Sunday, July 15, 2012

అమ్మచెట్టు( ఒరియా అనువాదకథ )


ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం వర్షం పడుతుందేమో అనిపిస్తుంది.
ఆ ఊళ్ళో,  ఏటి ఒడ్డున,  విశాలమైన మైదానం మద్యలో ఒక చెట్టు ఉంది.
అక్కడికి రోజూ సాయంత్రాలు చాలా మంది పిల్లలు ఆడుకునేందుకు వచ్చేవారు. కల్లాకపటంలేని నవ్వులతో సందడి చేసేవారు. ఒకరోజు అలా ఆడుకోవటానికి అందరిలానే ఓపిల్లాడు వచ్చాడు, అలసట తీర్చుకునేందుకు ఆచెట్టు నీడన కూర్చున్నాడు. అలసట తీరాకా ఆచెట్టుని పరీక్షగా చూడటం మొదలుపెట్టాడు.చెట్టుమొదలు దగ్గర రాలిపడిఉన్న పళ్ళను తీసుకుతిన్నాడు. ఆచెట్టు బెరడు మీద కాలేసి కొమ్మమీద కూర్చుని పైకొమ్మకి కాసిన పూలని, పిందెల్ని,కాయల్ని,పళ్ళని కళ్ళతో పరామర్శించాడు. తర్వాత కొమ్మను పట్టుకు వేలాడి, కిందికి దూకాడు. మనసుకు బాగుందనిపించటంతో మళ్ళీ చెట్టెక్కి మళ్ళీ దూకాడు. ఆ తర్వాత మళ్ళీచెట్టెక్కి ఈకొమ్మమీదినుంచి ఆకొమ్మమీదికి, ఆకొమ్మమీదినుంచి  ఈకొమ్మమీదికి ఉరుకుతూ కాసేపు కాలక్షేపం చేసాడు. ఇంతలో తోటి పిల్లలు, ఆటలు ముగించుకుని ఇంటిదారి పట్టడం చూసి, మెల్లగా చెట్టుదిగి తనూ ఆటలు కట్టిపెట్టి ఇంటిముఖం పట్టాడు.

తర్వాతి రోజు ఉదయాన  పుస్తకాలసంచినొకదానిని వీపుకు తగిలించుకుని ఆపిల్లాడు చెట్టుదగ్గరికి చేరుకున్నాడు. చెట్టునుంచి వీస్తున్న చల్లటి ఉదయపుగాలిని గుండెలనిండా పీల్చుకున్నాడు. నేలమీద రాలిపడ్డ పండుని తీసుకునితింటూ, కిందనున్న  బెరడుకి సంచిని తగిలించి, జాగ్రత్తగా చెట్టు ఎక్కాడు. చెట్టుకొమ్మ మీదినుంచి కాళ్ళు కిందికి వ్రేలాడేసి, మెల్లగా వాటిని  ఊపుతూ పండుని తింటూ,  ప్రపంచంలో తనుకనుగొన్న ఈ ప్రశాంతమైన చోటుని మరోసారి కళ్ళలో నింపుకున్నాడు. ఇంతలో బడి గంట చప్పుడు వినబడగానే, ఒక ఉదుటున కొమ్మ మీదినుంచి కిందికి దూకేసి , పుస్తకాలసంచి తీసుకుని బడివైపు పరిగెత్తాడు.ఆ మద్యాహ్నం భోజన విరామంలో మళ్ళీ చెట్టుదగ్గరకి వెళ్లి కాసేపు కూర్చున్నాడు. మళ్ళీ సాయంత్రం బడినుంచి ఇంటికి వెళ్ళేప్పుడు ఆచెట్టు దగ్గర కాసేపు ఆడుకుని ఇంటికెళ్ళి పోయాడు. మరుసటి  రోజూ ఇదే వరుస. ఆ తర్వాత రోజునుంచి ఆ పిల్లానికి ఇదే దినచర్యగా మారిపోయింది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చెట్టు దగ్గరే కాలక్షేపం చెయ్యటం మొదలెట్టాడు.

