Friday, October 29, 2010

నా ప్రేమ ..


ప్రేమ ..

అంటే ఏంటి ?

ఈ పదం
వింటే ఒకప్పుడు నా ఒళ్ళు జలధరించేది ,
అదే పదం వింటే మరోసారి నా నరాలు వుప్పొంగేవి,
అదే సమయంలో వెయ్యి వోల్టుల విద్యుత్తు నా నర నరాల్లో ప్రవహించేది ,

ఇప్పుడు
ప్రేమంటే భయమేస్తుంది ,
ప్రేమంటే జాలేస్తుంది .,
ప్రేమంటే బాధేస్తుంది ..

నా జీవితం లో ప్రేమ ఓ జ్ఞాపకం గా మిగిలి పోతోంది ,
బంధాలని పెకిలించిన పాశమై మిగిలి పోతోంది ,
గతానికి వర్తమానానికి మద్య ఓ వంతెనగా మాత్రమే మిగిలిపోతోంది


కలలా చెరిగి పోతోంది
కలతై నిదుర లేపుతోంది .
కవితగా నిలిచిపోతోంది ,

నా బతుకు పుటలో చెరిగిపోయిన అక్షరం గా మాత్రమే రూపు దాల్చుతోంది..
నాది అనుకున్న నాది నాక్కాకుండా పోతోంది,
నాకంటూ ఏమీ లేకుండా పోతోంది ,
నా నన్ను ఎందుకిలా చేసావని ప్రశ్నిస్తోంది ..

నా గుండె లోతుల్లో గరళాన్ని నింపి ,
కంటి కలుగుల్లోంచి కన్నీటిని కారిపిస్తోంది.

నీకు తెలుసా ,
నా కన్ను నిమిషానికి డెబ్భై రెండు సార్లు, కన్నీటి చుక్కల్ని కారుస్తోంది ,
ప్రతి హృదయ స్పందనకి ఓక్కో చుక్క చొప్పున కారుస్తోంది ,

కన్నీళ్లు మది లో బాధని కడిగేస్తాయని,
జారే కన్నీటి విలువ తేలికపడిన గుండెకు మాత్రమే తెలుస్తుందని ఎవరో అన్నారు.
కానీ నా కన్నీళ్లు మాత్రం కనికరం చూపించట్లేదు నా పైన .

పెను తుఫాను రేగిన నా గుండె చప్పుడు తో ఆటలాడుతున్నట్లు,
నా కన్నీటి కడలి అలల తరంగాలు , నడి నిశి లో కూడా నా చెక్కిలి పై వరదని సృష్టించేస్తున్నాయి ..

అమృతం అశ్రువై,
ప్రేమ పాశమై ,
బంధం భారమై,
నువ్వు దూరమై ,నేను శిలనైన ఈ క్షణం ..

నా గుండె నీరు వాడుతోంది,
నీరు వాడి గట్టిపడుతోంది ,
గట్టి పడి బీటలీడు తోంది,
బీటలీడి రక్తమోడుతోంది .

Thursday, October 28, 2010

నా డైరీ లో ఒక పేజీ .. ( 1/2 )



27 -అక్టోబర్ - 2010

ఎప్పటి లాగానే ఈ రోజు కూడా కొత్తదనమేమీ లేదు, అదే మరాఠీ గోల మద్య , అదే పాత ఫైల్ ఫార్మాట్ లో ఏదో వర్క్ చేసాను . ఏదో జీతం ఇస్తున్నారు కాబట్టి , కంపెనీ కి నేను ఇప్పుడు చెయ్యాల్సి ఉంది కాబట్టి చేస్తున్నాను. నిజానికి మనస్పూర్తి గా , ఇష్టం గా పని చేసి ఒక 5 రోజులు అయ్యింది. ఆ 6 రోజుల క్రితమే నేను పెట్టిన సెలవులు అయ్యిపోవటం తో తిరిగి ఇక్కడికి వచ్చాను. తిరిగి వచ్చాక నేను ఇష్టపడి పని చేసింది ఒక్కరోజు మాత్రమే. వర్క్ పై నాకు ఇంట్రెస్ట్ పోవటానికి వున్న కారణాలు అనేకం.

