Thursday, January 27, 2011

ఆడ వాళ్ళు వండిన వంటలు ఎప్పుడూ బాగుండవు . (వంటింటి చిట్కా .. మగాళ్ళకు ప్రత్యేకం .. )

మా పాకశాల ( ప్రయోగశాల )..
( భారత దేశానికి స్వతంత్రం వచ్చింది అని నేను ఎక్కువ గా నమ్మేది నేను మా కిచెన్ లో ఉన్నప్పుడే )

ఆడవారు మగవారికి వంటల్లో ఏ మూల కూడా సరిరారని ,
పురాణాల్లో నలుడు , భీముడు, మా ఊళ్ళో వంటల నాగరాజు , మన బ్లాగుల్లో చుంబరస్కా మంచు గారు, ప్రస్తుతం నేను , ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే పెపంచం లో వంటలు చేసే ఆడవాళ్ళతో పోలిస్తే, మేమే ఎక్కువ ఉంటాం. బాగా వండుతాం . అనీ మా ట్రైనీ స్టూడెంటుకి నేను చేసిన హితబోధ సారాంశం .



ఆరు అవ్వగానే కిచెన్ లో మా __మూక చొరబడింది.
మా కిచెన్ లో చెఫ్ కంటే ట్రైనీ చెఫ్ లకే స్వేచ్చ ఎక్కువ ..

చెఫ్ చెయ్యాలనుకున్న ఏ వంటకాన్నీ మా కిచెన్ లో తన ఇష్టానుసారం చెయ్యలేడు. ఎందుకంటే ఆ వంటకానికి మద్య మద్య లో జూనియర్ చెఫ్ ల ఇష్టాలూ , కొన్ని కొన్ని పదార్ధాలూ తోడవుతూ ఉంటాయి .

సింపుల్ గా చెప్పేదేంటంటే  .. చెఫ్ చేద్దామనుకున్న వంటకానికీ , చివర వచ్చే వంటకానికీ అసలు పొంతనే ఉండదు ..

మా బాషలో చెప్పాలంటే మాది కిచెన్ కాదు .. ఓ ప్రయోగశాల ..

కొత్తకొత్త వంటలకు మేము ఇక్కడ ప్రాణం పోస్తాం , కొత్త కొత్త చెఫ్ లను తయారు చేస్తాం .. ,

ఆడవాళ్ళకంటే మగ వాళ్ళే అన్ని విషయాల్లో గ్రేటని,
వంట గురించి కనీసం అ,ఆ,ఇ,ఈ లు కూడా తెలియని మగవాడు ఎవడైనా ఉంది ఉంటే వాడు ఆడవాళ్ళు వండిన వంటను పొగడటం తప్ప వేరే ఏమీ చెయ్యలేడని మా గట్టి నమ్మకం ..

అందుకే మా గెస్ట్ హౌస్ లో ఉండే వాల్లందరికీ సంపూర్ణ వ్యాకరణ సహిత వంటలు నేర్పుతాం.


మా ప్రయోగశాల కొన్ని ప్రాధమిక సూత్రాలకి , కొన్ని నియమ నిబందనలకి కట్టుబడి పని చేస్తుంది ..

ప్రతీ ఒక్కరు చెయ్యాల్సిన ప్రతిజ్ఞ..

  • భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు .
  • వంటలు తెలిసన మగవాళ్ళందరూ గొప్పవాళ్ళు , తెలివైన వాళ్ళు . మేధాశక్తి , సృజనాత్మకత మెండుగా ఉన్నవాళ్ళు .
  • మనం వండిందే వంట, వచ్చిందే టేస్టు.
  • ఆయుధాల వాడుకను ( కుక్కరు , మిక్సీ , గేస్, కత్తి .. మొదలైనవి ) పొదుపుగా , సమర్దవంతం గా వాడతాను .
  • వంట ఏ స్తితి లో ఉన్నా ఆత్మ స్థైర్యాన్ని కొల్పోను.
  • ఒక వేళ వంట చేజారే స్తితిలో ఉంటే , నా అసామాన్య ప్రతిభా పాటవాలను ఉపయోగించి నా ప్రయోగాల ద్వారా కొత్త వంటకానికి ప్రాణం పోస్తాను

మా ప్రయోగశాలలో ప్ర్రయోగాలే కాదు , వైవా కూడా ఉంటుంది .

