చాలా రోజుల క్రితం ( అంటే ఓ మూడు,నాలుగేళ్ల క్రితం ) నేనొక వీక్లీ లో చదివిన కథ.
ఎందుకో తెలీదు కానీ , శైలబాల గారి బ్లాగులో ఓ కామెంట్ చూసిన తర్వాత పదే పదే గుర్తొస్తుంది.
కథ ఇలానే ఉంటుంది , అంటే ఇవే పదాలు ఉంటాయని కాదు . కానీ నాకు గుర్తున్నంతవరకూ ఇలానే ఉంటుంది
క్లుప్తంగా ఆ కథలో ..
పేరుకునోచుకోని రచయిత ( అంటే వాళ్ళమ్మా నాన్నా ఏ పేరూ పెట్టలేదు అని కాదు, ఆయనకి మారుపేర్లు ఎవరూ పెట్టలేదని అసలే కాదు)ఒకాయన ఉంటాడు. అతని రచనలని ఎవ్వరూ పట్టించుకోకపోవటం, సరిగ్గా ప్రోత్సహించక పోవటం, మెచ్చుకోలుగా కాకపోయినా,కనీసం ముక్తసరిగా అయినా ఎవరూ "బావుందయ్యా, బాగారాసావ్ ! " అనేవాళ్ళు లేకపోవటం తో మనసు బాద పడినా అతని రచనని అంతటితో ఆపేసి , రాసిన కధల కాగితాల్ని అటకెక్కించేస్తాడు .మొదట్లో దానికి ఆయన బాద పడ్డా, తర్వాత తర్వాత అలవాటు పడతాడు.
ఒకానొకరోజున బయట వర్షం పదుతూండగా, అతని కూతురు " నాన్నా కాగితం పడవలు చేసిపెట్టవా ! " అని ముద్దుగా అడగటంలోకి , ఇల్లంతా వెతికి వెతికి ఏ కాగితమూ కనపడక పోవటం తో అటకమీద ఉన్న కథలకాగితాల్ని చించి, పడవలు చేసి , కూతురు కళ్ళలో సంతోషాన్ని చూసి , తను రాసిన
కథ ఇలా పనికొచ్చినందుకు గానూ ఆనందిస్తాడు .
కాలేజీ ఈడురాగానే అతని కూతురు కూడా చాలా చక్కగా కథలు రాయటం మొదలెడుతుంది. ఆయన అభిరుచే తన కూతురికి వచ్చినదానికంటే , తనకంటే ఎన్నో రెట్లు గొప్పగా , మనసుకి హత్తుకునేలా ఆమె రాస్తూ ఉండటంతో ఆయన సంతోషానికి అవధులుండవు. అతను పని చేసే ఆఫీసులోనూ , అతని స్నేహితులదగ్గరా ఆమె రాసిన కథల్ని వినిపించి , వారు రాసిచ్చిన స్పందనల్ని , సలహాల్ని సూచనల్ని తనకూతురికి ఇస్తూ ఉంటాడు.
ఆ ఉత్తరాల్ని చూసి అబ్బురపడుతున్న కూతుర్నిచూసి మురిసిపోతూ ఉంటాడు.
అయినా జంట అంటే గువ్వా గోరింకనే చెప్తూ ఉంటాం.. అంతప్రేమగా కలిసిమెలిసి ఉండాలని అంటూంటాం..
కానీ మనుషుల్లోకొద్దుల్లోకి కులాలు వేరైతేనో , మతాలు వేరైతోనో , అంతస్తులు వేరైతేనో.
ఎందుకు ఇద్దరిమద్యన ప్రేమని అంగీకరించి, పెళ్ళిచేసి కలకాలం కలిసుండమని దీవించలేకపోతున్నాం ?.. " అంటూ అతిసున్నితమైన ప్రేమకథనొకదానిని కుటుంబ బంధాలకు ముడివేస్తూ ఓ కొత్త కథనొకదానిని అతని కూతురు రాస్తుంది.