నిజంగా ఈ రోజు పెద్దగా చెప్పు కోవాల్సింది  ఏదీ లేదు. నా డైరీ లో ఒక నిస్సారమైన పేజీ, నిరాశగా మిగిలి పోయిన రోజు ని తప్ప .

ఎప్పట్లాగే ఈరోజూ తెల్లారింది, సూరీడొచ్చాడు, కొల్హాపూర్ లో చాలా నిత్తేజం గా బద్ధకం గా , ఒళ్ళు విరుచుకుంటూ నేను లేచాను . ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని ఆఫీసు కు వచ్చేసాను. అందరిలా హడావుడిగా ఆఫీసు కు వెళ్ళే అదృష్టం నాకు లేదు, ఎందుకంటే నేనుండే రూం కిటికీ తెరిస్తే నా కేబిన్ కనిపిస్తుంది. ఒకే కాంపౌండ్ లో ఎదురెదురు బిల్డింగ్స్ మావి . రెండు అడుగులు వేస్తె మా ఇల్లు ఆఫీసు అయిపోతుంది . వచ్చి రాగానే క్లైంట్ కాల్స్ రిసీవ్ చేస్కోవటం , సైట్ ఇంజినీర్ల నుంచి స్టేటస్ తీస్కుని వాళ్ళ ని మోబిలైస్ చెయ్యటం, ఇన్వాయిస్ లు, డి.పి.ఆర్. లు , వర్క్ కంప్లీసన్ సర్టిఫికేట్ లు , జె.యం.సి. లు, అప్పుడప్పుడు మనసు బాగోపోతే బ్లాగ్స్ చదవటం , ఇంతే నా ప్రపంచం . ఈరోజు కూడా పనిలేని మా హెడ్ ఆఫీసు వాళ్ళు ఎక్సిక్యూసన్ పేరుతో సాయంత్ర వేలని తినేశారు. సేల్స్ అని, టార్గెట్ అని రోజూ వుండే రచ్చే ఈ రోజు కొంచెం మోతాదు మించింది .

ఈ హడావిడి లో ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ , చడీ చప్పుడు లేకుండా నిశ్శబ్దం గా కూర్చుని ఉంది ఒక మెసేజ్.

"వన్ న్యూ మెసేజ్ రేసీవ్ద్ " అని చూడగానే ఏ ఎయిర్టెల్ వాడో ,డి.టి.హెచ్. ఆఫర్ కోసం పంపించే వుంటాడు అనుకున్నా, ఎందుకంటే రోజూ వచ్చే టి.వి. సీరియల్ లాగా గత 4 రోజులుగా సరిగ్గా ఈ టైం కి మెసేజ్ పంపించేది వాడే. రీడ్ బటన్ ప్రెస్ చేసి మెసేజ్ చదివా,

"బావ గారూ బావున్నారా ?, ఏం చేస్తున్నారు .. మీ బుజ్జి " అని మెసేజ్ పెట్టింది మా బుజ్జి.

