Sunday, March 27, 2011

పద్మశ్రీ , మరొక్కసారి నీ ఒడిలో ఒదగాలనుంది..

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా బ్యాచ్ లో నేను చాలా సైలెంట్ టైపు :), నిజంగానే .. అస్సలు క్లాసు లో ఉన్నా లేనట్టే ఉండేవాడిని.. ఎగ్జామ్స్ అప్పుడో , ప్రాక్టికల్స్ అప్పుడో నా వదనాన్ని వీక్షించే అవకాశం లెక్చరర్స్ కి చూపించేవాడిని . నా గురించి ఒకసారి మా ఇంగ్లీష్ మేడం అయితే ఔటర్స్ క్లాస్ లోకి వస్తున్నారని , మా ఫిజిక్స్ మేడం కి కంప్లైంట్ చేసారు.
అంటే నా మొహం అంత గుర్తుండేది మా గురువర్యులకి .



ఏరా ఆ పద్మశ్రీ వదిలేసిందా ఇక్కడికొచ్చి పడ్డావ్ అని , మా ఫిజిక్స్ మేడమే  నన్ను అడిగారు అంటే నాకు పద్మశ్రీ కి మద్య ఉన్న కెమికల్ బాండ్ ఏంటో, ఏపాటిదో మీరు అర్ధం చేసుకోవచ్చు.

,

మనసు బాగున్నా , బాగోకపోయినా ,

ఇష్టమున్నా , లేక పోయినా కాళ్ళు అరిగేలా ఆ పద్మశ్రీ చుట్టూ నే తిరిగేవాడిని.

కాలేజీ, బడులలో కంటే నేను పద్మశ్రీ ఒడిలో గడిపిందే ఎక్కువ, తను అంతలా లాలించేది నన్ను.



ఆ మాటకొస్తే రావులపాలెం లో నాకున్న ఒకే ఒక్క హోప్ "పద్మశ్రీ" ..



పిల్లలు - పెద్దలు ,కుర్రాళ్ళు, ముసలాళ్ళు, పెళ్లైనోల్లు- పెళ్లి కానోళ్ళు అందర్నీ కట్టి పడేసే అందం, సొగసు తనసొంతం.

పద్మశ్రీ అంటే మా కాలేజి బ్యూటీనో , క్యూటీనో కాదు.

రాజమండ్రి కి రంభ ఎలానో ( అప్పట్లో మాట, ఇప్పుడు గీతా అప్సర వచ్చిందనుకోండి) , రావులపాలానికి పద్మశ్రీ అలా అన్నమాట.



పద్మశ్రీ అంటే ప్రపంచాన్ని తనలోనే చూపించే సినిమాతెర,

ఎంతో మందిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, రెండున్నర గంటల సేపు వరకూ లాలించి, మంత్ర ముగ్ధుల్ని చేసే ఓ మాయ.

ఎప్పటికీ నిలిచిపోయే గొప్పదనం తనది , ఏవరేజ్ సినిమానయినా పద్మశ్రీ లో ఎంజాయ్ చెయ్యొచ్చు.

ఈ ధీమాతో నే జనాలు క్యూ కట్టేస్తారు,

"పద్మశ్రీ" ఎంత ఫేమస్ అంటే చుట్టుపక్కల ఊళ్ళ వారు, ఏదైనా పని మీద మా ఊరొస్తే, పద్మశ్రీ లో సినిమా చూడలేదంటే ఏదో వెలితి గా ఫీల్ అయ్యేవారట. టిక్కెట్టు దొరక్కపోయినా, కనీసం పద్మశ్రీ ప్రాంగణం లో సినిమా మొదలయ్యేవరకూ అటూ ఇటూ తచ్చాడి వెళ్తూ ఉంటారు చాలా మట్టుకి,



"శ్రీ వెంకటేశ్వర- పద్మశ్రీ" జంట హాల్లుగా మా తాతల కాలం నుంచి బాగా ఫేమస్.

అప్పట్లో డి.టి.యస్,& ఏ.సీ. కాదు కదా కనీసం కరెంట్ జెనరేటర్ కూడా లేని సినిమా హాళ్ళు..( ఇప్పడు మల్టీ ఫ్లెక్ష్ లు గా మార్చేస్తున్నారనుకోండి) .

యువతలో అయితే "పద్మశ్రీ కి సినిమాకెళ్తే లవర్స్ కధ కంచికి చేరుతుంది" అని గట్టి నమ్మకం.

జంటగా వచ్చిన వాళ్ళు ఏ మూల కూర్చున్నా సరే , ఎవరో ఒకరి కంట, ఎప్పుడో అప్పుడు ఖచ్చితం గా చిక్కేస్తారు.

కొందరు సాహసవీరులు బెట్టింగులుకాసి, బొక్కబోర్లా పడ్డ సందర్భాలు లెక్కకు మిక్కిలి .



పద్మశ్రీ నేను ముందే చెప్పినట్టు చాలా హెల్పింగ్ నేచర్ కలది . అందుకోసమే "పద్మశ్రీ " సహాయాన్నికోరి చాలా మందే వస్తారు

  • స్నేహితులు
( హితులు , స్నేహితులు .. అంటే బాగా ఎంజాయ్ చెయ్యటానికి వెళ్ళే టైపు , పక్కన ఫ్రెండుంటే ఉండే ధైర్యం తో కొంచెం రొమ్ము విరుచుకు తిరుగుతూ వీళ్ళు చేసే అడ్వెంచర్స్ కి కొదవే ఉండదు, క్లాస్ లెప్పుడూ బోర్ అనుకునే నాలాంటోల్లకి ఇక్కడ స్పెషల్ బెంచ్ లు ఉంటాయ్ )