కథ :
"నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఇప్పుడేకాదు ఎప్పటికీ ఇదే మాట చెప్తాను. ఒకవేళ మన ప్రేమను మా అమ్మానాన్నలు ఒప్పుకోకపోతే , వాళ్ళను వదిలి నీతో వచ్చేస్తా ..!మీ అమ్మానాన్నా ఒప్పుకోక పోతే, నువ్వు నాతో వచ్చేయ్ .. !! అని మాత్రం అనను.ఎందుకంటే వాళ్ళు మనమీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాల్ని ఒమ్ము చెయ్యకూడదు అని నువ్వే అంటావ్ గా .. మన రెండుకుటుంబాల అంగీకారం ఉంటేనేమన పెళ్లి జరుగుతుంది. ఈ రోజు నిన్ను మా నాన్నకి పరిచయం చేస్తా , ఆయనఒప్పుకుంటే మీ ఇంట్లో మాట్లాడదాం , లేకుంటే ....... .... నన్ను క్షమించు , కనీసం క్షమించటానికి ట్రై చెయ్ .. ..ఇక అంతే శివా ! అని చెప్పి శివతో కలిసి ఇంటికొచ్చింది ప్రియ.
ప్రియా వాళ్ళ అమ్మ ముగ్గురికీ కాఫీ తెచ్చి, తనూ వాళ్ళతో పాటే కూర్చుంది.నేను చెప్పాగా శివ, చాలా మంచి అబ్బాయ్ అని ఇతనే అమ్మా , శివని పరిచయం చేస్తూ అంది.నమస్తే ఆంటీ ! ఎలా ఉన్నారు ? మర్యాదపూర్వకం గా అడిగాడు శివ.బావున్నానయ్యా, మీ అమ్మా నాన్నా అంతా బాగున్నారా ? క్షేమసమాచారాన్ని అడిగి తెల్సుకుంది ఆవిడ. మాటల మధ్యలోనే ప్రియా వాళ్ళ నాన్నకూడా వచ్చారు, పరిచయాలయ్యాకా ప్రియ వాళ్ళ నాన్న దగ్గరగా నిలబడి చెప్పటం మొదలెట్టింది .నాన్నా, శివ గురించి మీకు అన్నీ చెప్పాను బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం.ఈ రోజు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను .. "శివ నన్ను ప్రేమిస్తున్నాడు. నేను శివను ప్రేమించేదానికి ఎన్నో రెట్లు .. నన్ను ప్రేమిస్తున్నాడు.మీరెప్పుడూ అంటూ ఉంటారుగా.. నిన్ను మహరాణిలా చూస్కునే ఇంటికి నిన్ను కోడలిగా పంపుతా అని..శివ నన్ను నాలా చూస్కుంటాడు, అచ్చం మీలా నాకు అండగా ఉంటాడు . నేను మీతో ఉన్నప్పుడు ఎంత నిశ్చింతగా, ధైర్యం గా ఉంటానో శివతో ఉన్నప్పుడు కూడా అలానే ఫీల్ అవుతా ..ప్లీజ్ నాన్నా నేను అతన్ని పెళ్లి చేస్కోవటానికి ఒప్పుకోండి నాన్నా" వేడుకోలుగా అడిగింది ప్రియ .. ప్రియ అతన్ని ప్రేమించాను అన్న మాట దగ్గర్నుంచి తనలో తానులేని ప్రియతండ్రి ,ఒప్పుకోండి నాన్నా .. ప్లీజ్ ఒప్పుకోండి .. అంటూ తనచేతిని తాకిన కూతురి చేతి స్పర్శలో ఏ తేడాను గమనించలేకపోయాడుగాని , తండ్రిలో మెదులుతున్న భయాన్ని , దిగులుని , కోపాన్ని ,ప్రేమని ,సన్నటి ఒణుకుని ప్రియగమనించింది. అయిదు నిమిషాలు అని ,అస్పష్టం గానే అని అక్కడనుంచి బయటకు వెళ్ళిన ప్రియతండ్రి అతనిలో మెదులుతున్న ఆలోచనల అస్పష్టతకు నిదర్శనంగా ..