Tuesday, February 1, 2011

రెండు చుక్కలు ..


చాలా మంది లాగానే సతకం పెట్టిన తర్వాత ,క్రింద ఒక గీత గీసి రెండు చుక్కలు పెట్టటం నాకు అలవాటు. సంతకానికి కింద గీతంటే నాకు ఇష్టం.అది నా సంతకానికి సప్పోర్ట్ గా ఉండటమే కాకుండా, దానికి అందాన్ని కూడా తెచ్చి పెడుతుందనేది ఒక కారణమైతే," ఈశ్వర్" సినిమా రెండో కారణం.

ఆ సినిమాలో హీరో అతని సంతకానికి చివరగా, రెండు చుక్కలు పెడతాడు.
దీని అర్దమేంట్రా అని అడిగిన అతని ఫ్రెండ్స్ తో " అవి పెళ్లి రోజున బుగ్గలకు పెట్టే చుక్కలు . ఒకటి నాది. రెండోది నా పోరిది" అని సమాధానం చెప్తాడు.

ఆ సినిమా చూసినప్పట్నుంచి నేను కూడా నా సంతకం చివరన ఉన్న రెండు చుక్కల్ని చూసి అలాగే ఫీల్ అవ్వటం మొదలెట్టాను.
వీలుదొరికినప్పుడల్లా ఆ రెండు చుక్కల్నీ రెండు కళ్ళుగా మార్చి ఒక కార్టూన్ స్మైలీ తయారు చేసే నేను అప్పట్నుంచీ , చుక్కల్ని చుక్కల్లానే ఉంచటం మొదలెట్టాను .

రోజులు గడిచేకొద్దీ నాసంతకం నా పేరులా కనబడటం మానేసి , ఎప్పుడో జరగబోయే నా పెళ్ళిని ప్రివ్యూలా కనబడటం మొదలెట్టింది.

అందంగా అలంకరించబడ్డ పెళ్లి పందిరిలా నాపేరు.
ఆ పందిట్లో పెళ్లి పీటల్లా పరచుకున్ననాసంతకానికి క్రింది గీత, మా ఇద్దరి బుగ్గన చుక్కలు.

నా సంతకాన్ని ఎప్పుడైనా అలా ఊహించుకుంటే మొదట చిన్నటి నవ్వు , తర్వాత సన్నటి సిగ్గు, ఆ పైన "ఒక చుక్కను పెట్టించుకునేది నేను, మరి మిగిలిన చుక్కను పెట్టించుకునే తను ఎవరు ?" అనే ఆలోచన, వీటితో పాటు "ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక !" సాంగు, ఇలా ఒకదాని వెంట ఒకటి బోలెడన్ని ఆలోచనలు వద్దన్నా వచ్చేస్తూ ఉంటాయి. నాకు మాత్రమే సొంతమైన అందాల లోకం లోకి షికారుకు తీసుకెళ్తూ ఉంటాయి.

No comments:

Post a Comment