అప్పుడప్పుడూ నాలెడ్జ్ షేరింగ్ కోసం గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి .
(అంటే పిచ్చాపాటి కబుర్లు కాదు )


ఒకానొక డిస్కషన్ లో నాకు మా సీనియర్ చెఫ్ చెప్పిన సత్యం ఏందయ్యా అంటే ..

  • రెండూ ఉడికినవే అయితే వంటచేసేప్పుడు ఏ పదార్దాన్నైనా , ఏ పదార్ధం తోనైనా కలపవచ్చు.
  • మిక్సీ పట్టుకున్నవాడే మహరాజు.. వంట అటూ ఇటు అయిన పక్షం లో మసాలాను మిక్సించి, వంటలపై దట్టించి , వారి చేత మసాల జిందాబాద్ అని చెప్పించవచ్చు.


(ఈ మద్య కుక్కర్ ఉన్నవాడే కింగు అనే మంచన్న సూత్రాన్ని కూడా, మా ప్రాధమిక సూత్రాల జాబితాలో చొప్పించాం )


ఏదైనా పనిని సక్రమం గా చెయ్యాలంటే , ముందు ఆ పని పై ఉన్న అపోహలు పోవాలి . లెర్నర్లందరికీ డౌటులు, అపోహలు క్లియర్ చెయ్యటం కోసం సండే,సండే సీనియర్లచే స్పెషల్ క్లాసులు కూడా నిర్వహించ బడును

సండే క్లాసు లో మా ట్రైనీ ఒక అబ్బాయి నన్ను అడిగిన ప్రశ్న ..

" ఆడ వాళ్ళు వండిన వంటలు చాలా బావుంటాయి కదా , ఏ వంట తిన్నా అమ్మ చేతి వంట రుచి రాదు కదా ! , మరెప్పటికీ వాళ్ళను మించి మనం వంట రుచిగా చెయ్యలేమా ?"

వాడి అవివేకానికి ఫకాలున నవ్వాను ..

జూనియర్ల సందేహాలు నివృత్తి చెయ్యటం సీనియర్ల భాద్యత కాబట్టి ,వాడికి సమాధానం చెప్పటం మొదలెట్టాను ..

"జూనియర్ గా నీ ప్రశ్న మంచిదే ..
ఈ ప్రశ్న, నీ పరిపక్వత చెందని మెదడు కి నిదర్శనం ..
ఈ ప్రశ్న, నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం ..
ఈ ప్రశ్న, నీకు ప్రపంచ జ్ఞానం అస్సలు లేదు అనేదానికి నిదర్శనం ..
ఈ ప్రశ్న, నీ .......

(అనవసరం గా వీడిని ప్రశ్న అడిగాను , బుర్రతినేస్తున్నాడు అన్నట్లు వాడు చూసినట్లు నాకు అనిపించింది )

సమాధానం చెప్పటం, నీ డౌటు క్లేరిఫై చెయ్యటం నీ సీనియర్ గా నా వృత్తి ధర్మం కాబట్టి చెప్తా , గుర్తుపెట్టుకో ,

"ఆడ వాళ్ళు వండిన వంటలు చాలా బావుంటాయి కదా !.. " అంటే,
కాదు.. ఆడ వాళ్ళు వండిన వంటలు ఎప్పుడూ బావుండవు.

(ఇక్కడ నా ఉద్దేశ్యం ఎప్పుడూ బావుండవు , అప్పుడప్పుడూ మాత్రమే బావుంటాయి అని )


"
" ఏ వంట తిన్నా అమ్మ చేతి వంట రుచి రాదు కదా ! " అంటే

రాదు .. నిజమే ఏ వంట తిన్నా అమ్మ చేతి రుచి రాదు .
అక్కడ గొప్పదనం వంటది కాదు . అమ్మది,అమ్మ చేతిది .
అమ్మ కూడా ఒక్కోసారి వంటను అటూ ఇటుగా చేస్తుంది . కానీ మనకెప్పుడూ "అమ్మ చేతి వంట అమృత తుల్యమే". ఎందుకంటే మనకు అమ్మమీద ఉన్న ప్రేమ,అది ఆమె చేసిన ఆర్డినరీ వంటకు కూడా ఎక్స్ట్రార్డినరీ టేస్టు ని తెచ్చిపెడుతుంది ..

ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే "అమ్మ చేతి వంట అమృత తుల్యం గా మారటానికి కారణం , వంట కాదు ..

ప్రేమ .. అమ్మ పై నీకున్న ప్రేమ ..


రేపట్నుంచీ నన్ను ప్రేమించు .. నా వంట కూడా నీకు అమృత తుల్యం గా మారుతుంది " అన్నాను .

Friday, January 14, 2011

ఒక కోడి కథ .. ( సంక్రాంతి స్పెషల్ , కోడి పందెం )..

ఒక కోడి కథ ..



(మొదటి భాగం తరువాయి ..)


పందానికి రంగం సిద్దమైంది . చుట్టూరా జనం కేరింతలు కొడుతున్నారు .ఒంటి నిండా గాయాలున్నా మా ఈరభద్రం గాడు, సమరానికి కాలు దువ్వుతున్నాడు .కన్నార్పని ఈరబాబు కసి తో కోపం తో భద్రం కాలికి కట్టి కట్టాడు. రెండు కోళ్ళ రక్తం చిందిన నేల పై , వాటి ప్రాణాలు గాలి లో కలిపేసిన మృత్యువు , ఈ సారి ఎవర్ని ముద్దాడ బోతుంది ?


మొదటి రౌండ్ :

నోటితో నీళ్ళు తీసుకుని భద్రంగాడి నోటిలోనూ ,మొహం పైనా ఊదుతున్నాడు మా ఈరబాబు .

మొదటి విజిల్ వినపడింది . మధ్యవర్తి పచ్చ జెండా ఊపుతున్నాడు .


ఈరబాబు ఈరభద్రాన్ని కిందికి దించాడు .


ఎదురుగా ఎవరున్నా లెక్కచెయ్యనన్నట్టు,బెరుకు లేకుండా చూస్తున్నాడు ఈరభద్రం .


మా పుంజు ఇంకా సిద్దం కాలేదు, ఒక అయిదు నిమిషాలు టైం కావాలి అని అవతల వైపు వాళ్ళు అడిగారు.



క్రాసు విజులు మోగింది .

"మొదటి రౌండు ఇంకా మొదలు కావటానికి ఇంకా 5 నిమిషాల సమయముంది" అని ప్రకటించాడు మధ్యవర్తి.


“కేశవా ,, ఏంట్రా ఈ తిరకాసు ? , ఆళ్ళ కోడిని ఇప్పటిదాకా ఇక్కడే దున్న పోతును మేపినట్టు మేపారు కదా ? కత్తి కూడా కట్టారు . మళ్ళీ ఇప్పుడేమైంది ఈల్లకి , పుంజు సిద్దం గా లేదంటారేంట్రా ?” అని నన్ను అడిగాడు గంగరాజు .


“ ఇలాంటి పందాల్లో బరిలో దిగేదాకా పోటీదారులెవ్వరో ? ,బరిలో దిగాక గెలుపెవరిదో చెప్పటం చాలా కష్టం .”


ఈరబాబు ఈరభద్రాన్ని సేతిలోకి తీస్కోబోయాడు .


ఉన్నట్టుండి ఈరభద్రం తూలి పడ్డాడు.

అది సూసిన అవతలి వైపు వాళ్ళు క్రాస్ బెట్టింగ్ మొదలెట్టారు .



ఒకటికి పాతిక , ఒకటికి పాతిక , 1 X 25 అంటూ అరుస్తున్నారు .


ఈరబాబుగాడి కోడి ఈరభద్రం కళ్ళు తెలేసేస్తుంది.