ఒక పద్దతిలేకుండా ఆరుబయట అటూ ఇటూ కలదిరిగి , తిరిగొచ్చి సమాధానం చెప్పటానికి వాళ్ళముందు కూర్చున్నాడు. నాన్న ఏమి చెప్తారో అన్నట్లు గా చున్నీని మెలికలు తిప్పుతున్న ప్రియ మొహం లో ఆందోళనని గమనించిన శివ,"మీరు ఇప్పుడు చెప్పబోయే విషయం రెండు ఊళ్లకో , రెండు కుటుంబాలకో సంబంధించింది కాదు ,రెండు మనసులకి , ముఖ్యంగా మీ అమ్మాయి జీవితానికి సంభందించింది. మీ అమ్మాయిని నేనెలా చూస్కుంటానో అన్నదిగులు మీకొద్దు , మీ అమ్మాయి సంతోషానికి నాది హామీ " అని , తనవైపే చూస్తున్న ప్రియతండ్రితోఅన్నాడు శివ . శివమాటలకి మనసు మారినా మారకపోయినా , సూటిగా మాత్రం అతన్ని చూడలేనన్నట్టు చుట్టూ పరిసరాల మీదికి చూపు మరల్చిన ప్రియతండ్రి తన నిర్ణయం లో ఎలాంటి మార్పు లేదన్నట్టు నిటారుగా నిలబడి చెప్పసాగాడు, నా జీవితం లో ఏదయితే జరగకూడదనుకున్నానో అది ఈ రోజు జరిగింది. నా కూతురు అడిగిందల్లా ఇచ్చానన్న సంతృప్తితోనే కాలం గడిపేద్దాం అనుకునేవాడిని , నాకాభాగ్యం కూడాలేదని ఈరోజు తేలిపోయింది.(అతనేమి చెప్పాలనుకుంటున్నాడో అర్ధమైనట్లు వారి మద్యలో కఠిక నిశ్శబ్దం ఆవరించుకుంది. )ఈరోజు తర్వాత నన్ను నేను క్షమిచుకోగలనా అనేకంటే,నాకూతురికి నా మొహం ఎలా చూపించాలి అనేదే నన్నెక్కువ తొలిచేస్తుంది.ఏది ఏమైనా చెప్పాలనుకున్నది _______నాకు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యటం ఇష్టం లేదు బాబు.ఎందుకిష్టం లేదు ? అడిగాడు శివ .నీకు తెలియనిదేం కాదుగా ?బదులిచ్చాడు ప్రియతండ్రిమీకులం అబ్బాయే అయితే చేసేవారా ?లక్షణం గా చేసేవాడిని ..అంటే మీకు మనుషులు , మనషులు , మీ కూతురి సంతోషం అన్నింటికంటే కులమే కావాలా ? నా కూతురి సంతోషంతో పాటూ, నా కుటుంబ గౌరవమర్యాదలు కూడా కావాలి.మీకులం అబ్బాయితో మీ అమ్మాయి సంతోషం గా ఉంటుందని మీరు చెప్పగలరా ?ఉండదని నువ్వు చెప్పగలవా?ముమ్మాటికీ చెప్పగలను .. నన్ను ప్రేమించి వేరొకరితో ఖచ్చితంగా సంతోషంగా ఉండలేదు.ఆర్ద్రం గా మారిన గొంతుతో వాదిస్తున్నట్లు, కళ్ళతో బతిమాలుతున్నాడు శివ .అతని ప్రేమలో నిజాయితీముందు ,తనపెద్దరికం ఓడిపోతుందని గ్రహించాడు ప్రియతండ్రి .ఏది ఏమైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.నా నిర్ణయం మారదు. ఈ విషయంపై కలవటాలు, మాట్లాడటాలు అనవసరం ... మరోసారి బిగ్గరగా అరిచాడు .అతని నిర్ణయాన్ని ఏ మాత్రం ఒప్పుకోమని, అతని ఆవేశాన్ని చల్లార్చటానికి బద్దలైన మంచుపర్వతాలు కరిగి ప్రవహించేలోగా, తడబడుతున్న పెద్దరికపు అడుగులతో అక్కడనుంచి తప్పుకున్నాడు.వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని , అలానే సోఫాలో కూలబడ్డ అతడిని చూస్తూ ఎటూ మాట్లాడలేని బేలతనం తో ప్రియతల్లి స్థానువై నిలిచుండి పోయింది.వాళ్ళిద్దరినీ కదిలించే ధైర్యం నాకు లేదు. ఏమైతేనేం వాల్లప్రేమ కథ ఇంతటితో సమాప్తం"
ఈ కథ ముగింపు నాకు నచ్చలేదమ్మా !
కథ మొత్తం చదివాకా కూతురు తో అంటాడు అతను .
ఎందుకునాన్నా ?
వాళ్ళ అమ్మ ఇచ్చిన కాఫీ తీసుకుంటూ తండ్రికి ఎందుకు నచ్చలేదో తెల్సుకుందామని అడుగుతుంది ఆమె.