పిల్లవాడి ఆటల్ని, సంతోషాన్ని చూసి చెట్టు మురిసిపోసాగింది.
ఆ పిల్లాడిని తన కొడుకుగా, తనని అతడి తల్లిగా భావించుకుంది. ప్రతీ రోజూ తనపిల్లాడి కోసం ఎదురుచూసేది .
రాగానే కొమ్మలూపి చల్లటిగాలిని విసిరేది . ఆకలిని తీర్చేందుకు పళ్ళని రాల్చి సిద్దంగా ఉంచేది. కొమ్మ మీద ఆ పిల్లాడు పడుకున్నప్పుడు నెమ్మదిగా జోలపాడేది. తటాలున ఒక్క ఉదుటున అతను దూకి ఇంటికెళ్ళి పోయేప్పుడు బాధ పడేది. అలా దూకేప్పుడు అతనికి ఏమైనా దెబ్బలు తగులుతాయేమోనన్న భయంతో తన కొమ్మల్ని  భూమికి దగ్గరగా వంచేది.
ఒక్క పూట వాడు కనిపించక పోయినా తల్లడిల్లి పోయేది. 
   

రోజులు.. సంవత్సరాలు గడిచి పోయాయి.
పిల్లవాడు కాస్త పెద్దవాడయ్యాడు. బడినుంచి హైస్కూలుకొచ్చాడు. రోజూ సాయంత్రం మాత్రం ఆచెట్టు నీడన కూర్చుని కాసిన్ని పళ్ళని తిని, కాస్త కాలక్షేపం చేసి వెళ్తుండేవాడు. ఇంకొన్ని రోజులు గడిచాయి .. రాకపోకలు మరికాస్త తగ్గాయి. ఎప్పుడైనా పని మీద అటుగా వెళ్తున్నప్పుడు ఒక్కోసారి వచ్చి చెట్టు నీడన కూర్చునేవాడు. మరికొన్ని రోజులు గడిచాయి , వారానికో రెండు వారాలకో , లేకపోతే నెలకో .. వచ్చి చూసి వెళ్తుండేవాడు .

ఎప్పుడూ తనదగ్గర కూర్చుని కబుర్లు చెప్పే కొడుకు , ఇంతలా ఎందుకు మారిపోయాడా అని తనలో తానూ చాలా బాధపడింది చెట్టు. తన దగ్గర కూర్చోవటం, కబుర్లు చెప్పటం మాట అలాఉంచి కనీసం మొహాన్నైనా చూపించట్లేదని వ్యాకులత చెందింది.
ఆ తర్వాత ఎప్పుడో అతగాడు వచ్చినప్పుడు అదే విషయాన్ని అడిగింది .అంతకుముందు ఎప్పుడూ ఈ అమ్మదగ్గరే కూర్చుని, బోలెడు కబుర్లు చెప్పేవాడివి. ఏమయ్యింది నాన్నా! ఈ మధ్య అసలు రావటం కూడా మానేశావ్ ? అని.

అలాంటిదేమీ లేదు.  కాలేజీ కదా ! . కాస్త  బిజీ, బిజీగా రోజులు మారిపోయాయి. అవి చదవాలి , ఇవి చదవాలి అని .ఒకటే ఆలోచనలు. అందుకోసమే కుదరట్లేదు.

ఎప్పుడూ చదువు చదువు అని , ఎక్కువ గాబరా పడకమ్మా , సమయానికి తినటం పడుకోవటం లాంటివి కూడా చెయ్యి .
మొహం చూడు , ఎలా పీక్కుపోయిందో అని , కాసిన్ని పళ్ళని అతని చేతికి దగ్గరగా జార్చింది.

ఆ ఆ ..  అలాగలాగే అని చెప్పి, పళ్ళను తీసుకుని, అతను , అక్కడినుంచి వెళ్ళిపోయాడు .

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి గానీ అతడు  అటుగా వెళ్ళలేదు. ఆ చెట్టుకి కనిపించలేదు . రోడ్డు మీదుగా నడిచి వెళ్తున్న అతన్ని చూసి తనే ఆప్యాయంగా కేక వేసింది..
అతని జుట్టు పెరిగిపోయి ఉంది . కళ్ళు లోపలికి వెళ్లిపోయాయి  

ఏంటమ్మా ? ఇలా అయిపోయావ్ ? ఆరోగ్యం ఏమన్నా బాలేదా? అని అడిగింది.

ఏదో ఆలోచిస్తున్న వాడిలా ఉన్న అతను చటుక్కున ఈ లోకానికి వచ్చినట్టు, సన్నగా కంపించి ,
కాసిన్ని డబ్బులు అవసరం పడ్డాయి . నా దగ్గర డబ్బులే కాదు , చేసేందుకు ఏపనీలేదుఅన్నాడు.

