్పమని , అనుభవానికి అక్షర రూపం దాల్చమని ఒక కోటి మందిని అడిగితే కోటి కొత్త నిర్వచనాలు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.


" ప్రేమించిన అమ్మాయి ని ప్రేమిస్తున్నట్లు నటించటం మహా పాపం. ఇప్పటికైనా నీకు తెలిసింది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో . అందుకే కష్టమైనా నేను నిజాలే చెప్తాను ..

ఈ క్షణమే నాకు ఒకటి అర్ధమవుతుంది ,నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పటమే అబద్దం అనిపిస్తుంది. నేను ప్రేమిస్తున్నాను అనే కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించమంటున్నాను అనిపిస్తుంది . ఒక అమ్మాయ్ ని ప్రేమించలేక పోవటానికి కారణమే నేను . కారణాలతో మిగిలిపోకూడదు నేను . "

ఇలాంటి డైలాగ్స్ తో ఆరెంజ్ చూడచక్కగా రూపుదిద్దుకుంది. అయితే ఇది ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పడం లో సందేహమే లేదు .

చెర్రీ సినిమాలంటే నాకిష్టం ..

నేను "చిరుత" చూడటానికి కారణం "చిరంజీవి". "మగధీర" చూడ్డానికి కారణం "రాజమౌళి ". ఈ రెండు సినిమాలు నేను చెర్రీ నుంచి ఏమీ ఎస్పెక్ట్ చెయ్యకుండా వెళ్ళాను. కాబట్టి సినిమాలు బాగా నచ్చాయి. నేను ఏ కారణాల వల్ల ఈ సినిమాలకి వెళ్ళానో ,వాటికంటే చెర్రీ నే నాకు ఈ రెండు సినిమాల్లో బాగా నచ్చాడు.

అయితే చెర్రీ నుంచి నేను ఏదో ఆశించి , చెర్రీ కోసమే చూసిన సినిమా "ఆరెంజ్".

చెర్రీ కోసమే చూసాను కాబట్టి ఈ సినిమా నాకు నచ్చింది.

చెర్రీ "వన్ మేన్ షో " లా ఆరంజ్ నాకు అనిపించింది. చెర్రీ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అంతా బావుంది. కొన్ని సీన్లలో చిరంజీవి ని మళ్ళీ స్క్రీన్ పై చూసిన ఫీలింగ్ కలిగింది.


కధ క్లారిటీ కొంచెం దెబ్బతింది. జెనీలియా , ఫస్ట్ ఆఫ్ లో ఎంత తలనొప్పి తెప్పించిందో , సెకండ్ ఆఫ్ లో అంత ఆకట్టుకుంది .లాస్ట్ సాంగ్ లో అనుకుంటా కొన్ని డాన్స్ స్టెప్స్ , చరణ్ కన్నా చాలా ఫాస్ట్ గా చేసింది.


ఇక కధ విషయానికొస్తే..

రామ్ ఒక రేంజ్ ఐడియాలజీ కల ఓ చలాకీ కుర్రాడు . సిడ్నీ లో అక్కా బావల దగ్గర ఉంటూ , తన ఇష్టాన్ని (పెయింటింగ్ ని ) హాబీ లా ( గ్రాఫిటీ ..గోడలమీద బొమ్మలెయ్యటం) మార్చేసుకుంటాడు.

ఇష్టాన్ని కూడా ప్రేమ గా చూపించాడు దర్శకుడు . చిన్న వయసులో స్కూల్ టీచర్ ని ఇష్టపడటాన్నికూడా ప్రేమే అన్నాడు. పదహారేళ్ళ వయస్సు లో క్లాస్ మేట్ , అలా,అలా మొత్తానికి 9 మందికి ప్రేమను పంచిన రామ్ ,నంబర్ టెన్ గా జాన్ (జెనీలియా ) కి కూడా ప్రేమను పంచెయ్యటానికి సిద్దపడతాడు.

ప్రేమ అంటే వయస్సులో ఉన్నయువతీ యువకులు తప్పక స్వీకరించాల్సిన భాద్యతగా జెనీలియా (జాన్ ) భావించిందనుకుంటా కాబోలు , తనకు నచ్చిన మూడు క్వాలిటీస్ ఉన్న ముగ్గుర్నుంచి ఒకరిని తన ప్రేమికుడి గా నిర్ణయించటానికి చీటీ లు వేస్తుంది .ఆ చీటీ తీసి ప్రేమికుడి గా చరణ్ స్థిరపడి పోతాడు .

నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్ అని అడిగిన జెనీలియా (జాన్ ) కి , రామ్ (చరణ్ ) " ప్రేమించమని అడుగు , ఎంతైనా ప్రేమిస్తా , ప్రపంచం లో ఎవరూ ప్రేమించనంత ప్రేమ గా ప్రేమిస్తా , అయితే ఇంత కాలం ప్రేమించు అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఒకేలా ఉండదు జాన్ , అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మొద్దు .ఎందుకంటే ప్రేమ అనేది టు హార్ట్స్ కాదు , టు బ్రైన్స్ .నీ బ్రెయిన్ ఒకలా ఆలోచిస్తే , నా బ్రెయిన్ వేరేలా ఆలోచిస్తుంది.నాకు క్రికెట్ అంటే ఇష్టం , నీకు గోల్ఫ్ అంటే ఇష్టం . నాకు గ్రాఫిటీ అంటే ఇష్టం , నీకు ఇష్టం లేదు . ఇవాళ నాకు నీలో నచ్చింది రేపు నచ్చక పోవచ్చు . అప్పుడు అబద్దాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్, లైఫ్ లాంగ్ లవ్ ఒకేలా ఉండదు . అలా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావటానికి నేను రెడీ , లేనప్పుడు విడిపోవటానికి నువ్వు రెడీ గా ఉండాలి" అని చెప్పే సీన్ సినిమా లో ఒక హైలెట్.

క్లైమాక్స్ లో చెర్రీ , జెనీలియా ల మద్య సీన్స్ భలే సరదాగా కామెడీ గా అనిపించాయ్.
చరణ్ ,జెనీలియా , బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు చాలా సైలెంట్ గా , చూడ ముచ్చటగా ఉన్నాయి.

పప్పీ " ఐ లవ్ ,లవ్ స్టోరీస్", " లేత లేత లవ్ స్టొరీ ", అంటూ పెట్టిన ఎక్ష్ప్రెషన్ చాలా ఫన్నీ గా ఉన్నాయి.


"బావ మంచే కోరుకుంటాడు బావ మరిది .." అంటూ చెర్రీ లాంటి బావమరిది ని క్రియేట్ చేసిన భాస్కర్ ఈ క్షణం చాలా బాగా నచ్చాడు. అందరి బావ మరుదులూ అలా ఉంటే చాలా బావుండు అనిపించింది నాకు .

"సమష్యకు పరిష్కారం విడిపోవటమే అయితే విడి పోవటానికి క్షణం చాలు . కోర్టు లు , లాయర్లు , విడదీయటానికి నాలాంటోల్లు వందమంది ఉంటారు.అదే సమష్యకి పరిష్కారం ప్రేమించటమే అయితే ఎలా ప్రేమించాలో చెప్పేందుకే ఎవరూ లేరు బావా.. " అంటూ అక్కా బావల్ని కలపడానికి తపన పడ్డ రామ్ కేరక్టర్ ఇక్కడ నాకు బాగా నచ్చింది.

"ప్రేమికులకి మనసులు ఒకటే కావచ్చు కాని తనువులు రెండు. ఇలా రెండు తనువులకు మెదడులు , ఆలోచనలు , పెర్సనల్ స్పేస్ అనీ రెండే . ఎంత ప్రేమికులైనా, ఆఖరికి భార్యా భార్తలైనా ఒకరి ఇష్టాల్ని ఒకరు గౌరవించాలి . ఒకరి తప్పుల్ని మరొకరు మన్నించగలగాలి . వాళ్ళకంటూ ఉన్న స్పేస్ లో కూడా మన ఇష్టాల్ని రుద్దేసే ప్రయత్నం చెయ్యకూడదు. ఒకవేళ మన ఇష్తమైన వాళ్ళకోసం మన ఇష్టాల్ని త్యాగం చెయ్యటం చేసినా అదీ తీపిగుర్తు గా మిగిలిపోతుంది, ప్రేమను మరింత ప్రేమగా మార్చేస్తుంది ," అని కొత్తగా దర్శకుడు చూపించాడు .

ఏది ఏమైనా ఒక కొత్త కధని, చిత్రీకరణ లో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిచటానికి సినిమాయూనిట్ చేసిన కృషి ఫలించలేదు.

"ప్రేమ సరిపోక పోతే మరికొంచెం ప్రేమించాలి, అదీ సరిపోక పోతే మరికొంత ప్రేమించాలి , అలా అలా సముద్రమంత ప్రేమ ను పంచాలి . సముద్రమంత ప్రేమని పొందాలనే అంతా కోరుకుంటారు . అది ఒకే సారి సాధ్యం కాదు , కొంత కొంత గా జీవితం అంచుల వరకూ ప్రేమిస్తూ ఉంటే నే అది సాధ్యం . "

[ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైందో తెలీదు . బహుశా చాలా మంది సినిమా ని చూసేసే ఉంటారు. చాలా మంది రివ్యూలు రాసే ఉంటారు . కానీ రాద్దాం అని అనుకున్న తర్వాత రాయలేక పోయాననే ఫీలింగ్ నాలో ఉండకూడదు. అందుకే డేర్ చేసి ట్రూత్ రాసా. ఇది నా వరకు నాకు అనిపించింది , నా వ్యక్తిగత అభిప్రాయం ]