  • ప్రేమికులు
( ప్రేమలో రకరకాల స్టేజిలలో ఉన్నవాళ్ళు అంటే వన్సైడ్ లవర్స్ , టూ సైడ్ లవర్స్, త్రీ సైడ్ లవర్స్ ... ఇలా అన్న మాట .,ఇంకా లవర్ అనే టాగ్ లైన్ , నేమ్ కింద పడకపోతే దానికోసం ఎదురు చూసే వాళ్ళు వీళ్ళలో ప్రముఖం గా చెప్పుకోదగిన వాళ్ళు )
  • ఇంట్లో పెద్దల దగ్గర వాళ్ళ ప్రేమను వ్యక్తపరచలేనోల్లు.
( ఇంట్లో ప్రేమను చెప్పటానికే భయపడేటోల్లు, ఎందుకు ప్రేమిస్తారో నాకైతే అర్ధం కాదు. ప్రేమించిన అమ్మాయి/అబ్బాయి తో బాగానే సినిమా చూసి, ఇంట్లో వాళ్ళ కంట్లోనో ,ఎవడో ఒకడు తెలిసినోడి కంట్లోనో పడి వీల్లకేమీ తెలియనట్లు వెళ్లి పోతారు,వీళ్ళ ప్లాన్ ప్రకారం ఇంట్లో వాళ్లకి లవ్ విషయం తెలుస్తుంది . బయటోడు ఎవడినా చూస్తే అంతకంటే ముందు ఊళ్ళో తెలుస్తుంది. ఫలానా వాళ్ళ అమ్మాయి/ అమ్మాయి , ఫలానా అతను/ఆమె తో తిరుగుతోందట అనే వార్త ఊరంతా పాకి పోవటానికి ఇద్దరూ కలిసి సినిమా చూసినంత సేపు కూడా పట్టదు, అమ్మా నాన్నలకి పెళ్లి ఇష్టం లేకుంటే పరువు బజారున పడటానికి, పెద్దాళ్ళు వీధిలో తలదించుకోవటానికి సినిమా ధియేటర్ లో కలిసి కూల్ డ్రింక్ తాగినంత సేపు కూడా పట్టదు .)

  • ఇంట్లో పెద్దలపై ఒత్తిడి తేవాలనుకునే వాళ్ళు ..
( వీళ్ళు ప్రేమిస్తారు , ప్రేమ విషయం , ఇంట్లో స్వతంత్రం గానో , మరే విధం గానో ఏదో లా ఇంట్లో చెప్పుతారు.
పెద్ద వాళ్ళ నిర్ణయం చెప్పటం లేటయితే గుర్తుచెయ్యటానికి రిమైండరు సినిమాలు చూసేవాళ్ళు , చెప్పాకా ఒప్పుకోకుంటే ఎలాగైనా వాళ్ళపై ఒత్తిడి తెచ్చి, ఇంట్లో వాళ్ళు ఎలా పోయినా పర్లేదు , నా ప్రేమ మాత్రం గెలవాలి అనుకునేటోల్లు వీళ్ళలో ప్రముఖులు . ఇక్కడ ఎవరిది తప్పు , ఎవరిది ఒప్పు అని నేను వివరించే సాహసం చెయ్యను . పరిస్తితులబట్టి చూస్తే , కొన్ని సందర్భాల్లో ఎవరి కోణం లో వాళ్ళే కరెక్టు అనిపిస్తుంటారు )

  • పెళ్ళైన జంటలు , వాళ్ళ బంధువులు , సాధారణ ప్రేక్షకులు ... .
( ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పోస్టేంటి, ఎప్పటికప్పుడూ అప్డేట్ చేస్తూ ఒక బ్లాగే రాయొచ్చు )



కానీ స్పెషల్ కేసు లో ఉండే కొందరు వ్యక్తులుంటారు. వాళ్ళే

  • భార్యా భాదితులు
( ఇంట్లో ప్రశాంతత కొదవయ్యి , నిద్ర కరువయ్యి , పెళ్ళాం పోరు పడలేక కనీసం రెండు, రెండున్నర గంటలన్నా ప్రశాంతం గా పడుకుందామని వచ్చేవాళ్ళు. పాపం అని వీళ్ళని చూసి జాలి పడేటోల్లు, భవిష్యత్తుని తలుచుకుని భయపడేటోల్లు, గతాన్ని తలుచుకుని నవ్వుకునేటోల్లు .. ఇలా చాలామది సానుభూతిపరుల మద్య వీళ్ళు పెసాంతం గా పడుకుంటారు. ).


ఇలా అందరికీ తనకు తోచిన సహాయం చేసే మా పద్మశ్రీ అంటే నాకు ఇష్టం. చాలా చాలా ఇష్టం ..



పద్మశ్రీ ,


నీలో నా పసితనముంది ,

నీలో నా స్వేచ్ఛ ఉంది ,

నీలో బొమ్మలెంత పెద్దగా ఉన్నాయోననుకున్న నా ఆశ్చర్యం ఉంది .,



నీలో నా బాల్యం ఉంది ,

నీలో నా సంతోషం ఉంది ,

నీలో నువ్వు చూపిస్తున్న సీన్ లకి ఏడ్చేసిన నా అమాయకత్వం ఉంది.,



నీలో నా కుర్రతనముంది,

నీలో నా ఆకర్షణ ఉంది ,

నీలో నువ్వు చూపిస్తున్న సీన్లకి ఈలలేసే నా అల్లరితనం ఉంది



నీలో నా యవ్వనముంది,

నీలో నా ఉడుకుతనముంది

నీలో నువ్వు చూపిస్తున్న జీవితాలను అన్వయించే నా సున్నితత్వం ఉంది

,

నీలో నా ఆనందముంది ,

నీలో నా ఆవేశముంది,

నీలో నా ఆక్రందన ఉంది , నీలో నా ప్రాణం ఉంది ,



నీలో గడిపిన క్షణాలు మళ్ళీ రావాలనుంది ,

గతమే తీపిగా మిగిలి పోకూడదని ఉంది ,

పద్మశ్రీ , మరొక్కసారి నీ ఒడిలో ఒదగాలనుంది..

Wednesday, March 23, 2011

నేనంటే ఇష్టం లేకుంటే ఇంత రాత్రి వేళ "ఒంటరిగా" నాకోసం ఎందుకు వస్తుంది ?.

అప్పటికే టైం తొమ్మిది దాటిపోయింది ..