బుజ్జి నా మరదలు , మా మేనమామ కూతురు. పెపంచం లో బావల్ని ఎవరినైనా ,ఆట పట్టించే హక్కు మరదల్లకి ఉంది అని ఫీల్ అవ్వుతూ వుంటుంది . మరదల్లని వుడికించే హక్కు బావలకు కూడా ఉంది అనేది నా ఫీలింగ్ .సో ఎప్పుడూ మా మద్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు షరా మాములే . తను నా చేతిలో కావాలనే చాలా విషయాల్లో ఓడిపోయి నీ గెలుపు వెనక నే వున్నాబావ అంటుంది.తనకు నా కంటే నా మాటలంటే నే ఎక్కువ ఇష్టం , అందుకోసమే నాతొ ఏదో ఒక విషయం పై వాదిస్తూ వుంటుంది . చిన్నప్పట్నుంచీ తను నెల్లూరు లోనే పెరిగింది. మా నెల్లూరు , గోదావరి ల మాటల కామ్బినేసన్ మా ఇంట్లో అందరికీ చాలా సరదాగా వుంటుంది . బావలకు మరదల్లపై పెత్తనం చెలాయించే హక్కు వుందని మా నాన్నని చూసి నేర్చుకున్నా. ఒకసారి ఏదో మాట్లాడుకుంటూ వున్నపుడు "అది కాదు బావా ..! " అంటూ తను ఏదో చెప్పబోయింది, వెంటనే నాలో బావ నిద్రలేచాడు , " ఎంటే బావ , బావ అంటూ పిలుస్తున్నావ్ ? పెద్దాలంటే గౌరవం లేదా ? , బావ గారు అని పిలువు "అని ఓ హుకుం జారీ చేశా. మొదట్లో ఈ చట్టం నాకు బాగానే కలిసొచ్చింది .అయితే అంతే త్వరగా ఈ చట్టం లో లొసుగులు తనకి అర్దమైపోయాయి . మాటకు ముందో గారు , వెనకో గారు పెట్టి , నా చేత తను వండిన గారెల్ని తినిపించేసింది . ఇక లాభం లేదనుకొని చట్టం లో కొన్ని సవరణలు చేశా , " అందరూ వుంటే బావ గారు అను, అయితే ఎక్కువ సార్లు గార్ల ప్రయోగం నిషిద్దం, మనమిద్దరమే వున్నపుడు నీ ఇష్టం " అంటూ నేను పంపిన సవరణ చట్టం పై అలాగే బావగారు అంటూ ఓ నవ్వుసంతకం చేసేసింది.

