Sunday, March 27, 2011

పద్మశ్రీ , మరొక్కసారి నీ ఒడిలో ఒదగాలనుంది..

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా బ్యాచ్ లో నేను చాలా సైలెంట్ టైపు :), నిజంగానే .. అస్సలు క్లాసు లో ఉన్నా లేనట్టే ఉండేవాడిని.. ఎగ్జామ్స్ అప్పుడో , ప్రాక్టికల్స్ అప్పుడో నా వదనాన్ని వీక్షించే అవకాశం లెక్చరర్స్ కి చూపించేవాడిని . నా గురించి ఒకసారి మా ఇంగ్లీష్ మేడం అయితే ఔటర్స్ క్లాస్ లోకి వస్తున్నారని , మా ఫిజిక్స్ మేడం కి కంప్లైంట్ చేసారు.
అంటే నా మొహం అంత గుర్తుండేది మా గురువర్యులకి .



ఏరా ఆ పద్మశ్రీ వదిలేసిందా ఇక్కడికొచ్చి పడ్డావ్ అని , మా ఫిజిక్స్ మేడమే  నన్ను అడిగారు అంటే నాకు పద్మశ్రీ కి మద్య ఉన్న కెమికల్ బాండ్ ఏంటో, ఏపాటిదో మీరు అర్ధం చేసుకోవచ్చు.

,

మనసు బాగున్నా , బాగోకపోయినా ,

ఇష్టమున్నా , లేక పోయినా కాళ్ళు అరిగేలా ఆ పద్మశ్రీ చుట్టూ నే తిరిగేవాడిని.

కాలేజీ, బడులలో కంటే నేను పద్మశ్రీ ఒడిలో గడిపిందే ఎక్కువ, తను అంతలా లాలించేది నన్ను.



ఆ మాటకొస్తే రావులపాలెం లో నాకున్న ఒకే ఒక్క హోప్ "పద్మశ్రీ" ..



పిల్లలు - పెద్దలు ,కుర్రాళ్ళు, ముసలాళ్ళు, పెళ్లైనోల్లు- పెళ్లి కానోళ్ళు అందర్నీ కట్టి పడేసే అందం, సొగసు తనసొంతం.

పద్మశ్రీ అంటే మా కాలేజి బ్యూటీనో , క్యూటీనో కాదు.

రాజమండ్రి కి రంభ ఎలానో ( అప్పట్లో మాట, ఇప్పుడు గీతా అప్సర వచ్చిందనుకోండి) , రావులపాలానికి పద్మశ్రీ అలా అన్నమాట.



పద్మశ్రీ అంటే ప్రపంచాన్ని తనలోనే చూపించే సినిమాతెర,

ఎంతో మందిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, రెండున్నర గంటల సేపు వరకూ లాలించి, మంత్ర ముగ్ధుల్ని చేసే ఓ మాయ.

ఎప్పటికీ నిలిచిపోయే గొప్పదనం తనది , ఏవరేజ్ సినిమానయినా పద్మశ్రీ లో ఎంజాయ్ చెయ్యొచ్చు.

ఈ ధీమాతో నే జనాలు క్యూ కట్టేస్తారు,

"పద్మశ్రీ" ఎంత ఫేమస్ అంటే చుట్టుపక్కల ఊళ్ళ వారు, ఏదైనా పని మీద మా ఊరొస్తే, పద్మశ్రీ లో సినిమా చూడలేదంటే ఏదో వెలితి గా ఫీల్ అయ్యేవారట. టిక్కెట్టు దొరక్కపోయినా, కనీసం పద్మశ్రీ ప్రాంగణం లో సినిమా మొదలయ్యేవరకూ అటూ ఇటూ తచ్చాడి వెళ్తూ ఉంటారు చాలా మట్టుకి,



"శ్రీ వెంకటేశ్వర- పద్మశ్రీ" జంట హాల్లుగా మా తాతల కాలం నుంచి బాగా ఫేమస్.

అప్పట్లో డి.టి.యస్,& ఏ.సీ. కాదు కదా కనీసం కరెంట్ జెనరేటర్ కూడా లేని సినిమా హాళ్ళు..( ఇప్పడు మల్టీ ఫ్లెక్ష్ లు గా మార్చేస్తున్నారనుకోండి) .

యువతలో అయితే "పద్మశ్రీ కి సినిమాకెళ్తే లవర్స్ కధ కంచికి చేరుతుంది" అని గట్టి నమ్మకం.