నైమిషకి అన్నం తినిపించటానికి విఫలయత్నం చేసి, వదిన అన్నకి కాల్ చేసింది.
వాళ్ళ అమ్మ ఏంచేసినాసరే , వేణన్నలేనిది నిమ్మి నోట్లో ఒక్కముద్ద కూడా పెట్టించుకోదు.

ఇంటినుంచి కాల్ రాగానే నాతో సరే బాబు నేను వెళ్ళొస్తా , వీలుంటే భోజనం చేసాకా మిగిలిన ఇన్వాయిస్ లు ప్రింట్ తీసెయ్ అని ,గుడ్ నైట్ చెప్పి తను వెళ్లి పోయాడు ,

నేను గెస్ట్ హౌస్ కెళ్ళి భోజనం చేసి, కాసేపు టి.వి.చూసి, మా పి.యల్. తో మాటామంతీ పూర్తి చేసి తిరిగి "ఆఫీసుబాట" పట్టాను .


అర్దరాత్రి పన్నెండు కావస్తోంది. గెస్ట్ హౌస్ నుంచి మెల్లగా ఆఫీసు వైపు అడుగులు వేస్తున్నాను .


సీమ చింతకాయ చెట్టు చిన్న చిన్న ఆకుల మధ్యనుంచి ఎంతో నిండుగా , కొంచెం పెద్దగా , మొత్తానికి ముద్దుగా జాబిలి కనిపిస్తోంది . ఒక్కో అడుగు తనను చూస్తూ ముందుకు వేస్తున్న కొద్దీ , తను చెట్టు కొమ్మల ఆకుల మద్యన దాక్కుని నాతో దోబూచులాటాడుతోంది . జాబిలి వెన్నెల తెల్లదనానికి తోడు మా ఆఫీసు బయట గిన్నెపూల చెట్టు తన గుభాలింపుతో చాలా ఘాటుగా స్వాగతం పలికింది.

మెల్లగా ఆఫీసు గేటు తీసుకుని ఆఫీసులోకి వెళ్లాను .

పట్టపగలు కొత్తాపాతా, వాళ్ళూ వీళ్ళూ అని తేడా లేకుండా ఎవరు కనిపించినా అదేపనిగా మొరిగేసే మా వాచ్మెన్ వాళ్ళ కుక్క అసలు ఇప్పుడేమీ అలికిడే చెయ్యలేదు . గేటు తీసిన శబ్దానికి మా వాచ్మెన్ అయినా వస్తాడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ప్రింట్లు తీసేస్కుని వెళ్లి పోదాం అనుకున్నాను .
అతని జాడ కూడా లేదు .

మా ఊళ్ళో అర్ధరాతుల్లు ఎవరైనా అలికిడి చేస్తే, వీధి కుక్కలన్నీ ఒకేసారి మొరిగి రాత్రి పూట నిద్రను చెడగొట్టేసేవి. అప్పుడు వాటిపై పట్టలేనంత కోపం వచ్చేసేది . కానీ ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా పడుకున్నప్పుడు మాత్రం అలా శబ్దం వినిపిస్తే ఇంకా మనుష్యులు తిరుగుతున్నారు అనే ధీమా ఉండేది .


ఇది ఏం ఊరో ఏమిటో కానీ, కనీసం వీధికి ఒక్క వీధికుక్క అయినా లేదు . ఈ ఒక్కటి చాలదూ ఈ ఊళ్ళో కనీస సౌకర్యాలు లేవని చెప్పటానికి .

ఆఫీసులోకి ఎంటరయ్యాను.నా లాప్ టాప్ లో ఏ.ఆర్ . రెహమాన్ సాంగ్స్ సన్నని సౌండు తో పెట్టుకుని, వరసపెట్టి " వర్క్ కంప్లీషన్ రిపోర్టు" లు , "ఇన్వాయిస్" లు ప్రింటులు కొడుతున్నాను . సమయం మాత్రం నిశ్శబ్దం గా గడిచిపోతోనే ఉంది .


" ఏ అజనభీ తూ భీ కభీ ఆవాజ్ దే కహీసే" ఈ సాంగు ప్లే లిస్టు లో ప్లే అవుతోంది . ఈ సాంగ్ ని ఎన్ని సార్లు వినుంటానో నాకే తెలీదు .వినీ వినీ ప్రతీ లైనూ కంఠతా వచ్చేసాయి . అంత ఇష్టం నాకు ఆ పాటంటే.
[అదేమిటి నీకు తెలుగే సరిగా రాదు , అలాంటిది హిందీ సాంగు ని అన్నిసార్లు ఎలా విన్నావ్ అంటారా ? నాకు హిందీ రాదు కాబట్టే అన్ని సార్లు విన్నాను . కాదు కాదు , హిందీ రాదు కాబట్టి ఇన్ని సార్లే విన్నాను . మీనింగు తెలుసుంటే ఇంకా చాలా సార్లే వినే వాడినేమో ?.]


మొత్తానికి దీక్షలో నిమఘ్నమైన మహర్షిలా నేను లాప్ టాప్ లో లీనమై పోయి ఇన్వాయిస్ లు ప్రింట్ తీస్తున్నాను.


అప్పటి వరకూ చుట్టుపక్కల పచ్చికనుంచి గుంపుగా వచ్చిన మిడతల శబ్దం కూడా మెలమెల్లగా తగ్గిపోయింది .


కొద్ది  సేపటి తర్వాత కాఫీ మెషిన్ మీట నొక్కి ఒక కప్పు కాఫీ చేతిలోకి తీసుకుని ఆఫీసు గుమ్మంలోనుంచి అందాల జాబిలిని చూస్తూ ఒక్కో సిప్పూ సిప్పుతున్నాను .

ఏం జాబిలి మాత్రమే ప్రకాశావంతమా ? మేము కాదా అన్నట్టు అప్పటివరకూ చీకటిగా ఉన్న మా ఆఫీసు గార్డెన్ లోంచి కొన్ని వందల మినుగుర్లు రెపరెపలాడుతూ శ్రావ్యమైన శబ్దం తో పైకి లేస్తున్నాయి. ఎంత అందం , ఎంత అందం , ఎంత సేపు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది .. రెప్ప మరల్చబుద్ది కావట్లేదు .

