Saturday, July 6, 2013

ఓ హెన్రీ కథ ప్రేరణతో -లుటేరా ( LOOTERA)



 ఈ లైన్ చూడు,  సినిమా ఓ హెన్రీ కథ ప్రేరణగా తీసిన సినిమా అట..
అయ్యుండొచ్చు. హెన్రీ కథలు నేను చదివాను . చాలా వరకూ ఇలానే ఉంటాయి. ప్రేమికుల మద్య చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న కొట్లాటలు, చిన్న చిన్న త్యాగాలు వీటితోనే అతని చాలా కథలు అల్లుకుని ఉంటాయి.
ఔనా ?
ఔను .. మచ్చుకోకథ మనం ఈ సినిమా థియేటర్ బయటకెళ్ళే లోపు చెప్తా విను.
ఓ అందమైన భార్యా భర్త ఉంటారు.  ఇక్కడ అందం అంటే రూపు రేఖల్ని గురించి కాదు. మనస్సు గురించి. మనస్సుల్లో కల్మషం లేనంతవరకూ ఏ బంధమైనా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ జంటలో భర్తకి ఓ వాచ్ ఉంటుంది. వాచ్ బావుటుంది కానీ దాని స్ట్రిప్ అంతగా బాగోదు. అతనికెలాగైనా స్ట్రిప్ ని గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందని ఆమె అనుకుంటూ ఉంటుంది. ఐతే ఆమె దగ్గర డబ్బులుండవు. అందమైన కురులు మాత్రమే ఉంటాయి. ఆమె భర్తకి ఆమె కురులంటే భలే ఇష్టం. ఆ కురులకి ఇంకా అందం తెచ్చేట్టు ఉందనిపించేలా ఓ క్లిప్ కనిపిస్తుంది. అతనిదగ్గరా డబ్బులుండవు. దాంతో చేతికున్న వాచీ అమ్మేసి ఆ క్లిప్పు, ఇంకొన్ని సామాన్లు ఆమెకోసం కొనుక్కుని ఆమెదగ్గరికి వెళ్తాడు. ఓయ్ .. నీకో గిఫ్ట్ తెచ్చానంటాడతను . నేనూ మీకోసం ఓ గిఫ్ట్ కొన్నాను అంటుందామె. ఇద్దరూ ఒకేసారి గిఫ్ట్ లు చేతులు మార్చుకుంటారు. ఆమె కురులకోసం అతను వాచీ అమ్మేస్తే, ఆమె అతని వాచీకోసం ఆమె కురుల్ని అమ్మేసి స్ట్రిప్ కొంటుంది. చివరకి ఇద్దరికీ ఇష్టమైనవి
బాగుంది కథ. ఓ హెన్రీ కథలు అనే పుస్తకాన్ని నిన్న మొన్నల్లో ఎక్కడో చూసాను. DLI లోనో, లేక  కోఠి బజార్లోనో.. అది సరే కానీ ఈ సినిమా నీకెలా అనిపించింది.
సినిమాలోనే ఓ సెంటెన్స్ ఉంది. చూడు మాస్టర్ పీస్”. అలా అనుకోవచ్చు.
         
ఏంటిదంతా అనుకోవద్దు. లుటేరాసినిమా చూసి బయటకొచ్చేప్పుడు , నాకు వేణుకు మద్య జరిగన సంభాషణా సారమిది. సినిమా గురించి చెప్పాలంటే ఓ కథకి ప్రాణం వచ్చి దృశ్యంలా మారితే అది లుటేరా.  బాలీవుడ్ ఇప్పుడు స్టేటస్ సింబల్ గా చెప్పుకుంటున్న 100 కోట్ల కలెక్షన్ సినిమా అనే మార్క్ ఈ సినిమాకి  ఈ సినిమా అందుకోవచ్చు, అందుకోక పోనూవచ్చు.  కానీ మంచిసినిమాగా, ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాగా లుటేరాకి మంచి మార్కులే పడతాయి. 