జంటగా వచ్చిన వాళ్ళు ఏ మూల కూర్చున్నా సరే , ఎవరో ఒకరి కంట, ఎప్పుడో అప్పుడు ఖచ్చితం గా చిక్కేస్తారు.

కొందరు సాహసవీరులు బెట్టింగులుకాసి, బొక్కబోర్లా పడ్డ సందర్భాలు లెక్కకు మిక్కిలి .



పద్మశ్రీ నేను ముందే చెప్పినట్టు చాలా హెల్పింగ్ నేచర్ కలది . అందుకోసమే "పద్మశ్రీ " సహాయాన్నికోరి చాలా మందే వస్తారు

  • స్నేహితులు
( హితులు , స్నేహితులు .. అంటే బాగా ఎంజాయ్ చెయ్యటానికి వెళ్ళే టైపు , పక్కన ఫ్రెండుంటే ఉండే ధైర్యం తో కొంచెం రొమ్ము విరుచుకు తిరుగుతూ వీళ్ళు చేసే అడ్వెంచర్స్ కి కొదవే ఉండదు, క్లాస్ లెప్పుడూ బోర్ అనుకునే నాలాంటోల్లకి ఇక్కడ స్పెషల్ బెంచ్ లు ఉంటాయ్ )

  • ప్రేమికులు
( ప్రేమలో రకరకాల స్టేజిలలో ఉన్నవాళ్ళు అంటే వన్సైడ్ లవర్స్ , టూ సైడ్ లవర్స్, త్రీ సైడ్ లవర్స్ ... ఇలా అన్న మాట .,ఇంకా లవర్ అనే టాగ్ లైన్ , నేమ్ కింద పడకపోతే దానికోసం ఎదురు చూసే వాళ్ళు వీళ్ళలో ప్రముఖం గా చెప్పుకోదగిన వాళ్ళు )
  • ఇంట్లో పెద్దల దగ్గర వాళ్ళ ప్రేమను వ్యక్తపరచలేనోల్లు.
( ఇంట్లో ప్రేమను చెప్పటానికే భయపడేటోల్లు, ఎందుకు ప్రేమిస్తారో నాకైతే అర్ధం కాదు. ప్రేమించిన అమ్మాయి/అబ్బాయి తో బాగానే సినిమా చూసి, ఇంట్లో వాళ్ళ కంట్లోనో ,ఎవడో ఒకడు తెలిసినోడి కంట్లోనో పడి వీల్లకేమీ తెలియనట్లు వెళ్లి పోతారు,వీళ్ళ ప్లాన్ ప్రకారం ఇంట్లో వాళ్లకి లవ్ విషయం తెలుస్తుంది . బయటోడు ఎవడినా చూస్తే అంతకంటే ముందు ఊళ్ళో తెలుస్తుంది. ఫలానా వాళ్ళ అమ్మాయి/ అమ్మాయి , ఫలానా అతను/ఆమె తో తిరుగుతోందట అనే వార్త ఊరంతా పాకి పోవటానికి ఇద్దరూ కలిసి సినిమా చూసినంత సేపు కూడా పట్టదు, అమ్మా నాన్నలకి పెళ్లి ఇష్టం లేకుంటే పరువు బజారున పడటానికి, పెద్దాళ్ళు వీధిలో తలదించుకోవటానికి సినిమా ధియేటర్ లో కలిసి కూల్ డ్రింక్ తాగినంత సేపు కూడా పట్టదు .)

  • ఇంట్లో పెద్దలపై ఒత్తిడి తేవాలనుకునే వాళ్ళు ..
( వీళ్ళు ప్రేమిస్తారు , ప్రేమ విషయం , ఇంట్లో స్వతంత్రం గానో , మరే విధం గానో ఏదో లా ఇంట్లో చెప్పుతారు.
పెద్ద వాళ్ళ నిర్ణయం చెప్పటం లేటయితే గుర్తుచెయ్యటానికి రిమైండరు సినిమాలు చూసేవాళ్ళు , చెప్పాకా ఒప్పుకోకుంటే ఎలాగైనా వాళ్ళపై ఒత్తిడి తెచ్చి, ఇంట్లో వాళ్ళు ఎలా పోయినా పర్లేదు , నా ప్రేమ మాత్రం గెలవాలి అనుకునేటోల్లు వీళ్ళలో ప్రముఖులు . ఇక్కడ ఎవరిది తప్పు , ఎవరిది ఒప్పు అని నేను వివరించే సాహసం చెయ్యను . పరిస్తితులబట్టి చూస్తే , కొన్ని సందర్భాల్లో ఎవరి కోణం లో వాళ్ళే కరెక్టు అనిపిస్తుంటారు )