అప్పటిదాకా కోపం తో ఎర్రబడ్డ ఈరబాబు గాడి కళ్ళు సన్నగా వర్షిత్తున్నాయి .


"ఒరేయ్ భద్రం , లేరా , లే రా, ఏమైంది రా ? , ఇద్దరం ఫ్రెండ్స్ కదరా ,చూడరా .. ,కేశవా నువ్వైనా మాట్లాడించరా.." అంటూ ఏడవటం మొదలెట్టాడు.


మా ఈరబాబు గాడు ఇంతలా ఏడవటం ఇదే మొదటి సారి.


అప్పుడే వచ్చిన మా సూరయ్య మామ ఈరభద్రం గాడిని ఆయన సేతుల్లోకి తీస్కున్నాడు.
కోడిపుంజు నోట్లో నీళ్ళు కొట్టి మెడకింద మెల్లగా కొడుతూ తెమడ తీసాడు. రెండే నిమిషాల్లో ఈరభద్రం గాడు మామూలుగా నిలబడ్డాడు .


అప్పుడే ఒక కారులోంచి మీసాలాయన ఒక పోతులాంటి కోడిని తెచ్చి , కత్తి కట్టి బరి లో పెట్టేడు .
కోడి పులిలా ఉంది , చూపు మరీ రాక్షసం గా కనిపిస్తుంది. చాలా మొండిగా నిలబడి ఉంది .


"వద్దు నాన్నా. ఈడికేమైనా అయితే ఎలా నాన్నా ? ఎల్లి పోదాం " అని ఈరబాబు మా సూరయ్యమాయ తో అన్నాడు .


“ఈరోజు మనది. గెలుపు మన వైపుంది.

నీకు తెలియ కుండానే గెలవటానికి కావాల్సిన ధైర్యాన్ని ఆడికి అందించావు.

మనం దెబ్బ తగిలిన కోడిని పట్టుకుని మనసులో ఏం సెప్తామో , ఏమనుకుంటామో అదే ఖచ్చితం గా జరుగుతుంది .అలాంటప్పుడు పుంజు సావును కాదు,అలాంటి ఊహనే మనసులోకి రానివ్వదు.

నీ ఆలోచనే దాని ఆలోచన . దాని గెలుపే నీ గెలుపు,

ధైర్యం గా ఉండు. ఇయ్యాల ఈరభద్రానికి ఎదురు లేదు, ఈడే ఈరుడు.ఈడికేమీ కాదు."
అని మా సూరయ్య మామ ఈరబాబు తో అన్నాడు.


మధ్యవర్తి ఈల వేసి, మళ్ళీ పచ్చ జెండా ఊపాడు.


సూరయ్య మామ మాటలతో మా వాళ్ళలో మళ్ళీ ఉత్సాహం వచ్చింది .

పందెం మొదలయ్యింది.


కేకలు , ఈలలు , అరుపులతో మొత్తానికి కొబ్బరితోట కోళ్ళమహాసంగ్రామానికి వేదికగా మారిపోయింది .

మీసాలాయన, మామ ఇద్దరూ పుంజుల్నివెనక్కీ ముందుకీ ఒకదానికొకటి చూపించి రణస్థలి లో వదిలేసారు .




అర వీరభయంకరం గా ఆ పుంజు భద్రం మీదికి దూకింది. కనురెప్ప వేసే టైం లో భద్రం తప్పించేసుకున్నాడు.
కానీ పాత గాయం కదిలి రక్తం కారుతోంది.అయినా భద్రం చూపుల్లో ఏమాత్రం బెరుకు కనిపించట్లేదు .


మళ్ళీ అదే దెబ్బకి మీసాలాయన పుంజు ప్రయత్నించింది,

ఈరబాబు గాడి పుంజు ఈసారి తొందర పడలేదు. ఆ పుంజు మీదికొస్తున్న సమయం లో అమాంతం గాల్లోకి లేచింది. మీసాలాయన పుంజు అదుపుతప్పి ఆయన కాళ్ళ దగ్గరే పడబోయింది .

తెల్లగా మెరిసే భద్రంగాడి కాలి గోరు , కత్తి ఆడిరక్తం తో ఎర్రరంగు లోకి మారిపోయాయి .