కాసేపటికి తమ విన్యాసాలన్నింటినీ చూపించేసాం అనుకున్నాయేమో మినుగుర్లు ఒక్కొక్కటీ గుడ్ నైట్ లు, టాటా లు  చెప్పుకుంటూ , నా వైపుగా వచ్చి నన్ను వెక్కిరిస్తూ, సెండాఫ్ చెప్పి వెళ్ళిపోయాయి .

మబ్బుల మాటున దోబోచులాడుతున్న జాబిలి. మా సౌధానికి పక్కగా దాక్కుంది. తనను చూడలేకున్నానన్న భావమేదో గిన్నెపూల మొహం లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది, అది కన్న మా గార్డెన్ దైన్యంగా తన వదనం పై చీకటి పొరను కప్పుకుంది.



ఈసమయం లో తను నాపక్కనుంటే ఎంత బావుండేదో కదా అనిపిస్తోంది.

నీ పక్కన ప్రస్తుతానికి లేని తన కోసం ఆలోచిస్తూ , ఇంత అందమైన క్షణాల్ని ఆస్వాదించలేకపోతున్నావేమో కదా , అని నా మనస్సు నన్ను ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటే,నేను పొందిన ఆనందపు అనుభూతిని తనకూ పంచాలి అనుకుంటున్నాను , తనతో పంచుకోవాలి అనుకుంటున్నాను , దాంట్లో ఆస్వాదించలేకపోవటమేముంది అని నాకు నేనే సర్ది చెప్పుకున్నట్లుంది.


చేతిలో కప్పు ఖాళీ అయిపోయింది . డస్ట్ బిన్ లో కప్పు పడేసి ,వాష్ బేసిన్ వద్దకెళ్ళి మొహాన్ని చల్లటి నీళ్ళతో కడుక్కుని , మళ్ళీ వచ్చి నా పని దగ్గర కూర్చున్నాను .


చుట్టుపక్కల అందరి ఇళ్ళలో దీపాలు ఆర్పేసుకుని , అందరూ మత్తుగా నిద్రపోతున్నారు.

మా ఆఫీసు , గెస్ట్ హవుస్ ల మద్య ఉన్న రోడ్డు పై ఏమాత్రం అలికిడి లేదు.


తను వచ్చింది. వచ్చి నన్ను గమనిస్తోంది.ఎప్పట్నుంచి తను నన్ను గమనిస్తుందో నేను గమనించలేదు. కానీ మిణుగురులు మెరిసి పడుతున్నప్పుడు , నేను వాటిని చూస్తూ ఉంటే అప్పటి వరకూ గోముగా ఉన్న గిన్నెపూల చెట్టు ,తన ఘాటైన గుభాలింపుల సౌరభాల్ని ఒక్కసారిగా కావాలని వెదజల్లింది. అంటే తను ఆపాటికే ఆ చెట్టు చాటున దాక్కొని ఉండి నన్ను చూస్తోందన్నమాట .

ఇదే తనకి అదును గా అనిపించినట్లుంది.
ఒక్కో అడుగూ నా వెనకాలగా వేస్తూ ఆఫీసు లోకి వచ్చేసింది.


తను వచ్చిందన్న విషయం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండానే నాకు తెలుస్తోంది.


ప్రింటర్ దగ్గరకి కొన్ని ప్రింట్స్ తెచ్చుకోవటానికి నేను అటువెళ్ళగానే , చడీచప్పుడు లేకుండా నా పక్కనే ఉన్న బీరువా దగ్గరకి వచ్చేసింది . నేను చూడలేదేమో అనుకుని , తమాషా చేద్దామని చూస్తుంది. సర్లే తన సంతోషాన్ని మనం కాదనటం ఎందుకులే అనుకుని , నేనూ చూడలేనట్టే ఉన్నాను.

తను వస్తూ, వస్తూ ఆచెట్టు దగ్గరనుంచి తెంపుకొచ్చిన పూలని ఒక్కొటిగా నా మీదికి విసురుతూ , నేను వచ్చాను అని సింబాలిక్ గా చెప్తోంది . తన ముఖారవిందాన్ని చూసి చిరునవ్వు నవ్వటం కాదు కదా, కనీసం తన వైపు తలెత్తి చూడటం కూడా చెయ్యలేదు . తనకి కోపం బాగా వచ్చినట్లుంది . వెంటనే ఓ చిన్న రాయి తీసుకుని నామీదికి విసిరింది . నేను మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా అలానే కూర్చుని ఉన్నాను.

అరరే డైరెక్టు గా తనగురించి , మా గురించి , మా ఇద్దరి చిలిపి సందర్భాల గురించి చెప్పేస్తున్నాగానీ అసలు తను ఎవరో, ఎక్కడుంటుందో చెప్పలేదు కదా మీకు .

తను మేముండే ఇంటి పైన ఉంటుంది . మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే, తను ఆ పైన ఉన్న నాలుగు అంతస్తుల్లో ఎక్కడో ఉంటుంది. చాలా సార్లు తనని మెట్లమీద నేమెట్లెక్కుతూ చూసాను . మొదటి సారి చూసినప్పుడు అంత నోటీసు చెయ్యలేదు . కానీ తర్వాత , తర్వాత చాలా బావుంటుంది అని అనిపించింది. చాలా బాగా నవ్వుతుంది . అంతకంటే బాగా గెంతుతుంది . అదేమిటి నడుస్తుంది అనాలి గాని గెంతుతుంది అంటున్నావ్ ? నీకేమైనా లూజా అని అడక్కండి , తను కొంచెం అల్లరిది అని సింబాలిక్ గా చెప్పా అంతే . మా అపార్ట్మెంటు లోనో , బయట వేరే ఎక్కడో నేను తన గురించి విన్నదేంటంటే , తను హౌస్ డెకరేషన్ (ఇంటీరియల్) సూపర్ గా చేస్తుందట. నలుగురికీ సహాయం చేసే మెంటాలిటీ అట .