భళా రే బాబు భళా అనుకుంటూ నేను నాలో ఉన్న బావని భుజం తట్టి అభినందించేశా , మా బుజ్జి నవ్వు కు అర్ధం త్వరలోనే నాకు అర్ధమయ్యింది. ఈ సవరణ చట్టాన్ని ఇంకా వాడిగా నాపై ప్రయోగిస్తుంది . అక్కడక్కడా బావ గారు అనమని నేనన్నచోట బావ అని , బావ అనమన్న చోట నువ్వు అనీ అంటుంది . మా బుజ్జి ఏమన్నాబావుంటుంది , తను బావ గారు అంటూ ఒక డిఫరెంట్ స్లాంగ్ లో అంటుంది . అది హార్ట్ లో ఎక్కడో టచ్ చేసి నన్ను ఫోన్ తో పాటూ మెలికలు తిప్పేస్తుంది. మా బుజ్జి నేను ఏం చెప్పినా వింటుంది, ఏంచెయ్యమన్నా చేస్తుంది. మొన్న ఒకరోజు అత్తయ్య ఏం చేస్తుంది అని అడిగా, గుడికి వెళ్ళింది బావా అని తను రిప్లై ఇచ్చింది. మరి నువ్వు వెళ్ళవా గుడికి , ప్రసాదం తినటం తప్ప , ఒక్కసారైనా దేవుడికి దణ్ణం పెట్టావా ?అని అడిగా, అంతే ఆరోజు ఆ టాపిక్ మీద నేను మాట్లాడలేదు. ఏ రోజూ సాధారణం గా గుడికెల్లని మా బుజ్జి, భక్తురాలి అవతారమెత్తి మొత్తం వాళ్ళ ఇంటినీ ,ఫ్రెండ్స్ నీ అవాక్కు చేసింది .దేవి నవరాత్రులు తొమ్మిది రోజులూ ఉపవాసం చేసి , ఆ దేవి కరుణనూ , నా కటాక్షాన్నిపొందాలని స్కెచ్ వేసింది. మొదటి రోజూ ప్లాన్ బాగానే వర్క్ అయింది, బావా ఈ రోజూ పూజ చేశా , ప్రసాదం తీస్కో అంది. ఫోన్ లో ప్రసాదమేంటే నీ మొహం అంటూ నేను అనేసరికి , నిజమే బావోయ్ అంటూ నాలుక కరుచుకుంది . తర్వాత రోజూ, పొద్దున్నే లేవంగానే ఇడ్లీ లు తినే బుజ్జి గుడ్లు తేలేసింది . అయినా నిగ్రహించుకుని రెండోరోజు పూజ మొదలెట్టింది , ఏ రోజూ లేనిది మా బుజ్జి పొద్దు పొద్దున్నే కాల్ చేసింది ,' ఏంటి రా చెప్పు ?'అన్నాను , 'బావా పూజ' అంది , 'నిన్న చేసావ్ గా' . నేను అడిగా, 'ఈ రోజూ చేశా ' తను అంది , ఎన్ని రోజుల ప్లాన్ అన్నాను , 'తొమ్మిది' .రిప్లై కి నా కళ్ళు ఒక్క సారి బ్లింక్ అయ్యాయి , నేను షాక్ అవ్వటం లో తప్పులేదు , ఎందుకంటే మా బుజ్జి వాళ్ళమ్మ చేసే పూజ దగ్గర కూర్చుంది అంటే దానికి రెండే కారణాలు 1 . ప్రసాదం బాగా తినొచ్చు 2 . ఆ రోజూ కాలేజీ డుమ్మా కొట్టెయ్యవచ్చు . అలాంటిది ఈ రోజూ కూడా పూజ చేసిందంటే ., సమ్ థింగ్ ఈస్ రాంగ్ , సరే ఏం కోరుకున్నావే బుజ్జి అని అడిగా, దేవుడికి చెప్పినవి బయట చెప్పకూడదు బావా అని తప్పించేసుకుంది . కానీ పాపం గొంతు మరీ నీరసించి పోయింది. మద్యాహ్నం లంచ్ టైం లో తను మరోసారి గుర్తొచ్చింది. బుజ్జి భోజనం చేశావా , కాల్ చేశా , మాములుగా అయితే అరిసిందో పిలిచిందో కూడా తేడా తెలితని విధం గా మాట్లాడే మా బుజ్జి లేదు బావా అని చిన్న గా ఆన్సర్ ఇచ్చింది . నాకు మాత్రం తను అలా నీరసించి పోవటం అస్సలు నచ్చలేదు . బుజ్జీ నీకు తొమ్మిది రోజులూ ఏమీ తినకుండా ఇంత నిష్టగా ఉపవాసం చెయ్యమని ఎవరు చెప్పారు అని అడిగా, మా ఇంటి పక్క గుళ్ళో పూజారి గారు బావా అని చెప్పింది . పూజ చెయ్యమన్నారు , ఉపవాసం వుంటే మరీ మంచిది అని చెప్పారు . కానీ రెండు రోజులకే నేను తోట కూర కాడ లా నీరసించి పోయాను అంది. మా బుజ్జి కి జ్ఞాన భిక్ష పెట్టటానికి ఇదే సరైన టైం అనుకున్నా . అందుకే ఇక ఆలశ్యం చెయ్యకుండా క్లాసు మొదలెట్టేసా , చూడు బుజ్జీ పూజ చెయ్యటం వరకూ మాత్రమే మన వంతు , అలా అని పూజ చేసిన ప్రతీ రోజూ ఉపవాసం వుండాలి అంటే అదీ కానిపని . అందుకోసం పూజ చెయ్యి , దాంతో పాటూ టైం కి భోంచెయ్యి అని చెప్పా. మా బుజ్జి కి కొద్ది పాటి జ్ఞాన భిక్ష కలిగింది , కానీ ఉపవాసం మాననంటోంది . నాకు తెలుసు తన మనస్తత్వం , పట్టు వదలని విక్రమార్కుడు వాళ్ళ కజిన్ అన్నట్టీ వ్యవహరిస్తుంది. ఆ టైం లోనే నా మెదడు పాదరసంలా పనిచేసింది . సో బుజ్జి నీరసించ కుండా వుండాలంటే తినాలి . అయితే బయట పదార్ధాలు తినకూడదు కానీ ప్రసాదం తినొచ్చు . ఇది పూజ చట్టం లో నాకు తెలిసిన గొప్ప లొసుగు. ఇది మా బుజ్జి కి చెప్పా . అబ్బో తన బాద ఇంత త్వరగా తీరిపోతుందని ఆమె అస్సలు ఊహించి వుండదు. నేను చెప్పిన మాటని తు, చ తప్పకుండ పాటించే మా బుజ్జి దీన్ని మాత్రం రెండు రెట్లు ఎక్కువ శ్రద్ధ తో చేసింది , ఫలితం గా ప్రసాదాన్ని టిఫిన్ గా మార్చేసుకుంది , నీరసాన్ని జయించింది పూజని పూర్తి చేసింది . ఏదో ఒలింపిక్ పతకం సాధించినంత అందం తో బావా నేను పూజ పూర్తి చేసానోచ్చ్ అంది. బుజ్జమ్మా! ప్రసాదమైనా , టిఫిన్ అయినా ,ఏది ఏమయినా తినటం తినటమే అని హిత బోధ చేద్దుల్లోకి , ఇది తొండి ఆట నేనొప్పుకోను అంటూ నాపై కోపం తో ఊగిపోయింది . హా అయినా మాకివేం కొత్త కాదు , అలకలు , గిల్లి కజ్జాలు టైం లో కూడా మా బుజ్జి భలే వుంటుంది.