ఈరభద్రం, మీసాలాయన పుంజు ఒకేసారి గాల్లోకి లేసాయి.
గంగా గాల్లోకి లేసిన ఎంటనే భద్రం గాడు కింద ల్యాండ్ అయ్యాడు.
మీసాలాయన పుంజు తూలుతూ ల్యాండ్ అయ్యింది.

తీరా సూద్దుల్లోకి దాని పొట్ట పై అంగుళం మందాన గాయం రక్తాన్ని సిందిత్తూ ఉంది .

రెండు పుంజుల రక్తం తో కొబ్బరి తోట మద్య ఉన్న పచ్చని గడ్డి కూడా ఎర్ర రంగులోకి మారి పోయింది .

ఈసారి బరువు తక్కువ భద్రం గాడు ( ఎదురుగా ఉన్న దానితో పోలిస్తే ) గాల్లోకి ఎగిరినట్లే ఎగిరి పరావలయ మార్గం లో మావైపు నేలను తన్నాడు.

అటు సూత్తే తల మొండెం వేరై ,మీసాలాయన పుంజు విగత జీవి అయి మృత్యుఒడికి సేరుకుంది.



ఒరేయ్ గంగా , కేశవా .. మన ఈర భద్రం గాడు మూడో పందెం కూడా నేగ్గేసేడ్రా సంతోషం తో వచ్చి నా గుండెలపై వాలిపోయాడు మా ఈరబాబు.

__________________________________________________________________________
చంద్రమ్మత్తా , మా మావయ్య ఎక్కడ ? అనే నా మాట పూర్తి కానేలేదు , ఏరా కేశవా ఎప్పుడొచ్చావ్ ? అంటూ మా ఈరబాబు గాడు వచ్చేడు.

“ఈరభద్రం గాడికి దెబ్బలు తగిలాయికదా , ఇండీషను సేయించటానికి మీ మావయ్య ఆసపట్లదాకా ఎల్లేరు ” అంది మా అత్తమ్మ ...

Tuesday, January 11, 2011

ఒక కోడి కథ .. ( సంక్రాంతి స్పెషల్ , కోడి పందెం )..

ఒక కోడి కథ ..


 ఒరేయ్ కేశవా ..
మన భద్రం గాడిని , గోదారి ఆతల మల్లేశ్వరం లో జరుగుతున్న కోడి పందానికి తీసుకెళ్ళాను రా అన్నాడు మా ఈ(వీ)ర బాబు.

పందెం మొత్తం అయ్యేదాకా నిలబడ్డాడా , ఓ పెగ్గేసి సిందులు తొక్కేత్తా ఏ సెట్టు సాటునో సాపేసి పడుకున్నాడా ? అని అడిగాను.

భద్రం గాడంటే పేకాటభద్రం గాడు కాదెహే, మా ఈరభద్రం గాడు రా అన్నాడు ఈరబాబు.
" మీ ఈర భద్రమా ? ఎవడాడు ?

నాకు మనూళ్ళో ఈరభద్రం అంటే ఆ కిళ్ళీబడ్డీ భద్రంగాడు , పేకాటభద్రం గాడు ఈల్లిద్దరే తెలుసు.
ఈ మూడో భద్రమెవడు? "అని అడిగాను .

అదేరా మా ఈరుడు రా , మా పుంజుగాడు రా అన్నాడు .

ఈడికి కోళ్ళపిచ్చి బాగా ముదిరి పోయింది అనుకున్నాను.

ఏరా కేజీ కండ కూడా లేని నీ బక్క కోడికి " ఈర భద్రం " అని పేరు పెట్టాలి అని అవుడియా నీకు ఎలా వచ్చిందిరా అని అడిగేను .

ఏంట్రా కేశవా నువ్వు కూడా అలా అడుగుతావు .

మన పెసిరెంటు గోరు ఆల్ల కుక్కకి "పాప" అని పేరెట్టి , ఊరంతా ఇనిపించేలా పాపా, పాపా అని గొంతు సించుకు అరిసేత్తుంటే అది లగెత్తుకెల్లి ఆయన మీదకి దూకేత్తుంది.