ఈ మద్య , మేము ఒకరిని ఒకరు చూసుకోవటమే బాగా తగ్గిపోయింది , ఆఫీసులో బాగా పని ఉండటంవల్ల , తను బయటకెళ్ళే టైం కి , ఇంటికొచ్చే టైంకి నేను తనను చూడటం మిస్ అవుతున్నాను .

నిన్న మద్యాహ్నం మళ్ళీ మెట్ల దగ్గరే తను కనిపించింది .
తనని చూడగానే నేను సన్నగా నవ్వాను..

అదే సిగ్నల్ అనుకునుంటుంది.
ఎప్పుడు నేను బయటకొస్తానా, ఏకాంతం లో కలుస్తానా అని ఎదరు చూసుంటుంది.
అర్ధరాత్రి వేళ తనకోసమే నేను ఆఫీసుకి ఒంటరిగా వెళ్లాను అనుకునుంటుంది.
అందుకోసమే ఇలా ఇప్పుడు వచ్చుంటుంది..


అసలు తనకు నేనంటే ఇష్టం లేకుంటే ఇంత రాత్రి వేళ నాకోసం ఎందుకు వస్తుంది ?.
ఆలోచిస్తూ ఉంటే తనకూ నేనంటే చాలా ఇష్టమేనేమో అనిపిస్తుంది.


"ఎవరూ చూడకుండా , ఎంతో కష్టపడి ,నీకోసం, అర్ధరాతిరేల ఒంటరిగా వస్తే బెట్టు చేస్తున్నావా ?
లెవెల్ పోతున్నావా ?,నా అంతట నేనేవచ్చానని అలుసా ?"అంటూ నాపై అరవటం మొదలెట్టింది.

కోపం లో తననెప్పుడూ నేను చూడలేదు. ఏమాటకామాట చెప్పు కోవాలి కానీ , కోపం లో కూడా తను చాలా అందం గా ఉంది .తన వైపు చూసి కొంటెగా ఒక నవ్వు నవ్వుదుల్లోకి తను సిగ్గుల మొగ్గయ్యింది. మెల్లగా నా మీద వాలిపోవటానికి చూస్తోంది.


" ఇద్దరి మధ్యా నిశ్శబ్ధాని చెరిపేస్తూ, దూరాన్ని తగ్గిస్తూ తను నా పైపుగా వస్తున్న క్షణాన ....
.
.

నా సెల్ మోగింది ..




" ఇంకా ఎంత టైం పడుతుందమ్మా ? , అర్జున్ సార్ కాల్ చేసారు,
 అయిపోయింది .. లాస్ట్ ఇన్వాయిస్ ప్రింట్ తీస్తున్నాను , వచ్చేస్తున్నా సార్ అన్నాను .



నను తను  చేరుకుందామనుకున్న ఆ క్షణాన నేను ఫోన్ అటెండ్ చేసినందుకనుకుంటా తన కళ్ళు నిప్పులు వర్షిస్తున్నాయి.గొంతు ఆర్ద్రం గా మారి పోయింది .. తనని ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదు. కొత్తగా ఉంది .. కాదు , కొత్తగా ప్రవర్తిస్తోంది.



"మీ వల్ల నాకున్నదాన్నంతా కోల్పోయాను. ఎంతో మంది దగ్గరవాళ్ళని ఎప్పటికీ చేరుకోలేనంత దూరం చేసుకున్నాను.

మీ చేతిలో ఉన్న యమదండాలనుంచి వెలువడే రేడియేషన్ పాశాలతో మా వాళ్ళనందరినీ మీరు పొట్టన పెట్టుకున్నారు.అయినా నీ చూపులో లాలత్యం చూసి నువ్వు అందర్లాంటివాడివి కాదనుకున్నాను, కనీసం నేను నీ ప్రక్కనున్నప్పుడైనా ఆ యమపాశం నుంచి దూరం గా ఉంటావు అనుకున్నాను , కానీ నువ్వు నా ఆశని అడియాశ చేసి , నా నమ్మకాన్ని ఒమ్ముచేసావ్ " అంటూ కోపంగా నను దాటి వెళ్లి పోయింది.

ఎంత పిలిచినా పలకనే లేదు , కనీసం తిరిగి చూడలేదు కూడా ..


నన్ను ప్రేమించిన తనకోసం నేనేమీ చెయ్యలేకపోయాను ,
కనీసం ఒకే ఒక్క కాల్ ని అటెండ్ చెయ్యకుండా ఉండటం కూడా .. !


అందుకే తను నన్ను విడిచి వెళ్ళిపోయింది.
నా తప్పేమిటో నాకు చెప్పి మరీ వెళ్ళిపోయింది.

మరి నేనూ తనని ఇష్ట పడ్డాగా,
నేను ఇష్ట పడ్డ తనకోసం నేనేమి చెయ్యాలి ?


తన ఆశని బతికించటం తప్ప నేనేమీ చెయ్యలేను ..
అవసరం లేని టైం లో ఫోన్ ని వాడకూడదనే తన కోరికని నేను తీరుస్తాను..


నా దగ్గరగా పిచ్చుకలే కాదు , ఏ పక్షులున్నా ,
మ్యాక్జిమం కాల్ ని అటెండ్ చెయ్యను .. వీలుంటే అవి నా దగ్గరున్నంతసేపూ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తాను ..


అప్పటికైనా తనకి నా మీద కోపం తగ్గుతుందేమో వేచి చూస్తాను.
తన మనసును తెలుసుకోవటానికి , తను తిరిగి రావటానికి ,తనకో ఉత్తరం రాస్తాను ..

"
డియర్ స్పారో,



నా తప్పుని నేను తెలుసుకున్నాను , సరిదిద్దుకోవటానికి కనీసమైనా ప్రయత్నిస్తున్నాను..
నీకు కనీసం ఇదైనా తెలిసి , నాపై నీకు కోపం పోవాలని , నిన్ను మళ్ళీ చూడాలని , నువ్వు మళ్ళీ రావాలని ,
నీకోసం వేయికళ్లతో ( సారీ , రెండుకళ్ళతో ) వేచి చూస్తూ ,



నీ కోసమే నా అన్వేషణ సాగిస్తూ,

నీకై ,

నీ భగ్న ప్రేమికుడు ( నవ్వు కోవద్దు).