అంతగా ప్రేమించుకున్న వాళ్ళిద్దరినీ విడదీయటం , అదీ పెద్దరికం అని ఏదో ఓ సాకు చెప్పటం , కేవలం కులాలు ఒకటి కావుఅని
ఆపెద్దాయన పిల్లల ప్రేమని అంగీకరించక పోవటమే నాకు నచ్చలేదు.
ఏదో గజిబిజిగా ఉంది రాసాను నాన్నా , తర్వాత మళ్ళీ ఒకసారి నేను చూసి చెప్తాలే - అని కూతురు అభయం ఇవ్వటం తో అతడు కొంచెం శాంతిస్తాడు.
సాయంత్రం పూట కాఫీ తాగుతూ పేపర్ ని తిరగేస్తున్న అతని పక్కగా వచ్చి కూర్చుంటుంది అతనికూతురు .
ఆ కథని ఏం చేశావమ్మా ? అని అడుగుతుండగానే కాలిగ్ బెల్ మోగుతుంది.
ఆమెవెళ్లి తలుపుతీసి లోపలి ఆహ్వానిస్తుంది.
మీరెవరండి ? - వచ్చిన వ్యక్తిని అడిగుతాడు
వచ్చింది ఎవరో ఊహించగల్గిన అతని భార్య నవ్వుతూ కాఫీ తీసుకురావటానికి వంటగదిలోకి వెళ్తుంది .
"నా పేరు శివ . మీ అమ్మాయి నాగురించి చెప్పే ఉంటుంది . నేనూ మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం . మీరు ఒప్పుకుంటే పెళ్లి చేస్కోవాలని ఆశపడుతున్నాం .
మా అమ్మా నాన్నలకి ఏ అభ్యంతరమూ లేదు. ఇక నిర్ణయం తీస్కోవల్సింది మీరే. " అని అతను అంటూండగా
తన తండ్రి మొహం లో హావ భావాల్ని చూసి లోలోపల నవ్వుకుంటూ ఉంటుందామె.
కూతురిచ్చిన ఈ ట్విస్ట్ కి , ఏదోలా తేరుకుని అయిదు నిమిషాలు అని అప్రయత్నం గానే అని , బయటకెళ్ళి అటూ ఇటూ నాలుగు పచార్లు చేసి లోపలికొచ్చి ఓ గ్లాసు మంచినీళ్ళు తాగి , నాకు కొంచెం టైం కావాలి అని చెప్తాడు.
"ఎలాగూ ఊ.. అనే అనాలిగా , దానికోసం ఇంత చెయ్యాలా ? పైగా నాలుగురోజుల టైం కూడాను " అన్నట్టు ఓ చూపు చూసి , అతనిచేతిలో వేడివేడి కాఫీ పెడుతుంది అతని భార్య..
ఆకాశంలో మబ్బులు పట్టేసి , మిరపకాయబడ్డీలోల్లకి మంచిగిరాకీ ఉన్న టైం లో కూతురురాసిన కథల కాగితాల్ని ముందెట్టుకుని
కూతుర్ని దగ్గరికి పిలిచి "శివని నువ్వు పెళ్లి చేస్కోవటం నాకు ఇష్టమే అమ్మా !"అని ఆ శుభవార్త ఆమె చెవునవేస్తాడు.
ఆమె సిగ్గుల మొగ్గయ్యి ఆ వార్తని అమ్మకి చెప్పటానికి వంటగదిలోకి వెళ్తుంది .
కూతురు రాసిన కథను వాళ్ళదగ్గరికి తీసుకెళ్ళి,
ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలుపు తల్లీ ! లేకపోతే నాలోని సగటు మాజీ.తెలుగు రైటర్ సహించేలా లేడు. అంటాడు .
అతని చేతిలో కాగితాన్ని పడవగా మలుస్తూ ,
"నిజ జీవితంలోనే కాదు , నా కథలలో కూడా శివ నావాడు. వేరొకరికి చెందటాన్ని నేను సహించను అని చెప్తుంది "
_______________________________________________
నా మనసుకు హత్తుకుపోయిన కొన్నికథల్లో ఇది ఒకటి.
రచయిత ఎవరో తెలీదు కానీ, నా స్పెషల్ థాంక్స్ . .
* It may be the subject of copy right. If there is any objection i will remove it from my blog ..
THANK YOU..