
(మొదటి భాగం తరువాయి ..)
పందానికి రంగం సిద్దమైంది . చుట్టూరా జనం కేరింతలు కొడుతున్నారు .ఒంటి నిండా గాయాలున్నా మా ఈరభద్రం గాడు, సమరానికి కాలు దువ్వుతున్నాడు .కన్నార్పని ఈరబాబు కసి తో కోపం తో భద్రం కాలికి కట్టి కట్టాడు. రెండు కోళ్ళ రక్తం చిందిన నేల పై , వాటి ప్రాణాలు గాలి లో కలిపేసిన మృత్యువు , ఈ సారి ఎవర్ని ముద్దాడ బోతుంది ?
మొదటి రౌండ్ :
నోటితో నీళ్ళు తీసుకుని భద్రంగాడి నోటిలోనూ ,మొహం పైనా ఊదుతున్నాడు మా ఈరబాబు .
మొదటి విజిల్ వినపడింది . మధ్యవర్తి పచ్చ జెండా ఊపుతున్నాడు .
ఈరబాబు ఈరభద్రాన్ని కిందికి దించాడు .
ఎదురుగా ఎవరున్నా లెక్కచెయ్యనన్నట్టు,బెరుకు లేకుండా చూస్తున్నాడు ఈరభద్రం .
మా పుంజు ఇంకా సిద్దం కాలేదు, ఒక అయిదు నిమిషాలు టైం కావాలి అని అవతల వైపు వాళ్ళు అడిగారు.
క్రాసు విజులు మోగింది .
"మొదటి రౌండు ఇంకా మొదలు కావటానికి ఇంకా 5 నిమిషాల సమయముంది" అని ప్రకటించాడు మధ్యవర్తి.
“కేశవా ,, ఏంట్రా ఈ తిరకాసు ? , ఆళ్ళ కోడిని ఇప్పటిదాకా ఇక్కడే దున్న పోతును మేపినట్టు మేపారు కదా ? కత్తి కూడా కట్టారు . మళ్ళీ ఇప్పుడేమైంది ఈల్లకి , పుంజు సిద్దం గా లేదంటారేంట్రా ?” అని నన్ను అడిగాడు గంగరాజు .
“ ఇలాంటి పందాల్లో బరిలో దిగేదాకా పోటీదారులెవ్వరో ? ,బరిలో దిగాక గెలుపెవరిదో చెప్పటం చాలా కష్టం .”
ఈరబాబు ఈరభద్రాన్ని సేతిలోకి తీస్కోబోయాడు .
ఉన్నట్టుండి ఈరభద్రం తూలి పడ్డాడు.
అది సూసిన అవతలి వైపు వాళ్ళు క్రాస్ బెట్టింగ్ మొదలెట్టారు .
ఒకటికి పాతిక , ఒకటికి పాతిక , 1 X 25 అంటూ అరుస్తున్నారు .
ఈరబాబుగాడి కోడి ఈరభద్రం కళ్ళు తెలేసేస్తుంది.
అప్పటిదాకా కోపం తో ఎర్రబడ్డ ఈరబాబు గాడి కళ్ళు సన్నగా వర్షిత్తున్నాయి .
"ఒరేయ్ భద్రం , లేరా , లే రా, ఏమైంది రా ? , ఇద్దరం ఫ్రెండ్స్ కదరా ,చూడరా .. ,కేశవా నువ్వైనా మాట్లాడించరా.." అంటూ ఏడవటం మొదలెట్టాడు.
మా ఈరబాబు గాడు ఇంతలా ఏడవటం ఇదే మొదటి సారి.
అప్పుడే వచ్చిన మా సూరయ్య మామ ఈరభద్రం గాడిని ఆయన సేతుల్లోకి తీస్కున్నాడు.
కోడిపుంజు నోట్లో నీళ్ళు కొట్టి మెడకింద మెల్లగా కొడుతూ తెమడ తీసాడు. రెండే నిమిషాల్లో ఈరభద్రం గాడు మామూలుగా నిలబడ్డాడు .
అప్పుడే ఒక కారులోంచి మీసాలాయన ఒక పోతులాంటి కోడిని తెచ్చి , కత్తి కట్టి బరి లో పెట్టేడు .
కోడి పులిలా ఉంది , చూపు మరీ రాక్షసం గా కనిపిస్తుంది. చాలా మొండిగా నిలబడి ఉంది .