-----------------------------------------------------------------------------------------------------



THANK YOU..

Tuesday, March 8, 2011

అనగనగా ఓ బస్తీ [ బాంద్రా ( ఈస్ట్ ) , గరీభ్ వాడ, ముంబై

Dt: 07-March-2011,
Day : Monday  Time: 8.30 PM

 
నిన్న రాత్రి  పదిన్నరకి కొల్హాపూర్ లో స్టార్ట్ అయిన బస్సు ఉదయం అయిదు గంటలకల్లా ముంబయి సిటీ దరిదాపుల్లోకి చేరుకుంది .
నేను దిగాల్సిన స్టాప్ ( దాదర్ ) వద్దుల్లోకి టైం ఆరు అయ్యింది. ఎప్పట్లాగే లాడ్జ్ లో ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకున్నాను .
క్లైంట్ కి అందించాల్సిన పేపర్స్ ఫైలింగ్ చేసి పదిన్నర ఆప్రాంతం లో లాడ్జ్  నుంచి బయలుదేరాను. టాక్సీ ఒకదాన్ని పట్టుకుని బాంద్రా ఈస్ట్ లో ఉన్న క్లయింట్  ( M.S.E.D.C.L) ఆఫీసుకి వెల్దుల్లోకి, ట్రాఫిక్ బాగా రద్దీగా ఉండటం వల్ల పదకొండున్నర అయ్యింది.
లోపలి వెళ్లి పని ముగించుకుని వచ్చేసాను . గతం తో పోల్చుకుంటే చాలా త్వరగా , ప్రశాంతం గానే ఇన్వాయిస్ సబ్మిషన్ అయిపొయింది అని చెప్పుకోవాలి . అక్కడే కేంటీన్ లో భోజనం చేసి ఇక బయటకు వస్తుండగా నేను గమనించింది ఏంటి అంటే , సెక్యూరిటీ . సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. బయట వరండాలో లెక్కకు మిక్కిలి గా పోలీసులున్నారు.
ఎప్పుడూ లేనిది ఇంతమంది పోలీసులని ఎందుకు పెట్టారో నాకు అర్దంకాలేదు. బయటకు వచ్చిచూస్తే కోర్టు దగ్గర కూడా చాలామంది పోలీసులున్నారు. ఏదో బెదిరింపు కాల్ వచ్చి ఉంటుంది అనుకుని రైల్వే స్టేషన్ వైపు అడుగులు వేసాను.
దారిలో ONGC హెడ్ఆఫీసుకైతే అడుగుకో పోలీసు చొప్పున కాపలా కాస్తున్నాడు. మెల్లగా పోలీసు వ్యాన్ లను ఒక్కోదాని దాటుకుంటూ రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ ని సమీపించాను  .
బ్రిడ్జ్  మెట్లదగ్గర  భారీ  కేడ్లను   అమర్చి అడ్డంగా పోలీసులు నిలబడి దారిని నిరోదిస్తున్నారు. ఎప్పుడూ వాహనాలతో  రద్దీగా  ఉండే రోడ్డు  కేవలం పాద చారులకి మాత్రమె పరిమితమయ్యింది . అసలు ఏమయ్యిందో అర్ధం కాని అయోమయ పరిస్థితి లో ఉన్న నాకు , "FIRE RELIEF CAMP " అని ఒక బోర్డు కనిపించింది . బట్టలు , గోధుమలు , బిస్కట్లు పాలు , ఇలా చాలా రకాల పదార్ధాలతో అలాంటి కేంప్ లు చాలానే కనిపించాయి .
ఇంకో  నాలుగు అడుగులు వేద్దుల్లోకి విషయం అర్ధమయ్యింది . ఎప్పుడూ సందడిగా కలకలలాడుతూ  ఉండే  ఒక కాలనీ( బస్తీ )  అగ్నికి ఆహుతయ్యి బూడిద  గా మారిపోయింది  .



నివురయిపోయిన గుడిసేల్ని  చూస్తూ మరో  రెండు అడుగులు ముందుకేసాను . అగ్ని బాధితుల సహాయార్ధం అని తెచ్చిన బట్టల్ని రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పోగేసారు . 
ఒక్కో బట్టల గుట్ట దగ్గరా లైన్లో నిలబడి ఎవరికీ సరిపోయే సైజు  బట్టల్ని వాళ్ళు ఏరుకుని తీస్కెల్తున్నారు. ముంబయి మెట్రో వాటర్ టేంకర్లకు అమర్చిన తాత్కాలిక కుళాయిల దగ్గర దోసిళ్ళతో పిల్లలు దాహాన్ని తీర్చుకుంటున్నారు. రోడ్డుపై ఒక ముసలవ్వ గుండె పగిలేంతగా ఏడుస్తోంది  అంత దగ్గరగా హృదయ విషాదక సంఘటనలని చూడటం ఇదే తొలిసారి కాదు . కానీ ఈ క్షణం నా కాళ్ళు ముందుకు కదలట్లేదు. చాలా సేపు చుట్టూ చూస్తూ అక్కడే నిలబడిపోయాను .

ఎప్పుడు జరిగింది ? ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు , కానీ అక్కడున్న ఫైర్ మెన్ ని అడిగాను .
శుక్రవారం నైట్ జరిగింది .

తర్వాత ఎం అడగాలో తెలియలేదు .

ఎక్కడినుంచి వచ్చావ్ ? అతను అడిగాడు

కొల్హాపూర్ .

ఇక్కడికి ఎందుకొచ్చావ్ ?
రైల్వేస్టేషన్  లోపలి కి వెళ్ళటానికి


 "లైన్ క్రాసింగ్ బ్రిడ్జ్ కూడా మంటల్లో బాగా కాలి పోయింది .
ఇటువైపు నుంచి లోపలి వెళ్ళటానికి దారిలేదు.

అలా ట్రాక్ దాటుకుని వెళ్ళు అని కొదరు వెళ్తున్న దారిని  చూపించాడు అతను .