నాకెప్పుడూ ఇలాంటి అవసరం రాలేదు . ఆ మాటకొస్తే డబ్బులెలా ఉంటాయో కూడా నాకు తెలీదు. నీకు డబ్బులు సమకూర్చటానికి నేను ఏమి చెయ్యగలనో కూడా నాకు అర్ధం కావట్లేదు . పూలు పండ్లు తప్ప నేను నీకు ఏమీ ఇవ్వలేను.
ఒకవేళ వాటిని అమ్మి, సొమ్ము చేసుకోగలను అనుకుంటే .. నా పూలని, పళ్ళని కోసుకునెల్లి ఏదైనా వ్యాపారం చేస్కో .. అంది చెట్టు.

ఆమాట వినబడటమే ఆలస్యం.. చెట్టుకున్న కాయలన్నింటినీ కోసేసుకుని, వెళ్లి అమ్ముకుని సోమ్ముచేసుకున్నాడు.
కాయలు కోసేప్పుడు, అడ్డొచ్చిన చిలవల్నీ, పలవల్నీ కూడా తెంపేశాడు.  అప్పుడు కొంచెం బాధ పడినా, నా కొడుకు కోసమేకదా ఇదంతా అని ఆనందపడింది చెట్టు.

ఇంకొన్ని రోజులుగడిచాయి. ఋతువులు మారాయి . ఓ వర్షాకాలపు మద్యాహ్నం హోరున వర్షంలో తడుస్తూ , ఆచెట్టు కింద తల దాచుకోవటానికి వచ్చాడు అతడు. చాలా రోజులు తర్వాత కొడుకుని చూసానన్న సంతోషంలో, కంటతడి పెట్టుకుంది.  కొడుకు తన కన్నీళ్ళను చూసి ఎక్కడ బాధపడతాడోనన్న భయంతో, వర్షపు చినుకుల ధారలతో మొహాన్ని కడిగేసుకుంది.
అయినా అతని మొహం దీనంగా, బాధగా ఉండటం తను గమనించింది. అతని మోహంలో దిగులుభావాన్ని చూడలేనన్నట్టుగా, బెంగపడి అడిగింది.. ఎందుకమ్మా ? , అలా దిగులుగా ఉన్నావ్ ? అని.

కాలాలు మారిపోతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినా నా సంపాదన అంతంత మాత్రంగానే ఉంది.
తలదాచుకోవటానికి ఇల్లుకూడా లేదు. వానాకాలం వచ్చిందంటే చాలు నా అవస్థలు చెప్పనలవి కావు.... ... బాధని గొంతులో ధ్వనింప చేస్తూ అతగాడు చెప్పుకుపోతున్నాడు.

కొడుకు కష్టానికి మరికొన్ని కన్నీళ్ళను కార్చింది. అతని బాధని పోగొట్టటానికి తనేం చెయ్యగలనా అని ఆలోచించింది. ఓదార్పుగా చెప్పటం మొదలుపెట్టింది. ఇల్లు .. ఇల్లంటే ఏంటో నాకుతెలీదు. ఒంటరిగా ఎండకు ఎండి, వానకు నాని, చలికి వణకటం తప్ప .. నిజంగా ఇల్లంటే ఏంటో నాకు తెలీదు. కానీ నువ్వు నాలా కాదుగా . నీకు కొన్ని బరువు భాద్యతలున్నాయ్. కుటుంబం ఉంది. వాళ్ళను కాపాడుకోవటానికైనా నీకు ఇల్లు కావాలి. ఈవిషయంలో, నావల్ల నీకేదైనా ఉపయోగం జరుగుతుందేమో ఆలోచించు. నాకు పెద్ద పెద్దకొమ్మలున్నాయి.అవి నీఇంటికి వాసాలుగా బహుశా ఉపయోగపడొచ్చనుకుంటా!
వాటిని తీసుకెళ్ళి ఇళ్ళు కట్టుకో అంది.