Monday, October 18, 2010

అతడు - ఆమె ..














తొలిపొద్దు కోసం వేవేల కళ్ళతో ఎదురు చూసిన ఆమె కు కల నిజమవుతోంది.తూరుపున అరుణ కిరణాలు  చాలా సున్నితం గా ధరణి సోకుల్ని ముద్దాడుతున్నాయి . ప్రియుని స్పర్శ తో పులకరించిన పుడమి మంచు చీరని కొద్ది కొద్దిగా జారవిడుస్తూ ,తన సోకుల్ని కొంటెగా చూస్తున్న భానున్ని రమ్మంటూ సైగ చేసింది.
భానుడి బుగ్గలు సిగ్గుల మొగ్గలవుతున్నాయి. ధరిత్రి అణువణువూ పులకరిస్తోంది. రాత్రి తాలూకు విరహాన్ని ఒకే ముద్దు తో చెరిపేస్తున్నాడు అతడు.గత కాలపు విరహపు చీకట్లు మచ్చుకైనా కనిపించటంలేదు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
గత రాత్ర్హి అతగాడు అటుగా వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగిన విషయాల్ని అతని కౌగిలి నుంచి వీడకుండానే నెమ్మదిగా అతని చెవిలో ఆమె చేరవేసింది .అతనూ అంతే అటుగా వెళ్లి, ఆమె ను గుర్తు చేసుకున్న క్షణాల్ని గంటల్లో చెప్తూ , అటుగా వచ్చిన మబ్బులచాటున దోబూచులాడుతూ, ఆమె లో కలిగే కలవరింతను ఓరకంట కనిపెడుతున్నాడు .అప్పటివరకూ నవ్వుతూ వున్న నెచ్చెలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది, నగుమోము చిన్నబోతూ వుంది.
కనులిప్తపాటులో కనపడకుండా పోయిన ప్రియున్ని చూడటానికి ఆమె మరీ కలవరించి పోతుంది.కనురెప్పల మాటున కమ్మని స్వప్నం కలలా కరిగిపోతున్నదుకు  కనుగంగ కడలయ్యేందుకు సిద్దమవుతోంది.ఆ విరహం అతన్నీ బాధించిందో ,జవరాలి కంట కన్నీరు అతని గుండెనుబికిందో,లేక ఇక చాలులే సరసం అనుకున్నాడో ఏమో వెంటనే వచ్చి ఆమె చెయ్యినందుకున్నాడతడు.
ఆమె అతన్ని చూడగానే ఒక్కసారిగా  వచ్చి  గట్టిగా హత్తుకుని , తన కౌగిలి లో ఐక్యం అయిపోతుంది అనుకున్నాడతడు. కానీ అలా జరగలేదు . ఆమె ఇంకా అల్లంత దూరాన్నే వుంది . చిత్రం.., ఆమె ముఖం కోమలత్వాన్ని వీడి కోపంతో ఎరుపెక్కిపోయింది.