అది సూసిన మన ఊరోళ్ళు, ఎంత సంబరంపడి పోతున్నారు ? . ఆయన గోరు ఎన్ని ముసి ముసి నవ్వులు నవ్వేత్తున్నారు ? నీకు తెలియనిదేంట్రా అన్నాడు.

బాబూ ఈరబాబు , మన పెసిరెంటు కుక్క పేరు " పాప " కాదు బాబు , పప్పీ అని నేను సెప్పేను .

పప్పో , ఉప్పో నాకు తెలీదు రా , ఆయన ఆళ్ళ కుక్కకి పాప అని పెరేట్టేడు.

అసలు ఆల్ల ఈది కుక్కల్ని సూత్తేనే బెయం తో లగెత్తుకెళ్ళి మంచం కింద దూరేసే ఆ కుక్కకే ఆయన పేరెడితే ,

నలుగురులోనూ ఈరుడి లా పోరాడే నా కోడికి "ఈరభద్రం" అని పేరెడితే తప్పేంటి రా ? అన్నాడు.

ఈడి లాజిక్కేంటో నాకు అర్ధం కాలేదు .

ఈడు ఈడి కోడిని, ఈడిని పల్నాటిబ్రహ్మనాయుడు రేంజ్ లో ఊహించుకుంటున్నాడు అని నాకు అనిపించింది.

సర్లేరా బాబు .. నీ ఈరభద్రం గాడే , నీ కిలో కోడే, ఆడిని మల్లేశ్వరం తీసుకెళ్ళావు. సెప్పు ఇప్పుడేమైంది ఆడికి ? అని అడిగాను నేను.


ఆడికి ఏమన్నా అవ్వటం ఏంట్రా ? , మల్లేసరం లో మా భద్రం గాడు పందెం నేగ్గేడు రా .. అని ఈరబాబు అన్నాడు.

కిలో కోడి పందెం కొట్టేసిందా ?, అదీ గోదారాతల ? నిజమేనా ?, నాకు నమ్మ సఖ్యం గా లేదు .
ఒరేయ్ నిజమేనా ? అని అడుగుదాం అనుకున్నాను . కానీ ఆడి కళ్ళలో ఆనందం సూసాకా నిజమే అనిచింది .

ఎక్కడ్రా నీ ఈరుడు భద్రం గాడు ? అన్నాను .

"మా నాన్న , ఆ(కో)డి దెబ్బలను కుట్టి కారం సల్లుతున్నాడు. ఎల్దాం నడువు "అన్నాడు రెట్టించిన ఆనందంతో.

భద్రం గాడి ఇంటికెల్లుదుల్లోకి సూరయ్య మామ ( భద్రం గాడి నాన్న ) కోడికి ఉల్లిపాయలు పెడుతూ , తల నిమురుతున్నాడు.

కోడిని సూసాక నా నోటి మాట పెగలట్లేదు . నెలకిందటే దాన్ని సూసాను . కిలో బరువు కూడా లేదు. ఇప్పుడు సూత్తే మూడు కిలోల బరువు పైనే ఉంటుంది. తండ్రీ కొడుకులిద్దరూ కోడిని సేలా బలిష్టం గా తయారు సేసేరు.

కేశవా, ఈ గారెలు తిను . అంటూ ప్లేట్లో గారెలట్టుకొచ్చింది చంద్రమ్మ అత్త. అప్పటికే మా ఇంట్లో నా కోటా అయిపోయింది .

తినేసొచ్చాను, తినను అన్న పదాలు నోటినుంచి రాగానే , సూరయ్య మామ తిట్టటం మొదలెడతాడు . ఆయన తిట్టి అయినా తినిపించే రకం. అందుకే మెల్లగా ప్లేటు పట్టుకున్నాను.

మామ, అత్త ఇద్దరూ సేలా మంచోళ్ళు .సేలా మనసున్నోల్లు . ఎవరికీ అపకారమే సేసి ఎరగరు. మా మిత్రులందరినీ సేలా బాగా సూస్కుంటారు.