సినిమా కథ విషయానికొస్తే 1953 వ సంవత్సరం లో ఓ జమీందారీ సంస్థానం నేపద్యంలో జరుగుతుంది.
ఆ సంస్థానాధీశుని ఏకైక కుమార్తె  శ్వాస సంబంధమైన ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. చిన్నప్పుడు శాంతినికేతన్ లో చదువుకుని, ప్రస్తుత కాలంలో పొగరుగా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ కారు డ్రైవర్ ని బెదిరించి చిన్న చిన్న రోడ్లపైకూడా మరీ వేగంగా కారుని నడుపుతుంది. అలా నడుపుతూ ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ వ్యక్తిని కింద పడేస్తుంది. అతన్ని హాస్పిటల్ లో చేర్పించి అతన్నే చూస్తూ ఉండిపోతుంది. తర్వాతి రోజు తొలి వలపుల తొలి ఆకర్షణని తను అనుభవించే క్షణానే అతగాడు తన ఇంట్లో ప్రత్యక్షం అవుతాడు. తను పురావస్తు శాఖకి సంబందించిన వ్యక్తిననీ, ఆ జమీందారీ లో తవ్వకాలను జరిపేందుకుగానూ అనుమతి ఇవ్వాల్సిందిగా జమీందారును కోరతాడు. మాటల మద్యలో సోనాక్షిని  అతనికి పరిచయం చేస్తాడు. ఆమెకు రాయటం అంటే ఇష్టమని చెప్తాడు. ఆమె ఏదో ఒక పాత పుస్తంలో తనకు నచ్చిన వాఖ్యాల్ని చదివి వినిపిస్తుంది, మద్యలో  అతనూ గొంతు కలుపుతాడు. అతనికున్న సాహిత్యాభిలాషని ఇష్టపడ్డ జమీందారు అతన్ని తన ఇంట్లోనే ఉండాల్సిందిగా కోరతాడు. అతడు తన స్నేహితునితో పాటూ  జమీందారు ఇట్లో ఉండటం మొదలెడతాడు. సమానుతో పాటు పెయింటింగ్ కాన్వాస్ ని కూడా ఆ ఇంట్లో పెడతాడతను. ఎప్పుడూ ఖాళీగా తప్ప ఏరోజూ  దానిమీద ఒక్క గీత కూడా తను చూడలేదని అతని స్నేహితుడు ఎద్దేవా చేస్తాడు. నేను ఆలోచిస్తున్నాను, అన్వేషిస్తున్నాను. ఈరోజు నేను గీయక పోవచ్చు. కానీ ఏదో ఓ రోజు నేను గీసిన చిత్రంగురించి ప్రపంచం తప్పక మాట్లాడుతుంది. అలాంటి ఓ మాస్టర్ పీస్ నేను గీస్తానని జవాబు చెప్తాడు అతడు.  తన గదిలోంచి కింద ఉన్న కాన్వాస్ ని  గమనించిన ఆమె, తనూ పెయింటింగ్ నేర్చుకుంటానని తండ్రిని కోరుతుంది. ఆ విధంగా ఆమెకు పెయింటిగ్ నేర్పటానికి వచ్చిన అతనికి ఆమె పెయింటిగ్ నేర్పుతుంది.  ఇద్దరిమద్యా పరిచయం ప్రేమగా మారుతుంది. తను ఆమెను ప్రేమిస్తున్నాని తన స్నేహితుడితో అంటాడతను. మన పనికాగానే తిరిగి వెళ్ళిపోయే వాళ్ళం. ఇంతలో ఆ అమ్మాయిలో అలాంటి ఆశలు రేపటం మంచిది కాదన్న అతని స్నేహితుడు సలహాతో తర్వాతి రోజు నుంచి ఆమెకు దూరంగా ఉండ బోతాడతాడు. ఆ రోజుంచి ఆమె దగ్గర పెయింట్ నేర్చుకోవటానికి వెళ్ళటమే మానేస్తాడు. ఆమే అతను పనిచేసే స్థలానికొస్తుంది. ఎందుకు దూరంగా ఉంటున్నావని అతన్ని నిలదీస్తుంది. చాలా ఆవేశ పడుతుంది.అప్పుడే ఆమెకున్న అనారోగ్యంగురించి అతనికి తెలిసొస్తుంది. ఆమెకు మానసికంగా మరింతదగ్గరౌతాడతను.


ఇంతలో జమీదారీ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. జమీందారుకు 15 ఎకరాల భూమి మినహా మరేమీ ఉండకూడదని, జమీందారీ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమవుతాయని ప్రకటిస్తుంది.  ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి జమీందారీ దివాణంలో సోదా చేస్తాడు. ప్రభుత్వానికి చెందిన సామాన్లన్నీ ప్రభుత్వ ఖజానాకు తరలించటానికే వచ్చినట్లు   జమీందారుకు చెప్తాడు. జమీందారు దానికి ససేమిరా కాదని అంటాడు. అదెలా కుదురుతుందని ? ఆ వస్తువులు ఈస్టిండియా వర్తక కంపెనీ తన పూర్వీకులకు బహుమతిగా వందేళ్ళ క్రితం బహుమతిగా ఇచ్చినవని వాదిస్తాడు.
ఈస్టిండియా కంపెనీ ఇచ్చినవేమీ కంపెనీ స్వంత సొత్తుకాదని, ప్రజాధనాన్ని దోచుకుని ఇచ్చినవని అవి తిరిగి భారత ప్రభుత్వానికే చెందుతాయని  ఆ అధికారి చెప్పి ఆ సామాన్లని జప్తు చేసేసుకుంటాడు.   