మరుక్షణమే.. అతను చెట్టెక్కాడు. యే యే కొమ్మలు ఎలా ఎలా ఉపయోగ పడతాయో అని ఆ కొమ్మ మీదినుంచి ఈ కొమ్మ మీదికి దూకుతూ ఆలోచించాడు.
అతడు చిన్నపిల్లాడిగా ఉయ్యాలలూగటం, కొమ్మల్ని పట్టుకు వేలాడటం. కొమ్మమీది నుంచి నేలమీదికి దూకటం. అతనికి ఎక్కడ దెబ్బలు తగుల్తాయోనని తను గాబరాపడటం, కాస్త నేలబారుగా వంగి అతన్ని సురక్షితంగా కిందికి దించటం. వెళ్ళేప్పుడు తింటూ వెళ్ళమని పండ్లని , అతని చేతుల్లోకి జార్చటం ఒక దానివెంట ఒకటి , తన మాతృత్వపు ఒడి జ్ఞాపకాలు గుర్తొచ్చి, ఆ చెట్టుకళ్ళు అప్రయత్నంగా తడి అయ్యాయి.

గొడ్డలితో కొమ్మల్ని నరకటం మొదలెట్టాడతను. వాసాలకోసం బలమైన కొమ్మలు , దూలాలకోసం పొడవాటి కొమ్మలు, ఇంటి చుట్టూ కంచె కోసం, నిట్రాడులకోసం .. ఇలా తనఅవసరానికి కి పనికి వస్తుందనుకున్న  ప్రతీ కొమ్మా నరికాడు. చివరకికి కొమ్మలులేని మోడు ఒక్కటి మిగిలింది. ఈక్షణం చెట్టు బాధపడలేదు, తన ప్రతీ కొమ్మా కొడుకుకి ఎంతగా అవసరమో ఆలోచించింది. కొమ్మల్ని నరుక్కుని వెళ్తున్న కొడుక్కి కొమ్మలూపి టాటా చెప్దామనుకుంది. అది తన వళ్ళకాదని తెలిసిన మరుక్షణం నిండు గుండె తో అతనికి మంచిజరగాలని కోరుకుంది.

ఆకులు కొమ్మలు లేక, చెట్టు ఆహారాన్ని సమకూర్చుకోలేకపోయింది. చిక్కి నీరసించి పోయింది. మోడుబారటం అనే ప్రక్రియను మొదటిసారి అనుభవించింది. అంతలో అటుగా కొడుకు వచ్చాడు. చూసి చాలా చాలా సంతోసించింది. తనకడుపు ఆకలితో మాడిపోతున్నా  కొడుకు ఆకలి తీర్చటానికి కనీసం ఒక్క పండునైనా ఆహారంగాఇవ్వలేక పోతున్నానని బాధపడింది. సహజసిద్దమైన దీనత్వం అతని కళ్ళల్లో ప్రకాశిస్తోంది. ఏమయ్యిందని చెట్టు అడగటమే ఆలస్యం.. అతడు మొదలెట్టాడు.

నేను ఏటికవతల ఊళ్ళో పని చేస్కుని, కాసిన్ని రాళ్ళు వెనకేసుకుని , నాకుటుంబాన్ని పోషించుకుందాం అనుకుంతున్నాను. కానీ .. నడిదాటటానికి నావకి సరిపడా డబ్బులు నాదగ్గరలేవు.... .. అంటూ ఏకరువు పెట్టాడు.

నువ్వేం దిగులు పడకు బాబూ, నేనున్నానుగా .. నా ఈ కాండాన్ని నరికి నావ చేస్కో అంది.

ఆమాటలంటున్నప్పుడు అతడలా ఆచెట్టునే చూస్తూ ఉన్నాడు. కొడుకు ప్రయోజకుడు కాబోతున్నాడనే సంతోషం ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపించింది. నిండుమనసుతో ఆచెట్టు అతన్ని దీవించింది.

ప్రయాణానికి అతడు నావ సిద్దం చేసుకున్నాడు. ఎదురుగా ఏరు దాట బోతున్న అతన్ని సంతోషం తో సాగనంపింది చెట్టు.
అతడు నావతో ఏరుదాటటం మొదలెట్టాడు. చెట్టు అలా చూస్తూనే ఉంది. కొద్ది కొద్దిగా అతడు తన గమ్యం వైపు సాగిపోతూ, ఇవతలి ఒడ్డుకీ, చెట్టుకీ దూరంగా వెళ్లిపోసాగాడు. చిన్నగా మసక మసగ్గా కనిపిస్తున్న ఆ నావని అలానే చూస్తూ ఉండి పోయింది చెట్టు .