  
మసిబారిన బట్టలతో ఒక బాబు ( అయిదారేళ్ళు ఉంటాయి )  నా వెనుకనుంచి మంచి నీళ్ళ బాటిల్ తో  పరిగెత్తుకెళ్ళి  . ఒకామెకు అందించాడు.
రెండ్రోజులుగా ఏడుస్తూనే ఉందనుకుంటా , మొహం మొత్తం ఉబ్బి పోయి ఉంది . నీరసం గా ఏదో లోకం లో ఆలోచిస్తున్నట్లుంది.
ఏడ్చీ ఏడ్చీ ఒంట్లో సత్తువంతా కన్నీలలా కరిగి ,కనులెంట జారిపోయినట్లుంది .
ఆమె మంచి నీటిని తాగగానే, ఈలోకం లోకి వచ్చినదానిమల్లె ,ఆ అబ్బాయిని గుండెలకు హత్తుకుని , రఫీక్ , రఫీక్ అంటూ ఏడవసాగింది. వేరొకామె వచ్చి ఆమెను ఓదార్చటానికి విఫలయత్నం చేస్తోంది.

ఎదురుగా సగం కాలిన ఇంట్లోంచి , కాలిపోయిన బట్టల్ని వస్తువుల్ని బయటకు తీస్తున్న ఓ వృద్దుడు.
ఏం మిగిలుంది ? అని దీనంగా చూసే కుటుంబాలు , సహాయ కేంద్రాలు పంచిన పులిహోర(?) పొట్లాలు , కట్టు బట్టలే మిగిలాయి దేవుడో అంటూ రోదిస్తున్న మహిళల్ని ఎప్పటికప్పుడు కెమెరాల్లో బంధించే మీడియా ,వీరిమద్యనుంచి  నడుస్తూనేను .

ఎన్ని సార్లు ఎంతమంది సర్వే  సర్వే అంటూ వస్తారు అంటూ ఒకకంట ఆక్రోశిస్తూ , మరోకంట దయచేసి మాకు న్యాయం చెయ్యండి అంటూ వచ్చిన అధికారి కాళ్ళమీద పది బతిమాలుతున్న ఒకామెను చూస్తుంటే  చేతులు చెంపల్ని తాకక మానలేదు .



ప్రాంతీయ పత్రికల కధనాల ప్రకారం :


Young India , Young Paper అని స్లోగన్ పెట్టుకున్న ఒక పత్రిక " NBT ( నవ భారత్ టైమ్స్ ) "
In Sunday Edition :

ప్రమాదం  జరిగి ఒక రోజు గడుస్తున్నా ప్రభుత్వం బాదితులగురించి ఏమీ పట్టించుకోవట్లేదు.  నేషనల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ లుగా స్క్రోల్లింగులు రం చెయ్యటానికి తప్ప , ప్రభుత్వం పై ఏ విధమైన ఒత్తిడీ తేలేక పోయింది. బాధితులు సమీప రైల్వే స్టేషన్ ని, సమీప ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జిని  తమ ఆవాసాలుగా మార్చుకున్నారు .  
అగిని కీలలు బాగా ఎగసిపడటం తో రెండు ఫ్లాట్ ఫారం ల మద్య బ్రిడ్జి పూర్తిగా కాలి పోయింది .సుమారు  రెండువేల మంది పైగా నిరాశ్రితులయ్యారు . అగ్నిమాపక సిబ్బందితో కలిసి మొత్తానికి ఇరవై అయిదు మంది  క్షతగాత్రులయ్యారు . టెన్త్ , ఇంటర్  పరీక్షలు రాయాల్సిన విద్యార్ధులు  , హాల్ టికెట్ లు కాలిపోవడం తో ఆవేదన చెందుతున్నారు . దీనిక్కూడా ప్రభుత్వం నుంచి ఏవిధమైన సమాధానమూ లేదు .
"కేవలం మౌనం మాత్రమె సమాధానం కాదని , సంఘటన పై పూర్తి స్తాయి దర్యాప్తు చెయ్యాలని , సంఘటనకి  కారణమయిన  వారిని కఠినం గా శిక్షించాలని , ఈ ప్రమాదానికి  కారణం కేవలం ప్రభుత్వమేనని   , బస్తీని  ఖాళీ  చేయించేందుకే  ప్రభుత్వం ఇళ్ళకు  నిప్పంటించింది   అనే వార్తల్లో  ఎంతవరకూ నిజం ఉందో తేటతెల్లం చెయ్యాల"ని పతిపక్షాలు డిమాండు  చేసాయి  .



మహారాష్ట్ర మణి బిందు  అని స్లోగన్ పెట్టుకున్న ఒక పత్రిక " లోక్  మత్ "
 In Sun Day Edition :


గత  శుక్రవారం  రాత్రి  వంట  గ్యాస్  పేలటం  వల్ల   జరిగిన  అగ్ని ప్రమాదం లో  సుమారు  రెండువేల మది  నిరాశ్రయులయ్యారు . ప్రమాదం జరిగినందుకు  చింతిస్తూ ముఖ్య మంత్రి పృధ్వీ రాజ్ చౌహాన్ , బాధిత కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి ప్రకటించారు . సహాయ చర్యలు యుద్ద ప్రాతిపదికన జరపాలని అధికారులను ఆదేశించారు . ఈ ప్రమాదం లో నష్టపోయిన కుటుంబానికి అయిదు వేలు చొప్పున నష్ట పరిహారం సి.యం. రిలీఫ్ ఫండ్ నుంచి ప్రకటించారు . 
తర్వాత విద్యాశాఖా మంత్రి రాజేంద్ర దర్దా మాట్లాడుతూ ,
"గరీభ్ నగర్ " ప్రాంత విద్యార్డులందరికీ పాఠ్య పుస్తకాలు పునఃపంపిణీ చేయనున్నట్లు , పదవ తరగతి , ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్దుల పరీక్షలకోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు . 
దాతల విశేష స్పందన , విద్యార్దుల , స్వచ్చంద సేవా కార్యకర్తల కృషి ప్రసంసనీయం అని , బాదితులకి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ పడుతుంది అని పునరుద్గాటించారు  .