"వద్దు నాన్నా. ఈడికేమైనా అయితే ఎలా నాన్నా ? ఎల్లి పోదాం " అని ఈరబాబు మా సూరయ్యమాయ తో అన్నాడు .
“ఈరోజు మనది. గెలుపు మన వైపుంది.
నీకు తెలియ కుండానే గెలవటానికి కావాల్సిన ధైర్యాన్ని ఆడికి అందించావు.
మనం దెబ్బ తగిలిన కోడిని పట్టుకుని మనసులో ఏం సెప్తామో , ఏమనుకుంటామో అదే ఖచ్చితం గా జరుగుతుంది .అలాంటప్పుడు పుంజు సావును కాదు,అలాంటి ఊహనే మనసులోకి రానివ్వదు.
నీ ఆలోచనే దాని ఆలోచన . దాని గెలుపే నీ గెలుపు,
ధైర్యం గా ఉండు. ఇయ్యాల ఈరభద్రానికి ఎదురు లేదు, ఈడే ఈరుడు.ఈడికేమీ కాదు."
అని మా సూరయ్య మామ ఈరబాబు తో అన్నాడు.
మధ్యవర్తి ఈల వేసి, మళ్ళీ పచ్చ జెండా ఊపాడు.
సూరయ్య మామ మాటలతో మా వాళ్ళలో మళ్ళీ ఉత్సాహం వచ్చింది .
పందెం మొదలయ్యింది.
కేకలు , ఈలలు , అరుపులతో మొత్తానికి కొబ్బరితోట కోళ్ళమహాసంగ్రామానికి వేదికగా మారిపోయింది .
మీసాలాయన, మామ ఇద్దరూ పుంజుల్నివెనక్కీ ముందుకీ ఒకదానికొకటి చూపించి రణస్థలి లో వదిలేసారు .

అర వీరభయంకరం గా ఆ పుంజు భద్రం మీదికి దూకింది. కనురెప్ప వేసే టైం లో భద్రం తప్పించేసుకున్నాడు.
కానీ పాత గాయం కదిలి రక్తం కారుతోంది.అయినా భద్రం చూపుల్లో ఏమాత్రం బెరుకు కనిపించట్లేదు .
ఈరబాబు గాడి పుంజు ఈసారి తొందర పడలేదు. ఆ పుంజు మీదికొస్తున్న సమయం లో అమాంతం గాల్లోకి లేచింది. మీసాలాయన పుంజు అదుపుతప్పి ఆయన కాళ్ళ దగ్గరే పడబోయింది .
తెల్లగా మెరిసే భద్రంగాడి కాలి గోరు , కత్తి ఆడిరక్తం తో ఎర్రరంగు లోకి మారిపోయాయి .
ఈరభద్రం, మీసాలాయన పుంజు ఒకేసారి గాల్లోకి లేసాయి.
గంగా గాల్లోకి లేసిన ఎంటనే భద్రం గాడు కింద ల్యాండ్ అయ్యాడు.
మీసాలాయన పుంజు తూలుతూ ల్యాండ్ అయ్యింది.
తీరా సూద్దుల్లోకి దాని పొట్ట పై అంగుళం మందాన గాయం రక్తాన్ని సిందిత్తూ ఉంది .

రెండు పుంజుల రక్తం తో కొబ్బరి తోట మద్య ఉన్న పచ్చని గడ్డి కూడా ఎర్ర రంగులోకి మారి పోయింది .
ఈసారి బరువు తక్కువ భద్రం గాడు ( ఎదురుగా ఉన్న దానితో పోలిస్తే ) గాల్లోకి ఎగిరినట్లే ఎగిరి పరావలయ మార్గం లో మావైపు నేలను తన్నాడు.
అటు సూత్తే తల మొండెం వేరై ,మీసాలాయన పుంజు విగత జీవి అయి మృత్యుఒడికి సేరుకుంది.
ఒరేయ్ గంగా , కేశవా .. మన ఈర భద్రం గాడు మూడో పందెం కూడా నేగ్గేసేడ్రా సంతోషం తో వచ్చి నా గుండెలపై వాలిపోయాడు మా ఈరబాబు.
__________________________________________________________________________
చంద్రమ్మత్తా , మా మావయ్య ఎక్కడ ? అనే నా మాట పూర్తి కానేలేదు , ఏరా కేశవా ఎప్పుడొచ్చావ్ ? అంటూ మా ఈరబాబు గాడు వచ్చేడు.
“ఈరభద్రం గాడికి దెబ్బలు తగిలాయికదా , ఇండీషను సేయించటానికి మీ మావయ్య ఆసపట్లదాకా ఎల్లేరు ” అంది మా అత్తమ్మ ...
No comments:
Post a Comment