భూమిని చీల్చుకొచ్చి గంభీరంగా,ఒంటరిగా, నిండుగా పెరిగి,
పూలూ పళ్ళతో , పెద్దపెద్దకొమ్మలతో ఎంతో అందంగా విస్తరించుకుని , ఎందరికో నీడను పంచి, తన కొడుక్కి ప్రేమను పంచిన చెట్టు మోడుబారి, రెండడుగుల తునకగా మిగిలిపోయింది.

ప్రతీ రోజూ ఆయేటినే చూస్తూ, కొడుకు తిరిగి వస్తాడన్న నిరీక్షణలో కాలం గడుపసాగింది చెట్టు.
దారిన పోయే , ప్రతీ ఒక్కరినీ , కొడుకు క్షేమ సమాచారం ఏమన్నా తెలిసిందేమోనని ఆరాతీయటం మొదలెట్టింది.

కొన్ని సంవత్సరాలు గడిచాయి,
ఒకరోజు సాయంకాలం ..
మైదానంలో పిల్లలు ఆటలాడుకుంటున్నారు.  ఓ పిల్లాడు  అలసిపోయి ఆచెట్టు తునకమీద కూర్చుని విశ్రాంతితీసుకోసాగాడు. అతన్ని తన మనవడిగా భావించటం మొదలెట్టింది చెట్టు..
  
__________________________________________________________________________________

ఇది ఒరియా కథ ..  గల్హాపువా  ( తల్లిచాటు కొడుకు అనే అర్ధమట )

మొన్న సరదాగా, మిరపకాయ బజ్జీలు తింటూ చెప్పుకున్న పిచ్చాపాటి కబుర్లలో నా కొలీగ్ సుధాంశు చెప్పిన కథ ఇది.
నాకు అర్ధమైన కథకి..  తెలుగు అక్షర రూపం.
రచయిత పేరు తెలీదన్నాడు.  కాపీరైట్ సమస్యలేమీ ఉండవనే అనుకుంటున్నాను .  అలాంటివి ఏమైనా ఉంటే తెలియచేస్తే
ఇక్కడనుంచి తొలగించగలవాడను ..




THANK  YOU.. 











ముద్దమబ్బుల పందిరికింద,
మెరుపుల వెలుగుల చూపులతో,
తొలకరి జల్లుల మాసంలో,
వానకు తడిసిన పుడమిన తాను,

నిశ్చలమైన ఆకృతిగా, పచ్చని చిగురుతో ప్రకృతిగా,
మెత్తని ఆకుల నవ్వులతో, పుత్తడి పోలిన పువ్వులతో,
పుడమిన పుట్టిన పాపై తానూ , పెరిగెను పెద్దగ ప్రేమను పంచగ 
సంజ వెలుగుల సూపులు సోకగ, మొగ్గలవోలె దాచెను  సిగ్గుని .

ఆడుకునేందుకు బొమ్మగ మారి
వేడుకునేందుకు అమ్మగ మారి
ఆకులు,పువ్వులు,కాయలతోటి,
ధరణిని నింపెను రంగులతోటి, 

ఆటన అలసిన పిల్లలను ,నిద్రను పుచ్చే పాటగ  తాను
పంచన చేరిన పాపలకు , నీడను పంచిన నేస్తం తాను
గూటికి చేరిన గువ్వలను, గుండెను పొదిగెను గోముగ తాను
మంచిగ జోడ్చిన చేతులకు,చల్లని గాలుల దీవెన తాను  

                             
కొమ్మలతోటి ఊయలలూపి,  ,
బంగరు భవితకు బాటలు చూపి,
కట్టమునోర్చి, కట్టెగామారి,  
తనప్రాణమునిచ్చి  ప్రేమను పంచె 

4 comments:

  1. chaalaa rojulaki o manchi kadha chusanu keshava garu baavundi amma chettu kadha kavita...

    ReplyDelete
  2. మీకు నచ్చినందుకు చాలాసంతోషం మంజుగారు ..
    థాంక్ యు..

    ReplyDelete
  3. Replies
    1. :)
      welcome to my blog dear..
      जलदी "तेलुगु" सीखो ! जब ही मै क्या लिखा हूँ तुम को समाज में आएगा!
      Thank You ..

      Delete