బ్రిటీష్ ప్రభుత్వం నుంచి మీకు స్వాతంత్రం వచ్చింది. మాకు పోయింది. మేం చేసిన తప్పేంటి ? మన దేశ స్వాతంత్రం కోసం మేమూ పాటు పడ్డాం? అజాద్ హింద్ ఫౌజ్ కోసం మేమూ ఖర్చు చేసాం. అలాంటిది మన దేశం లో మేం పరాయి వాళ్ళం అయిపోయాం. ప్రభుత్వం దోపిడీకి దిగింది. జమీందారులపై కక్షకట్టింది. అని జమీందారు ఆ ఇంట్లో ఉంటున్న యువకుడితో వాపోతాడు.
ఈ ఊరికి వచ్చిన పని అయిపోవటం వళ్ళ, తను వెళ్లి పోవాల్సి ఉందని, ఐతే ఇప్పటికి మించిపోయిందేమీ లేదని ఈ జమీందారీలో అతి విలువైన వస్తువులు ఇంకా చాలా ఉన్నాయని, మీరు ఒప్పుకుంటే వాటిని అమ్మటంలో తను సహాయం చేస్తానని ఆ యువకుడు అంటాడు. దానికి జమీందారు ఒప్పుకుంటాడు.

జమీందారు కుమార్తె అతను వెళ్లి పోతానంటే వెల్లొద్దని బతిమాలుతుంది. కన్నీటితో అతని చెంత చేరిపోతుంది. మరుసటిరోజు జమీందారు కూతుర్ని పెళ్లి చేసుకుంటానని జమీందారుని కోరతాడతను. దానికి జమీందారు ఒప్పుకుంటాడు. పెళ్లి పనులు మొదలౌతాయి. జమీందారు ఆయువకుడు చెప్పిన వ్యక్తికి పురాతణ వస్తువుల్ని అమ్మేస్తాడు. ఆ వ్యక్తి  ఆ యువకున్ని పెంచిన వ్యక్తి. ఈ పెళ్ళికి అతను ఒప్పుకోడు. ఒక వేళ అతనుగానీ జమీందారు కూతుర్ని చేసుకుంటే .. జమీందారు దివానంలో ఉన్న  అతిపురాతన వస్తువుల్ని, పురావస్తు శాఖ అనే నెపంతో  సొరంగ మార్గం ద్వారా దోపిడీ చేసిన పథకం మొత్తం బయట పడుతుందని భయపెడతాడు...

ఇక్కడితో లుటేరా ( దోపిడీ దారుడు ) ఎవరనేది మనకి తెలుస్తుంది.
              వస్తువులకి బదులుగా ఇచ్చిన డబ్బులు కూడా నకిలీవని తేలుతుంది. కూతురు పెళ్లి ఆగిపోయిన దుఃఖానికి, నమ్మక ద్రోహానికి జమీందారు గుండె ఆగిపోతుంది. జమీందారు కూతురు ఆరోగ్యం క్షీణించి, కృశించి పోయి రోజులు లెక్క పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత  ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కలుసుకున్నారు. ఆమె ప్రతీకారం తీర్చుకుందా ?. అతను మారాడా ? అతని ప్రేమలో నిజమెంత ? అనే అంశాలతో ద్వితీయార్ధం సాగుతుంది.
జీవితాన్నంతటినీ  ఒక్క పుస్తకంలో అయినా రాద్దామనే ఆఖరి ఆశతో ఆమె రచన ప్రారంభం అవుతుంది.
ఒకానొక సందర్భంలో ఎందుకిలా చేసావ్ . నాకెదురుగా ఒక చెట్టుంది. రోజూ దాన్నే చూస్తాను . ప్రతీరోజూ దానికున్న ఆకులు రాలిపోతూ ఉంటాయి. నాలో ఆశల్లా.  దాని చివర ఆకు రాలిన క్షణాన నాలో ఆశే కాదు, నా శ్వాస కూడా ఉండదు. నన్నలా నువ్వే మార్చావ్. నాకంటూ నాకేమీ లేనట్టు. నాకే నేనేమీ కానట్టు ..  అని రాస్తుంది.

అనుకోకుండా ఆ వాక్యం అతని కంట పడుతుంది . ఎదురుగా ఒక్కో ఆకుని కోల్పోతూ నగ్నంగా మారిపోతున్న చెట్టుని చూస్తాడు. ఆఖరి ఆకుతో తన ఆశల్ని .. ఆమాట కొస్తే జీవితాన్నే ముడిపెట్టుకున్న ప్రియురాలికోసం ఒకే ఒక చిత్రం గీస్తాడు. అతనుగీయాలనుకున్న మాస్టర్ పీస్ వాడిపోని. రాలి పోని ఆకు .. చిట్ట చివరి ఆకు .. ఆకుని చిటారు కొమ్మన వేలాడేసి .. పోతాడు. ఎప్పటికీ ఆమె శ్వాస ఆగిపోకూదనే ఆశ తో .. అతనెళ్ళిపోతాడు.. అతని జీవిత గమ్యం వైపు ..


లుటేరా కి స్పూర్తినిచ్చిన ఓ హెన్రీ కథ .. The Last Leaf “.
కథ , దర్శకత్వం : (విక్రమాదిత్య మోత్వానే  ). 
స్క్రీన్ ప్లే : (భవానీ అయ్యర్ , విక్రమాదిత్య మోత్వానే )
సంగీతం  : ( అమిత్ త్రివేది )

మంచి సినిమా , మిస్ కాకుడా చూడొచ్చు. 

No comments:

Post a Comment