"అదికాదురా జననీ , నా బుజ్జివి కదూ , నా చిట్టివి కదూ, ఏదో తమాషాకి, సరదాగా కాసేపు ఆటపట్టిద్దామని , అలా మరీ చిన్నపిల్ల లా , ప్రతీ చిన్న విషయానికి అలగకురా బంగారం.." అంటూ ఏదో చెప్పబోతున్నాడతడు. నీ సంజాయిషీ నాకేం అక్కర్లేదు అన్నట్టు గా సూటిగా అతనికల్లలోకి చూసిందామె. అంతే సూడ సక్కని సూరీడు సిన్నబోయాడు. బింకం గా చూసే అతగాడు బిక్కమొహమేసాడు. ఏంటో అనుకున్నాడు గానీ  ఆడాళ్ళ కళ్ళలోకి సూటిగా సూడటం కష్టమే .అతగాడికీ ఇప్పుడే అర్ధమయ్యింది పాపం.
 ఇరువురి మద్యా మౌనాన్ని చేదిస్తూ ఆమె మాట్లాడుతోంది, అతను గమనిస్తున్నాడు. ఆమె గొంతు కోపం గా లేదు , అలా అని లాలన గానూ లేదు , చాలా ఆర్ద్రం గా ఉంది."సరదాకైనా మన మద్య ఎడబాటు కలిగించే పనులు ఏమీ  చెయ్యవు కదూ " అంటూ వేడుకోలు గా అడుగుతోంది. చిన్నగా ఓ చిరునవ్వాడు అతడు.చెలిగాడికి తన భావం అర్ధమయ్యిందన్నసంతోషమో , లేక అతగాడు ఇప్పటికీ కవ్విస్తూ నవ్వుతున్నాడనే ఉడుకుబోతుతనమో తెలీదు కానీ,
 ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. అతని గుండె ఆమె భావానికి  భాష్యం చెప్పలేనంటోంది . ఆమె కంట పొంగిన గంగ , ఇతని గుండె పొరలకి గండి కొట్టి మనసు సంద్రాన్ని చేరుతోంది.ఇతని కంట చెలమలో కూడా కమ్మని మదురామృతం ఉబికి వస్తోంది. ఒక్క ఆలింగనం తనువుల దూరాన్ని తగ్గించి మనసుల బంధాన్ని మరింత పెంచేది నిజమే అయితే అతడు అదే చేస్తున్నాడు . ఆప్యాయం గా దరిచేరిన కోమలి కన్నీటిని తుడుస్తూ , ఆమె తో అతడు పలికిన ఒకే మాట .. "నువ్వలా ఏడుస్తాననంటే నేను వెళ్లి పోతాను .నేనుండగ నీకంట నీరు నే చూడబోను , చూసినా తట్టుకోలేను ., ఏం చెయ్యమంటావ్ ? వెల్లి  పోనా..?".
 వెళ్లి పోతాను ..అనే మాట అతని నోట వినటమే ఇష్టం  లేనట్టు , అతని మాటలు ఇంకా పూర్తి కాకుండానే ఆమె చేతిని అతని నోటికి అడ్డుగా నిలిపింది.అతనుండగా ఎప్పుడూ ఏడవకూడదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది . అతగాని వెచ్చని కౌగిలి లో ఆమె ఒదిగిపోయింది. అమ్మలా లాలిస్తున్న అతని ఒడిలో ఆమె పసిపాపలా నిదుర పోతుంది.ఈ క్షణం అతడి కోరిక "ఆమెనెప్పుడూ  ఇంతే భద్రం గా , సంతోషం గా , తన కంటి రెప్పలా కాపాడాలి, తన గుండెచప్పుడు అతని  గుండె తో వినాలి ." మరి ఆమె కోరిక ?
" ఎప్పటికీ కాలం ఇలానే నిలిచిపోవాలి , అతని సాంగత్యం లో ,వసి వాడని వసంతం తన వాకిట్లో ఎప్పుడూ వెళ్లి విరియాలి ."  .

 "నీకేం కావాలో కోరుకో ఒక్క మా ప్రేమ తప్ప___" అంటూ  వాళ్ళిద్దరూ ఇప్పుడు దేవుడికైనా వరమిస్తారు  (1)

పూలు +మొగ్గలు = నీ పెదవులు ..







మొగ్గలు  పువ్వుల్లా విచ్చుకో గలవు ,
పువ్వులు  మొగ్గల్లా  ముడుచుకోలేవు ..
నీ  పెదవులు  మాత్రం,
మొగ్గల్లా  ముడుచుకో  గలవు,
పువ్వుల్లా విచ్చుకోనూ గలవు,
అందుకే
నీ  పెదాలంటే  నాకిష్టం  ..


(T1 / V)