
ఒరేయ్ కేశవా ..
మన భద్రం గాడిని , గోదారి ఆతల మల్లేశ్వరం లో జరుగుతున్న కోడి పందానికి తీసుకెళ్ళాను రా అన్నాడు మా ఈ(వీ)ర బాబు.
భద్రం గాడంటే పేకాటభద్రం గాడు కాదెహే, మా ఈరభద్రం గాడు రా అన్నాడు ఈరబాబు.
నాకు మనూళ్ళో ఈరభద్రం అంటే ఆ కిళ్ళీబడ్డీ భద్రంగాడు , పేకాటభద్రం గాడు ఈల్లిద్దరే తెలుసు.
ఈ మూడో భద్రమెవడు? "అని అడిగాను .అదేరా మా ఈరుడు రా , మా పుంజుగాడు రా అన్నాడు .
ఈడికి కోళ్ళపిచ్చి బాగా ముదిరి పోయింది అనుకున్నాను.
ఏరా కేజీ కండ కూడా లేని నీ బక్క కోడికి " ఈర భద్రం " అని పేరు పెట్టాలి అని అవుడియా నీకు ఎలా వచ్చిందిరా అని అడిగేను .
ఏంట్రా కేశవా నువ్వు కూడా అలా అడుగుతావు .
మన పెసిరెంటు గోరు ఆల్ల కుక్కకి "పాప" అని పేరెట్టి , ఊరంతా ఇనిపించేలా పాపా, పాపా అని గొంతు సించుకు అరిసేత్తుంటే అది లగెత్తుకెల్లి ఆయన మీదకి దూకేత్తుంది.
అది సూసిన మన ఊరోళ్ళు, ఎంత సంబరంపడి పోతున్నారు ? . ఆయన గోరు ఎన్ని ముసి ముసి నవ్వులు నవ్వేత్తున్నారు ? నీకు తెలియనిదేంట్రా అన్నాడు.
బాబూ ఈరబాబు , మన పెసిరెంటు కుక్క పేరు " పాప " కాదు బాబు , పప్పీ అని నేను సెప్పేను .
పప్పో , ఉప్పో నాకు తెలీదు రా , ఆయన ఆళ్ళ కుక్కకి పాప అని పెరేట్టేడు.
అసలు ఆల్ల ఈది కుక్కల్ని సూత్తేనే బెయం తో లగెత్తుకెళ్ళి మంచం కింద దూరేసే ఆ కుక్కకే ఆయన పేరెడితే ,
నలుగురులోనూ ఈరుడి లా పోరాడే నా కోడికి "ఈరభద్రం" అని పేరెడితే తప్పేంటి రా ? అన్నాడు.
ఈడి లాజిక్కేంటో నాకు అర్ధం కాలేదు .
ఈడు ఈడి కోడిని, ఈడిని పల్నాటిబ్రహ్మనాయుడు రేంజ్ లో ఊహించుకుంటున్నాడు అని నాకు అనిపించింది.
సర్లేరా బాబు .. నీ ఈరభద్రం గాడే , నీ కిలో కోడే, ఆడిని మల్లేశ్వరం తీసుకెళ్ళావు. సెప్పు ఇప్పుడేమైంది ఆడికి ? అని అడిగాను నేను.
ఆడికి ఏమన్నా అవ్వటం ఏంట్రా ? , మల్లేసరం లో మా భద్రం గాడు పందెం నేగ్గేడు రా .. అని ఈరబాబు అన్నాడు.
కిలో కోడి పందెం కొట్టేసిందా ?, అదీ గోదారాతల ? నిజమేనా ?, నాకు నమ్మ సఖ్యం గా లేదు .
ఒరేయ్ నిజమేనా ? అని అడుగుదాం అనుకున్నాను . కానీ ఆడి కళ్ళలో ఆనందం సూసాకా నిజమే అనిచింది .
ఎక్కడ్రా నీ ఈరుడు భద్రం గాడు ? అన్నాను .
"మా నాన్న , ఆ(కో)డి దెబ్బలను కుట్టి కారం సల్లుతున్నాడు. ఎల్దాం నడువు "అన్నాడు రెట్టించిన ఆనందంతో.
భద్రం గాడి ఇంటికెల్లుదుల్లోకి సూరయ్య మామ ( భద్రం గాడి నాన్న ) కోడికి ఉల్లిపాయలు పెడుతూ , తల నిమురుతున్నాడు.
కోడిని సూసాక నా నోటి మాట పెగలట్లేదు . నెలకిందటే దాన్ని సూసాను . కిలో బరువు కూడా లేదు. ఇప్పుడు సూత్తే మూడు కిలోల బరువు పైనే ఉంటుంది. తండ్రీ కొడుకులిద్దరూ కోడిని సేలా బలిష్టం గా తయారు సేసేరు.