****************

నాకు ఈ రెండు పత్రికల ధోరణీ చూస్తుంటే మన రాష్ట్రానికి  చెందిన రెండు పత్రికలే కళ్ళముందు కనిపించాయి .


సోమవారం ప్రచురితమైన ఎడిషన్ల లో NBT వాస్తవాన్ని ప్రతిబింబించక పోగా , లోక్ మత మాత్రం పరిస్థితి తీవ్రతను  పలచన చేస్తూ , ప్రభుత్వానికి బాసట గా నిలిచింది.

నిజ పరిస్థితిని వీక్షించి , రెండు పేపర్లను పక్క పక్కనే పెట్టి రీసెర్చ్  చేస్తే గాని నిజా నిజాలు అర్ధం కాక పోతుంటే , వాస్తవాలు ప్రజలకెలా తెలుస్తాయి ?  

 వాస్తవం లోకొస్తే ..

జామా మసీదు , నేషనల్ లైబ్రరీ లకు ఇక్కడినుంచి వెళ్లేవారి రద్దీ విపరీతం గా ఉంటుంది .
MMTS అభివృద్ది బాగా చెందటం తో ఇక్కడి MMTS  రైల్వే స్టేషన్ కి ప్రయానికుల తాకిడి వేలల్లోనే ఉంటుంది.
ఈ ప్రయాణికులపై ఆదారపడి చిన్నా చితకా పనులు చేసుకునే కూలీలు వేల సంఖ్యలో ఇక్కడి బస్తీల్లో నివసిస్తూ ఉంటారు .


బాంద్రా ఈస్ట్ రైల్వే స్టేషన్ పక్కనున్న స్లమ్ పేరు " గరీభ్ నగర్ ", " గరీభ్ వాడ "
 రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం మీద రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు , బయట సమోసా చాయ్ అమ్మేవాళ్ళు , ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర అడుక్కునేవాళ్ళు , రోడ్లు ఊడ్చేవాళ్ళు , ఎలక్షన్ల టైంలో డబ్బులు తీస్కుని సలాం కొట్టే కార్యకర్తలు, మట్టి పని , బండపని , మురుగుపని , కన్స్ట్రక్షన్ పని, సిమెంటు ఇసుకలు మోసే కూలి పని , టైలరింగు పని ,ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పనులకి ఆ బస్తీ ( మురికివాడ , స్లం) నిలయం . సకల కళా పోషకురాలు బాంద్రా.

ఎన్నో వృత్తుల వారిని , ఎన్నో కులాలు , ఎన్నో జాతులు , ఎన్నో మతాల వారిని తనలో కలుపుకున్న బాంద్రా , ఎన్నో ఆటుపోతుల్ని కూడా ఎదుర్కుంది . నేతల రౌడీయిజానికి , వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకోసమే  తరాలుమారినా
బాంద్రా తలరాత మారకపోవటానికి కారణం రాజకీయ పైశాచికత్వం .
దేశం లో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారి శాతం ఇంత తగ్గింది , అంత తగ్గింది ; మురుఇకి వాడలనేవే లేకుండా చేస్తాం పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తాం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు , అంటీ అంటకుండా వ్యవహరించటానికి కారణం కేవలం రాజకీయ లబ్దితప్ప మరేమీ లేదు .

రాజకీయ సంక్షోభం  ఏర్పడే   సమయాల్లో , ప్రభుత్వం పై ఏదైనా విషయంలో తిరుగుబాటు జరిగే సూచనలు ఉన్న సందర్భాలలో మన రాజకీయ నాయకులకి ఇవే పాశుపతాస్త్రాలనేవి
ప్రజలకి ( ముఖ్యం  గా ఆంద్రప్రదేశ్ పజలకి) తెలియనిది కాదు . లోగడ మన రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి , పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం , ఒక పేద వాడపై విరుచుకుపడ్డప్పుడు అదే పార్టీకి చెందిన పీ.జే.ఆర్. తనయుడు విష్ణు వర్ధన రెడ్డి , నాటకీయ ధర్నాలు , సినీ ఫక్కీ అరెస్టులు మనకి తెలియనివి కాదు.


గత మూడు నెలలుగా రాష్ట్రం ( మహా రాష్ట్ర ) లో మారిన ప్రభుత్వ సమీకరణలు , మంత్రివర్గ విస్తరణలు , అసమ్మతి వాదులు , ప్రభుత్వం పై సర్వత్రా వినిపిస్తున్న అవినీతి ఆరోపణలు , వీటినుంచి ప్రజల్ని మభ్యపెట్టటానికి , ప్రభుత్వం కదిపిన పావుగా కొన్ని మీడియా సంస్థలతో పాటు, కొందరు ప్రభుత్వ వ్యతిరేకుల నుంచి విరివిగా వినిపిస్తున్న మాట.
అయితే ప్రతీ ప్రమాదాన్ని ప్రభుత్వఖాతాలో జమ చెయ్యటం , ప్రమాదాల్ని రాజకీయం గా లబ్ది పొండుకోవటానికి ఉపయోదించటం కుటిల రాజకీయ ప్రమాణాలకి నిదర్శనమనేది , ప్రభుత్వ మద్దతు దారుల అభిప్రాయం .


భారత దేశానికి తొలి ఆస్కార్ అందించిన చిత్రం " స్లమ్ డాగ్ మిలియనీర్ " ఈ ప్రాంత నేపధ్యం లోనే జరుగుతుంది . ఆ చిత్రం లో నటించిన  బాలనటి రుబీనా ప్రస్తుతం ఈ అగ్ని  ప్రమాద భాదితురాలేకావటం విశేషం .       
     

సమయం మించి పోతుంది ..
తొమ్మిది గంటలకల్లా కొండుస్కర్ బస్సు స్టాప్ దగ్గర రిపోర్ట్ చెయ్యాలి .

ఈ సారి ముంబై ప్రయాణం చేదు అనుభవాన్ని మిగిల్చింది.