మా అత్తా మామలకి పెళ్ళైన సేన్నాల్ల వరకూ పిల్లల్లేరట.
పిల్లల్లేరని మా అత్త బాధ పడుతుంటే , మా మావయ్య కొన్ని కోడి పిల్లల్ని తెచ్చి , ఇవే నీ పిల్లలు అన్నాడట.

అప్పట్నుంచీ అత్తయ్య ఆ పిల్లలకి తల్లి అయిపోయింది . సేనా పేనం గా పెంచటం మొదలెట్టింది. తర్వాత మా ఈరబాబు పుట్టేడు. మా ఈరబాబు కూడా ఆ కోళ్ళని సేనా బాగా సూస్కుంటాడు. సిన్నప్పట్నుంచీ ఆడితో ఆడుతూ , ఆడికి ఒంటరి తనమంటే ఏంటో తెలియకుండా పెంచిన నేస్తాలు కదా..!

ఆడికి మేమెంతో ఆ కోళ్ళూ అంతే .

కోళ్ళ కి మేత వెయ్యాలి , నీళ్ళు పెట్టాలి , ఇంటి పని వంట పని సూస్కోవాలి .. ఇలా మా చంద్రమ్మ అత్తకైతే క్షణం తీరిక ఉండదు.

చుట్టు పక్కల అమ్మలకు వాళ్ళ పిల్లలెవ్వరికీ అన్నం తినిపించటానికి ఎక్కువగా సమయం పట్టదు. ఎవరైనా పిల్లలు ఏడిస్తే చాలు , వాళ్ళమ్మ "బోబు చూద్దామా అమ్మా ?" అంటూ మా ఈరబాబు గాడి ఇంటికి తీసుకొచ్చేస్తుంది . నా బాల్యం కూడా ఆ కోళ్ళ మద్యనే చాలా సరదాగా గడిచిపోయింది.


సర్లే మామా సాయంత్రం వస్తాను , వెళ్ళొస్తా అత్తయ్యా అని చెప్పి నేను మా ఇంటికి వచ్చేసాను.

" ఒరేయ్ కేశవా , మన ఈరబాబు గాడి కోడి కొత్తపేట లో రెండు పందేలు నేగ్గేసింది రా , ఓ అరగంట లో మూడో పందేనికి సిద్దం అయి పోతున్నారు రా " అని మా గంగరాజు గాడు మద్దేనమేలకి ఫోను సేసేడు.


పలివెల నుంచి అడ్డ రూటు తీసుకుని , అరగంటలో కొత్తపేట సత్యచంద్ర థియేటర్ ఎనకాలున్న కొబ్బరితోటల్లో వాలి పోయేను.

మా ఈరబాబు గాడు మొహం ఎర్రబడి పోయి ఉంది. మొదటి పందెం నేగ్గేకా ఊరు వచ్చెత్తుంటే , రెండో పందానికి కొమరాజులంక వాళ్ళు అడిగేరట.

దానికి ఒప్పు కోక వచ్చేత్తున్న మా ఈరబాబు గాడిని పరుష పదాలతో ఆల్లంతా రెచ్చగొట్టేరట. ఈడు అసలే ఉడుకుమోతోడు. పందానికి సిద్ద పడ్డాడు. సూత్తానికి వచ్చిన డబ్బున్నోల్లు కొంతమంది వేలకు వేలు పందేలు కాసుకున్నారు.మాట కి మాట సమాధానం సెప్పటం సేతకాని మా ఈరబాబు , ఈడి కోడి వల్ల ఆళ్ళ నోళ్ళు మూయించేడు. కానీ ఈడి ఉడుకు మోతుతనమే ఈడి మూడో పందేనికి కూడా కారణం అయ్యింది.


(ఇంకా ఉంది ..)

Saturday, January 1, 2011

శుభాకాంక్షలు ..

మీ ఇంటిల్లిపాటికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

Wish U A Happy New Year..
 




Most of times we forget someone who made us smile, why can’t we sometimes forgive those who made us cry.

Life is short “FORGIVE & FORGET”