కేశవా, ఈ గారెలు తిను . అంటూ ప్లేట్లో గారెలట్టుకొచ్చింది చంద్రమ్మ అత్త. అప్పటికే మా ఇంట్లో నా కోటా అయిపోయింది .
తినేసొచ్చాను, తినను అన్న పదాలు నోటినుంచి రాగానే , సూరయ్య మామ తిట్టటం మొదలెడతాడు . ఆయన తిట్టి అయినా తినిపించే రకం. అందుకే మెల్లగా ప్లేటు పట్టుకున్నాను.
మామ, అత్త ఇద్దరూ సేలా మంచోళ్ళు .సేలా మనసున్నోల్లు . ఎవరికీ అపకారమే సేసి ఎరగరు. మా మిత్రులందరినీ సేలా బాగా సూస్కుంటారు.
మా అత్తా మామలకి పెళ్ళైన సేన్నాల్ల వరకూ పిల్లల్లేరట.
పిల్లల్లేరని మా అత్త బాధ పడుతుంటే , మా మావయ్య కొన్ని కోడి పిల్లల్ని తెచ్చి , ఇవే నీ పిల్లలు అన్నాడట.
అప్పట్నుంచీ అత్తయ్య ఆ పిల్లలకి తల్లి అయిపోయింది . సేనా పేనం గా పెంచటం మొదలెట్టింది. తర్వాత మా ఈరబాబు పుట్టేడు. మా ఈరబాబు కూడా ఆ కోళ్ళని సేనా బాగా సూస్కుంటాడు. సిన్నప్పట్నుంచీ ఆడితో ఆడుతూ , ఆడికి ఒంటరి తనమంటే ఏంటో తెలియకుండా పెంచిన నేస్తాలు కదా..!
ఆడికి మేమెంతో ఆ కోళ్ళూ అంతే .
కోళ్ళ కి మేత వెయ్యాలి , నీళ్ళు పెట్టాలి , ఇంటి పని వంట పని సూస్కోవాలి .. ఇలా మా చంద్రమ్మ అత్తకైతే క్షణం తీరిక ఉండదు.

చుట్టు పక్కల అమ్మలకు వాళ్ళ పిల్లలెవ్వరికీ అన్నం తినిపించటానికి ఎక్కువగా సమయం పట్టదు. ఎవరైనా పిల్లలు ఏడిస్తే చాలు , వాళ్ళమ్మ "బోబు చూద్దామా అమ్మా ?" అంటూ మా ఈరబాబు గాడి ఇంటికి తీసుకొచ్చేస్తుంది . నా బాల్యం కూడా ఆ కోళ్ళ మద్యనే చాలా సరదాగా గడిచిపోయింది.
సర్లే మామా సాయంత్రం వస్తాను , వెళ్ళొస్తా అత్తయ్యా అని చెప్పి నేను మా ఇంటికి వచ్చేసాను.
" ఒరేయ్ కేశవా , మన ఈరబాబు గాడి కోడి కొత్తపేట లో రెండు పందేలు నేగ్గేసింది రా , ఓ అరగంట లో మూడో పందేనికి సిద్దం అయి పోతున్నారు రా " అని మా గంగరాజు గాడు మద్దేనమేలకి ఫోను సేసేడు.
పలివెల నుంచి అడ్డ రూటు తీసుకుని , అరగంటలో కొత్తపేట సత్యచంద్ర థియేటర్ ఎనకాలున్న కొబ్బరితోటల్లో వాలి పోయేను.
మా ఈరబాబు గాడు మొహం ఎర్రబడి పోయి ఉంది. మొదటి పందెం నేగ్గేకా ఊరు వచ్చెత్తుంటే , రెండో పందానికి కొమరాజులంక వాళ్ళు అడిగేరట.
దానికి ఒప్పు కోక వచ్చేత్తున్న మా ఈరబాబు గాడిని పరుష పదాలతో ఆల్లంతా రెచ్చగొట్టేరట. ఈడు అసలే ఉడుకుమోతోడు. పందానికి సిద్ద పడ్డాడు. సూత్తానికి వచ్చిన డబ్బున్నోల్లు కొంతమంది వేలకు వేలు పందేలు కాసుకున్నారు.మాట కి మాట సమాధానం సెప్పటం సేతకాని మా ఈరబాబు , ఈడి కోడి వల్ల ఆళ్ళ నోళ్ళు మూయించేడు. కానీ ఈడి ఉడుకు మోతుతనమే ఈడి మూడో పందేనికి కూడా కారణం అయ్యింది.
(ఇంకా ఉంది ..)
హ హ్హ హ్హ చాల బాగుంది మీ టపా ..waiting for next post..:)
ReplyDelete