  • పెళ్ళైన జంటలు , వాళ్ళ బంధువులు , సాధారణ ప్రేక్షకులు ... .
( ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పోస్టేంటి, ఎప్పటికప్పుడూ అప్డేట్ చేస్తూ ఒక బ్లాగే రాయొచ్చు )



కానీ స్పెషల్ కేసు లో ఉండే కొందరు వ్యక్తులుంటారు. వాళ్ళే

  • భార్యా భాదితులు
( ఇంట్లో ప్రశాంతత కొదవయ్యి , నిద్ర కరువయ్యి , పెళ్ళాం పోరు పడలేక కనీసం రెండు, రెండున్నర గంటలన్నా ప్రశాంతం గా పడుకుందామని వచ్చేవాళ్ళు. పాపం అని వీళ్ళని చూసి జాలి పడేటోల్లు, భవిష్యత్తుని తలుచుకుని భయపడేటోల్లు, గతాన్ని తలుచుకుని నవ్వుకునేటోల్లు .. ఇలా చాలామది సానుభూతిపరుల మద్య వీళ్ళు పెసాంతం గా పడుకుంటారు. ).


ఇలా అందరికీ తనకు తోచిన సహాయం చేసే మా పద్మశ్రీ అంటే నాకు ఇష్టం. చాలా చాలా ఇష్టం ..



పద్మశ్రీ ,


నీలో నా పసితనముంది ,

నీలో నా స్వేచ్ఛ ఉంది ,

నీలో బొమ్మలెంత పెద్దగా ఉన్నాయోననుకున్న నా ఆశ్చర్యం ఉంది .,



నీలో నా బాల్యం ఉంది ,

నీలో నా సంతోషం ఉంది ,

నీలో నువ్వు చూపిస్తున్న సీన్ లకి ఏడ్చేసిన నా అమాయకత్వం ఉంది.,



నీలో నా కుర్రతనముంది,

నీలో నా ఆకర్షణ ఉంది ,

నీలో నువ్వు చూపిస్తున్న సీన్లకి ఈలలేసే నా అల్లరితనం ఉంది



నీలో నా యవ్వనముంది,

నీలో నా ఉడుకుతనముంది

నీలో నువ్వు చూపిస్తున్న జీవితాలను అన్వయించే నా సున్నితత్వం ఉంది

,

నీలో నా ఆనందముంది ,

నీలో నా ఆవేశముంది,

నీలో నా ఆక్రందన ఉంది , నీలో నా ప్రాణం ఉంది ,



నీలో గడిపిన క్షణాలు మళ్ళీ రావాలనుంది ,

గతమే తీపిగా మిగిలి పోకూడదని ఉంది ,

పద్మశ్రీ , మరొక్కసారి నీ ఒడిలో ఒదగాలనుంది..

4 comments:

  1. భీమవరం లో కూడా ఒక పద్మశ్రీ ఉండేది. మా చిన్నప్పుడు దాని పేరు వెల్కమ్ హాలు. తరువాత పద్మశ్రీ గా మారింది. ఇప్పుడు ఉందో లేదో, ఏ పేరుతో ఉందో. అంతా సినీమాయ.

    ReplyDelete
  2. నేనూ భీమవరం పద్మశ్రీ గురించి చాలాసార్లు విన్నానండి, బహుశా ఉందే అనుకుంటున్నాను..

    నిజమేనండి అంతా "సినిమా"య. :)

    ReplyDelete
  3. సొంత వూరిలో ఒక్కో ప్రదేశంతో ఒక్కొక్కరికి ఇలాంటి అనుబంధం ఉంటుందేమో కదా!

    బాగుంది మీ పద్మశ్రీ పురాణం!

    ReplyDelete
  4. సుజాత గారు ,
    అవునండి! ఖచ్చితం గా.
    సొంత ఊరంటేనే అనుబంధాలమయం కదండి .

    మొదటిసారి నా బ్లాగుకొచ్చారు, ధన్యవాదాలు మీకు ..

    ReplyDelete